అమరావతి రాజధాని కాదంటున్నారు. కానీ రైతులు ఇచ్చిన భూముల్ని మాత్రం అప్పనంగా పేదల పేరుతో పార్టీ కార్యకర్తలకు కట్టబెట్టడానికి ఆర్ 5 జోన్లు లాంటివి ఏర్పాటు చేస్తున్నారు. ఇది చట్ట విరుద్దమని.. హైకోర్టుకు తీర్పునకు వ్యతిరేకమని.. నిలబడవని తెలిసి కూడా ఉత్తర్వులు జారీ చేసేశారు. ఎంపిక చేసిన భూముల ప్రాంతాన్ని ఆర్-5 జోన్‌గా పేర్కొంటూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. అమరావతి రాజధాని మాస్టర్ ప్లాన్‌లో కూడా ఈ మేరకు మార్పులు చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. ఆర్-5 జోన్‌పై అభ్యంతరాలు, సూచనలు, సలహాలు స్వీకరించటానికి 15 రోజుల గడువు ఇచ్చింది.
దీనిపై కొంతమంది హైకోర్టుకు వెళ్లారు. అంతకు ముందే ప్రభుత్వ చర్యలను హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. రాజధాని నిర్మాణం కోసం తీసుకున్న భూముల విషయంలో రైతులకు ఇచ్చిన హామీలకు, చేసుకున్న ఒప్పందాలకు భిన్నంగా వెళ్లటం తగదని, ఈ రకమైన చర్యలు చెల్లవని పేర్కొంది. సీఆర్డీఏ చట్టంలో ఎలాంటిమార్పులు చేయకూడదన్న కోర్టు తీర్పు ఉన్నా సీఆర్డీఏ చట్టంలో సవరణలు చేసింది ప్రభుత్వం. ఈ సవరణల ప్రకారం రెండు అధికారాలు సీఆర్డీఏకు, రాష్ట్ర ప్రభుత్వానికి వస్తాయి. వీటిపైనా కోర్టులో పిటిషన్లు ఉన్నాయి. అవన్నీ పరిష్కారమయ్యేయే వరకూ ఏ చర్యలు తీసుకోమని చెప్పి కూడా ఇప్పుడు ఉత్తర్వులు జారీ చేశారు.
నిజానికి అమరావతి రాజధాని కాదని విశాఖ వెళ్లిపోతామంటున్నారు. రాష్ట్రంలోని పేదలకు విశాఖలోనే ప్రభుత్వం ఇళ్ల స్థలాలను ఇవ్వాల్సి ఉంది.రాజధాని కాకుండా అమరావతిలో ఎందుకు ఇస్తున్నారో ప్రభుత్వానికే తెలియాలి. రైతులు ఇచ్చిన భూములను రాజధాని అవసరాలకే వాడాలి. కానీ ప్రభుత్వం దుర్భుద్దితో కుట్ర పూరితంగా నాలుగేళ్లుగా ప్రజారాజధానిపై కుట్రలు చేస్తూనే ఉంది. న్యాయస్థానాలు అడ్డుకున్నా కోర్టులో కొట్టేసినా పర్వాలేదు తాము చేయాలనుకున్నది చేస్తామన్నట్లుగా ముందుకె్ళ్తోంది.