కని పెంచిన కొడుకులు పట్టించుకోలేదని నిరాశ చెందిన ఓ తండ్రి అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. రెక్కల కష్టంతో పెంచిన కొడుకులు తనను పట్టించుకోవడం లేదనే ఆగ్రహంతో యావదాస్తిని కొండగట్టు ఆంజనేయ స్వామికి సమర్పించేందుకు సిద్దమయ్యారు.
సిద్ధిపేట జిల్లా చిన్న కోడూరు మండలం అలీపూర్ కు చెందిన బాలయ్య చేసిన పని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన కొడుకులు తన బాగోగులను నిర్లక్ష్యం చేస్తున్నారని మనస్తాపంతో తన పేరిట ఉన్న యావదాస్తిని కొండగట్టు ఆంజనేయ స్వామికి సమర్పించాలనుకున్నాడు. స్థిర, చర ఆస్తుల పత్రాలను వెంటబెట్టుకొని కొండగట్టు చేరుకొని ఆంజనేయ స్వామి హుండీలో వేసేందుకు రెడీ అయ్యాడు. అయితే, బాలయ్యను గమనించిన ఆలయ పూజారులు హుండీలో ఆస్తి పత్రాలు వేస్తే చెల్లదని చెప్పడంతో …తన ఆస్తులను కొండగట్టు అంజన్న పేరిట పట్టా చేస్తానని అందుకు సంబంధించిన పత్రాలను సమకూర్చుకున్నాడు.
ఇందుకోసం తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను కోరాడు. తన ఆస్తి కోసం తాపత్రయపడి తనను పట్టించుకోని తన కుమారులకు ఆస్తి ఎలా కట్టబెడుతానని…తన ఇష్ట దైవమైన ఆంజనేయ స్వామికి చెల్లిస్తానని బాలయ్య స్పష్టం చేస్తున్నారు. బాలయ్య చేసిన పనిని కొంతమంది సమర్దిస్తుండగా మరికొంతమంది వ్యతిరేకిస్తున్నారు.