కుల రహిత సమాజం, కుల ప్రస్తావన లేని రాజకీయాలు రావాలన్నది అంబేద్కర్ సహా ఎంతోమంది మేధావులు, విశ్లేషకులు, సామాన్య ప్రజల కాంక్ష. కానీ ప్రస్తుతానికి అది సుదూర స్వప్నమే. కుల రహిత సమాజం సాధ్యం కానప్పుడు కనీసం అన్ని కులాలకు సమాన అవకాశాలు కల్పించగలగాలి అన్న ప్రజాస్వామ్య బద్ధమైన కోరికే రాజకీయ విశ్లేషణలలో కుల ప్రస్తావన చేయవలసి రావడానికి ప్రాతిపదిక. అన్ని కులాల్లోనూ వెనుకబాటుతనం ఉన్నప్పటికీ, శతాబ్దాలుగా వెనుకబాటుతనం తో పాటు వివక్ష కూడా ఎదుర్కొన్న కారణంగా, దళితుల సమస్యలు, వారి ఆకాంక్షలు ప్రతి ఎన్నికల సమయంలోనూ తెరమీదకు వస్తూ ఉంటాయి. అయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో దళితులు ఏ రకమైన పాత్ర పోషించారు, ఏఏ సందర్భాల్లో ఏఏ రాజకీయ పార్టీలకు వారు అండగా నిలిచారు, అన్నది విశ్లేషించడం ఈ కథనం ఉద్దేశ్యం.
అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఏదైనా వర్గం ఒక పార్టీకి అండగా ఉంది అంటే దానర్థం ఆ వర్గంలోని వంద శాతం ప్రజలు అదే పార్టీకి ఓటు వేసినట్లు కాదు, ఆ వర్గంలోని అత్యధికులు ఆ పార్టీకి అండగా ఉన్నారు అని అర్థం. ఏ విశ్లేషణ ఆయన ఇలా “మెజారిటీ ట్రెండ్” మీద ఆధారపడే కొనసాగుతుంది.
భూ సంస్కరణలతో దళితులను శాశ్వత ఓటు బ్యాంకుగా మార్చుకున్న ఇందిరాగాంధీ
కాంగ్రెస్ మాత్రమే ఆంధ్రప్రదేశ్ లో ఏకైక ప్రధాన పార్టీగా ఉన్న సమయంలో, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. అప్పట్లో ఒక జోక్ ఉండేది. ఎవరైనా ఇందిరాగాంధీ వద్దకు వెళ్ళి మిమ్మల్ని కలవడానికి ఆంధ్ర ప్రదేశ్ నుండి ఎవరో వచ్చారు అని చెబితే ఆమె ” Which Reddy is he?” అని అడిగేదట. అయితే, ఇందిరాగాంధీ తన రాజకీయ జీవితంలో తీసుకున్న కొన్ని ప్రధాన నిర్ణయాల్లో ఒకటి భూసంస్కరణల అమలు. భూ పరిమితి చట్టాన్ని తీసుకు వచ్చి, నిర్దేశిత పరిమితి కంటే ఎక్కువ వ్యవసాయ భూమి కలిగిన వారి నుంచి ఆ అదనపు భూమిని ప్రభుత్వం తీసేసుకుని, ఆ భూమిని ఆయా ఊళ్ల లోని దళితులకు పంచిపెట్టారు. అయితే ఇందిరా గాంధీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని అనేక మంది న్యాయస్థానం లో సవాలు చేశారు. ఇందిరాగాంధీ తీసుకున్న నిర్ణయాన్ని కొన్నిసార్లు సుప్రీంకోర్టు కొట్టివేస్తే, తన నిర్ణయాన్ని అమలు చేయడానికి ఇందిరాగాంధీ 24వ మరియు 25 వ రాజ్యాంగ సవరణలు తీసుకు వచ్చింది. ఆర్టికల్ 39బి, సి ప్రకారం దేశ వనరులను అందరికీ సమానంగా అందజేయాలన్న ఆదేశ సూత్రాన్ని అమలు చేయడానికి చేస్తున్న భూ సంస్కరణలని కోర్టులు సైతం ప్రశ్నించలేని విధంగా 24, 25 వ రాజ్యాంగ సవరణలు చేసింది. భూ సంస్కరణలు ఎటువంటి కోర్టు కేసుల చికాకులు లేకుండా అమలు చేయడం కోసమే రాజ్యాంగంలో 9వ షెడ్యూల్ అదనంగా చేర్చింది. అటు న్యాయస్థానాల తో పాటు, ఇటు భూస్వాముల తో పాటు, సొంత పార్టీలోని కొంతమంది నాయకులతో సైతం దీని కోసం పోరాడింది. తమకు భూములు కేటాయించడం కోసం ఇందిరాగాంధీ చేస్తున్న పోరాటం దేశవ్యాప్తంగా దళితులని ఆకర్షించింది. అందుకే దళితులు ఇందిరాగాంధీ మీద, కాంగ్రెస్ పార్టీ మీద అపారమైన అభిమానం పెంచుకుని ఆ పార్టీకి శాశ్వత ఓటు బ్యాంకుగా మారిపోయారు.
మరి ఇందిరాగాంధీ కంటే ముందు దళితులు ఎవరికి ఓటు వేశారు అన్న ప్రశ్న ఉత్పన్నం కావచ్చు. అప్పట్లో చాలా వరకు రైతు కూలీలు గా ఉన్న దళితులు, తమ భూస్వామి లేదా తమ ఊరి పెద్ద లేదా తమ రెడ్డి ఏ పార్టీకి ఓటు వేయమంటే ఆ పార్టీకి ఓటు వేశారు. అయితే ఇందిరాగాంధీ భూ సంస్కరణల అనంతరం చాలా మంది రైతు కూలీలు రైతులు గా మారిపోయారు. కాంగ్రెస్ పార్టీ కి శాశ్వత ఓటు బ్యాంకుగా మారిపోయారు. దళితుడైన అంజయ్య లాంటి వారిని రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీకి ఉంది.
ఎస్సీ వర్గీకరణ – చంద్రబాబు వ్యూహం:
రెడ్లు, దళితులు కాంగ్రెస్ పార్టీకి బలంగా అండగా నిలవడంతో, ఆ తర్వాత ఎన్టీఆర్ నేతృత్వంలో రాజకీయాల్లోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ బీసీలు, కమ్మ సామాజిక వర్గాలను తమకి బలమైన ఓటు బ్యాంకుగా మార్చుకుంది. అయితే 1994 లో ఎన్టీఆర్ ను దింపి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత మందా కృష్ణ ఆంధ్ర ప్రదేశ్ లో ఒక ఉద్యమాన్ని లేవదీశారు. దళితులు అంటే ఆంధ్రప్రదేశ్ లో చాలామందికి కేవలం మాల, మాదిగ అన్న రెండు కులాలు మాత్రమే గుర్తొస్తాయి కానీ నిజానికి ఆంధ్రప్రదేశ్లో దాదాపు 60 కులాలు దళిత కులాలు గా గుర్తింపబడ్డాయి. రాష్ట్ర జనాభాలో సుమారుగా 15 శాతం ఉన్న దళితులలో దాదాపు 7 శాతం మాదిగలయితే, 6 శాతం మాలలు. మిగిలిన రెండు శాతం మిగతా అన్ని కులాలు.
90వ దశకంలో మందకృష్ణ వాదన ఏమిటంటే, మొత్తం 15 శాతం లో 6 శాతం మాత్రమే అయిన మాలలు 8 నుండి 10 శాతం దాకా సీట్లను తీసుకెళ్ళి పోతున్నారనీ, దీనివల్ల మాదిగల తో పాటు ఇతర కులాల వారు నష్టపోతున్నారు అని మంద కృష్ణ ఉద్యమాన్ని లేవనెత్తారు. తెలంగాణ రాయలసీమ కోస్తాంధ్ర తో పాటు రాష్ట్రమంతా తిరిగి ఊరూరా సభలు నిర్వహించారు. చాలా మంది దళితులను తన వాదనతో కన్విన్స్ చేశారు. నిజంగా మాలల తో పోలిస్తే మాదిగలు వెనకబడి ఉన్నారా? ఒక వేళ నిజంగానే అలా వెనుకబడి ఉంటే దానికి కారణాలు ఏమిటి అన్న దాని పై రాష్ట్రవ్యాప్తంగా 90వ దశకంలో విస్తృతమైన చర్చ జరిగింది. కొంత మంది విశ్లేషకులు అయితే ఈ వాదన నిజమేనంటూ కొన్ని “ఆంత్రొపొలాజికల్” కారణాలు కూడా తెరమీదకు తీసుకువచ్చారు. అయితే ఇప్పుడు అవన్నీ చర్చించి టాపిక్ ని కాంప్లికేట్ చేయకుండా, దీన్ని కొంత సింప్లిఫై చేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. తెలంగాణ, రాయలసీమ జిల్లాల్లో మాదిగల జనాభా ఎక్కువగా ఉంటుంది. కోస్తాంధ్ర ప్రాంతంలో మాలల జనాభా ఎక్కువగా ఉంటుంది. దళితులు అనే కాకుండా ఏ కులం వారిని తీసుకున్నా సాధారణంగా నీటి వనరులు, అభివృద్ధి ఎక్కువగా ఉన్న కోస్తాంధ్ర ప్రాంతంలోని వారితో పోలిస్తే అదే కులం లోని తెలంగాణ రాయలసీమ ప్రాంతాల వారు కాస్త వెనుకబడి ఉంటారు. ఇది దళితులకు కూడా వర్తిస్తుంది. ఆ రకంగా చూస్తే కోస్తాంధ్రలోఎక్కువ సంఖ్యలో ఉన్న దళితులు అంటే మాలలు మిగతా ప్రాంతంలో ఉన్న దళితుల తో పోలిస్తే కొంత ముందంజలో ఉన్న మాట వాస్తవమే. ఏది ఏమైతేనేమి మందకృష్ణ ఉద్యమం అప్పట్లో తీవ్రరూపం దాల్చడం, ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఎస్సీలను ఏ,బి,సి, డి గా వర్గీకరిస్తూ నిర్ణయం తీసుకోవడం, చట్టం చేయడం జరిగిపోయింది. ఎస్సి బి కేటగిరిలో మాదిగలను చేర్చి వారికి 7 శాతం రిజర్వేషన్లు, ఎస్సీ సి కేటగిరీలో మాలలను చేర్చి వారికి 6 శాతం రిజర్వేషన్లు ఇవ్వడం, మిగిలిన కులాలను ఎస్సీ ఏ ( 1%), ఎస్సి డి (1%) ల లో చేర్చడం జరిగింది.
అయితే తెర వెనుకనుక చంద్రబాబే ఉండి మంద కృష్ణ ద్వారా ఉద్యమాన్ని చేయించాడని, చంద్రబాబే దళితులను విభజించాడని అప్పట్లో కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా ఆరోపణలు చేశారు. చంద్రబాబు తెర వెనుక ఉండి చేసాడో లేదో తెలియదు కానీ ఎస్సీ వర్గీకరణ ఫలితంగా, దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిన మాదిగల లో కొంత మంది జీవితంలో మొదటిసారిగా తెలుగుదేశం పార్టీకి 1999 ఎన్నికలలో ఓటు వేశారు. చంద్రబాబు నాయుడు 1999 ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో గెలవడానికి ఎస్సీ వర్గీకరణ కూడా ఒక కారణమని విశ్లేషకులు అప్పట్లో చెప్పేవారు. ఏది ఏమైనా తనది కాని 15 శాతం ఓటు బ్యాంకు లో నుంచి ఒక 7- 9 శాతాన్ని తన వైపు చంద్రబాబు తిప్పుకోగలిగాడని విశ్లేషకులు అనేవారు. అయితే ఆ తర్వాత ఎస్సీల వర్గీకరణ రాజ్యాంగబద్ధం కాదని సుప్రీంకోర్టు కొట్టివేసింది. దీంతో పార్లమెంటులో చట్టం చేసి ఎస్సీ వర్గీకరణకు రాజ్యాంగ భద్రత కల్పించాలని ఆ తర్వాత మందకృష్ణ పోరాడడం, దాని కోసం కేంద్రం ఉషామెహ్రా కమిషన్ వేయడం, ఆ తర్వాత నెమ్మదిగా ఆ సమస్య మరుగున పడిపోవడం జరిగింది. అయితే సమస్య మరుగున పడిపోయినప్పటికీ, ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన ప్రతి పార్టీ, ఎస్సీ వర్గీకరణ మీద తమ అభిప్రాయాలు చెప్పాల్సి రావడం, వర్గీకరణకు అనుకూలమని చెబితే మాలలకు కోపం వచ్చే అవకాశం, వర్గీకరణకు వ్యతిరేకమని చెబితే మాదిగలకు కోపం వచ్చే అవకాశం ఉండే లాగా సమస్య జటిలం కావడానికి కారణం చంద్రబాబేనని చాలా మంది విశ్లేషకులు అభిప్రాయపడుతూ ఉంటారు. తన తాత్కాలిక రాజకీయ ప్రయోజనాలు ఆలోచించకుండా చంద్రబాబు కనుక దూరదృష్టితో ఆలోచించి, ఎస్సీ వర్గీకరణ ద్వారా కాకుండా ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయడం ద్వారానో మరొక రకంగానో సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించి ఉంటే కనుక దళితుల మధ్య చిచ్చు ఏర్పడి ఉండేది కాదని విశ్లేషకుల తో పాటు సామాన్య ప్రజలు కూడా అభిప్రాయపడ్డారు.
– జురాన్ (@CriticZuran)
for part 2: https://www.telugu360.com/te/a-detailed-analysis-on-the-role-of-dalits-in-andhra-pradesh-politics-part-2/