అతిలోక సుందరి శ్రీదేవి ఇక లేరు. శనివారం అర్ధరాత్రి దుబాయ్లో కన్నుమూశారు. ఒక వివాహ వేడుకకు హాజరైన ఆమె… గుండెపోటుతో తుది శ్వాస విడిచారని శ్రీదేవి మరిది సంజయ్ కపూర్ తెలిపారు. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో మూడు వందలకు పైగా చిత్రాల్లో నటించిన శ్రీదేవి ప్రేక్షకులను వదిలి వెళ్లడం ప్రతి ఒక్కర్నీ విషాదంలోకి నెట్టింది. విషాదం లోనుంచి వచ్చిన ఓ అభిమాని అశ్రువులతో శ్రీదేవికి రాసిన అక్షరాలు…
శ్రీదేవీ…
నువ్వెంత మాటల పిసినారి!
కనీసం ఒక ముక్క కూడా చెప్పావా?
నాలాంటి అభిమానులకు…
‘మిమ్మల్ని వదిలేసి వెళ్తున్నా’ అని!
‘అర్థాంతరంగా ఆయువు వదిలేస్తున్నా’ అని!
ఇప్పుడు…
మేమంతా ఏమైపోవాలి?
నువ్ లేని ఈ లోకంలో మేమంతా ఎవర్ని ఆరాధించాలి?
శ్రీదేవీ…
నువ్వెంత సొగసరి!
కనీసం కలల్లో కూడా కించిత్ అందం తగ్గదే?
నీలాంటి అందగత్తెలు ఎందరొచ్చినా…
మమ్మల్ని వలలో వేసుకుందదీ నువ్వే!
అతిలోక సుందరి అనిపించుకుందీ నువ్వే!
ఇప్పుడు…
మేమంతా ఏమైపోవాలి?
నువ్ లేని ఈ లోకంలో మేమంతా ఎవర్ని ఆరాధించాలి?
శ్రీదేవీ…
నీపై మోజు ఎంత మృధుస్వభావి!
కళ్ళల్లో వత్తులేసుకుని మరీ నీకోసమే చూస్తుంది తెలుసా?
నువ్ రావని తెలిసి…
మాకు గుండెకోత తప్పదని గుర్తించింది!
అరే.. మీ గుండెల్లోనే వుంటుందని వెంటనే గుర్తు చేసింది!
నీకు ఎన్నేళ్లు వచ్చినా…
మా కంటికి పదహారేళ్ళ వయసు పిల్లగానే చూపించింది.
అమ్మమ్మ నుంచి అమ్మాయిల వరకూ అందర్నీ నీకు బానిసలు చేసింది.
ఇప్పుడు…
మేమంతా ఏమైపోవాలి?
అఘాయిత్యాలేమీ చేసుకోములే… నీ దగ్గరకు వచ్చేయాలని!
నువ్ లేని ఈ లోకంలో మేమంతా ఎవర్ని ఆరాధించాలి?
ఇంకెవర్ని? నిన్నే ఆరాధిస్తుంటాం! ఎప్పటికీ మా గుండెల్లోనే జీవించు!
శ్రీదేవీ…
నీకెంత ముందుచూపు!
ఏదో ఒక రోజు కళ్ళు మూస్తావని నీకు తెలుసు కదా?
కళ్ళు మూసినా మా కళ్ళ ముందు కనిపించేలానే కదా…
మా కోసమే మూడు వందల చిత్రాల్లో నటించావ్!
ఆలోచనల్లో నువ్వొచ్చిన ప్రతిసారీ అవి చూడమని మమ్మల్ని వదిలి వెళ్ళావ్!
నువ్ మాకు ఎన్నో కానుకలు ఇచ్చావ్!
మేమే నీకు అభిమానులుగా ఉండటం తప్ప ఏమీ చేయలేకపోయాం!
శ్రీదేవీ…
ఒక్క మాట గుర్తుపెట్టుకో.
నీ శ్వాస ఆగిందంతే!
కానీ, నువ్వు ఆగలేదు.
భారతీయ సినిమా తీసుకునే ప్రతి శ్వాసలోనూ…
నువ్వుంటావ్.
నీ నవ్వు వుంటుంది.
నీ ప్రయాణం వుంటుంది.
శ్రీదేవీ….
ఈ రోజుకి సెలవు మరి!
వీలున్న ప్రతిసారీ కనుల చాటున, గుండెల గుప్పెటలో, ఎవ్వరికీ కనపడకుండా ఊసులు చెప్పుకుందాంలే!
ఇన్నాళ్లు అలాగే చేశాను మరి!
ఇక మీదటా అలాగే చేస్తాను!
అలవాటైన ప్రాణం… అంత త్వరగా నిన్ను వదిలించుకోలేదు.
విధాత