హైదరాబాద్: ఆ అమ్మాయి పేరు అన్నపూర్ణ సుంకర. ఫక్తు తెలుగు సినిమా అభిమాని. ఆ అమ్మాయికి కోపం వచ్చింది. తెలుగు సినిమా పరిశ్రమలో అగ్రస్థానంలో ఉన్న దర్శకులందరిపైనా…! వెంటనే ఒక వీడియోలో తన భావాలను వ్యక్తం చేసింది. ఆ దిగ్దర్శకులందరినీ ఒకరేంజ్లో ఆడుకుంది. ఆ వీడియో వైరల్ అయిపోయింది. విపరీతమైన ప్రజాదరణ పొందుతున్న ఆ వీడియో విశేషాలేమిటో చూద్దాం.
అన్నపూర్ణ రాజమౌళి, త్రివిక్రమ్ శ్రీనివాస్, శ్రీను వైట్ల వంటి దర్శకులందరిపైనా తన ఆగ్రహాన్ని వ్యక్తంచేసింది. ముఖ్యంగా బాహుబలిలో తమన్నా, ప్రభాస్ మధ్య ప్రణయ సన్నివేశాలను తూర్పారబట్టింది. అది లైంగిక అత్యాచారమేనని వ్యాఖ్యానించింది. ఉదాహరణలతోసహా అది లైంగిక అత్యాచారం ఎలా అవుతుందోనని వివరించింది. శివగామి అనే పాత్రను ఎంతో ఉన్నతంగా చూపెట్టిన రాజమౌళి తమన్నా విషయంలో అలా ఎందుకు చూపించారని ప్రశ్నించింది. ప్రభాస్ పాత్ర భారతంలో దుశ్శాసనుడిలాగా ఉందని వ్యాఖ్యానించింది. అలాగే అత్తారింటికి దారేది సినిమాలో పవన్ ఎమ్ఎస్ నారాయణను కొట్టటం, దూకుడు సినిమాలో మహేష్ సమంతను నీ కలరేంటి-నా కలరేంటి అని ప్రశ్నించటం సీన్లనుకూడా తప్పుబట్టింది. ఆడవాళ్ళు మగాళ్ళకోసం అర్రులు చాస్తున్నట్లు, వాళ్ళు చిటిక వేస్తే పరిగెత్తుకుని వస్తారన్నట్లు చూపించటం దారుణమని విమర్శించింది. ఇక నటుడు ఆలీపై నిప్పులు చెరిగింది. వాడు మనిషా, దున్నపోతా అని ప్రశ్నించింది. ఆలీ ఫంక్షన్లలో తోటి యాంకర్లపై, హీరోయిన్లపై అసభ్యకరంగా కామెంట్లు చేయటాన్ని దుమ్మెత్తిపోసింది. దర్శకులు సుకుమార్, శేఖర్ కమ్ముల, కరుణాకరన్, నాగ్ అశ్విన్లను ప్రశంసించింది. ఆడియన్స్కూడా మారాలని అభ్యర్థించింది. ఖమ్మంకు చెందిన ఈ అమ్మాయి ప్రస్తుతం అమెరికాలో ఉంటోందని ఆమె సోషల్ మీడియా పోస్టులనుబట్టి అర్థమవుతోంది. అన్నపూర్ణ ఇంతకు ముందు – నిర్భయపై బీబీసీ తీసిన డాక్యుమెంటరీ ఇండియాస్ డాటర్పై కూడా ఇలాగే చేసిన వీడియో కామెంటరీ వైరల్ అయింది. ఆమె crazynri.blogspot.in పేరుతో బ్లాగ్ చేస్తుంటారు.