తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ పై మరోసారి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గవర్నర్ తీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు విమర్శించిన సంగతి తెలిసిందే. అయితే, భాజపా వైకాపాలు గవర్నర్ ను వెనకేసుకొస్తూ టీడీపీపై విమర్శలు చేస్తున్నాయి. చంద్రబాబుకీ గవర్నర్ కీ మధ్య జరిగిన చీకటి ఒప్పందం బయటపెట్టాలని వైకాపా నేత బొత్స ఆరోపించారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటున్న నరసింహన్ పై విమర్శలేంటని ఆయన అన్నారు. ఇక, సోము వీర్రాజు మాట్లాడుతూ… గవర్నర్ వ్యవస్థనీ రాజ్యాంగాన్నీ అవమానపరిచే విధంగా ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారన్నారు. రాజ్యాంగం రాజ్యంగం అంటూ గంభీరంగా వీరు విమర్శలు చేస్తున్నారు కదా! ఇంతకీ గవర్నర్ తన పాత్రను సక్రమంగా, రాజ్యాంగబద్ధంగా పోషిస్తున్నారా లేదా అనే అంశం వీరికి తెలుసా అనేదే ప్రశ్న..?
గవర్నర్ రాష్ట్రంలో రాజ్యాంగ ప్రతినిధి మాత్రమే, అంతేగానీ కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి కాదు… ఇది అంబేద్కర్ చెప్పిన మాట. వాస్తవానికి, ప్రధానిమంత్రినీ హోం మంత్రినీ ఎప్పటికప్పుడు కలవాల్సిన అవసరం గవర్నర్ కి లేదు. ప్రధానికి నరసింహన్ రిపోర్ట్ చేయడం అనేది సరైన ప్రజాస్వామిక సంప్రదాయం కానే కాదు! ఎందుకంటే, గవర్నర్ ను నియమించింది రాష్ట్రపతి. ఏదైనా నివేదిక ఇవ్వాలంటే ముందుగా అక్కడికి వెళ్లాలి. అయితే, యూపీయే హాయాం నుంచి నరసింహన్ ఓ పద్ధతి అలవాటు చేసేశారు. ప్రధానినీ, హోం మంత్రిని కలిసి నివేదికలు ఇవ్వడానికే ఢిల్లీ వెళ్లడం అనేది ఆనవాయితీగా మార్చేశారు.
రాష్ట్రంలో చోటు చేసుకునే రాజకీయ పరిణామాలపై చీటికీమాటికీ గవర్నర్ స్పందించాల్సిన అవసరం లేదు. రాష్ట్రంలో రాజ్యాంగపరమైన ప్రతిష్ఠంభన ఏర్పడినప్పుడు మాత్రమే గవర్నర్ రంగంలోకి దిగాలి. అలాగని అప్పుడు కూడా ప్రధానిని కలవాలని లేదు! రాష్ట్రపతికి మాత్రమే నివేదిక ఇవ్వాలి. ప్రధానికీ, హోం మంత్రికి గవర్నర్ రిపోర్టు చేయాలనేది రాజ్యంగంలో ఎక్కడా లేదు. కేంద్రంలోని రాజకీయ నాయకులతో తరచూ సమావేశాల కాకూడదు. కేంద్ర ప్రభుత్వం కూడా గవర్నర్ ను తమ రాజకీయ అంశాల్లో భాగంగా సంప్రదించకూడదు. దీనికి భిన్నంగా… దాదాపు దశాబ్దకాలంగా నరసింహన్ అనుసరించిన వైఖరి వేరేలా ఉంటోంది కాబట్టి, ఆయన ఢిల్లీ వెళ్లినా రొటీన్ అయిపోయింది. ప్రధానిని కలిసినా, హోం మంత్రిని కలిసినా… అదే పద్ధతేమో అనేంతగా చాలామంది అనుకుంటున్నారు. సో… గవర్నర్ ను వెనకేసుకొస్తూ విమర్శలు చేస్తున్న భాజపా, వైకాపా నేతలు ముందుగా తెలుసుకోవాల్సిన విషయమిది.