తమిళ స్టార్ విజయ్ రాజకీయ రంగ ప్రవేశం చేసేశారు. అందరూ ఎదురు చూస్తున్నట్టే ఆయన కొత్త పార్టీ పెట్టేశారు. మరో రెండేళ్లలో తమిళనాట జరగబోయే అసెంబ్లీ ఎన్నికలలో విజయ్ పార్టీ పోటీ చేయనుంది. రెండేళ్లంటే కావల్సినంత సమయం తన చేతిలో ఉన్నట్టే. ఈలోగా `గోట్` చిత్రాన్ని పూర్తి చేస్తారు. ఆ వెంటనే పార్టీ పనుల్లో దిగిపోతారు. అయితే ఒక్కసారి రాజకీయాల్లోకి పూర్తి స్థాయిలో అడుగు పెట్టిన తరవాత విజయ్ పూర్తిగా సినిమాలకు దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే.. రాజకీయాల్లోకి వస్తే, తాను నటించనని విజయ్ ఇది వరకే చెప్పేశారు.
పార్ట్ టైమ్ రాజకీయాలు తనకు పడవని, సీ.ఎం అయిన తరవాత కూడా కొంతమంది నటించడానికి మొగ్గు చూపించారని, తాను మాత్రం అలా చేయనని, ఒకవేళ రాజకీయాల్లోకి దిగడం అంటూ జరిగితే, సినిమాల నుంచి తప్పుకొంటానని ఇది వరకు విజయ్ ఓ సందర్భంలో చెప్పారు. ఇప్పుడు ఆ మాటల్ని తమిళ చిత్రరంగం గుర్తు చేసుకొంటోంది. వచ్చే తమిళనాట ఎన్నికల్లో విజయ్ గెలిచినా, ఓడినా తన వంతు పాత్ర పోషించడం ఖాయం. అప్పుడు సినిమాలు చేయడానికి సమయం దొరకదు కూడా. అందుకే `గోట్` విజయ్ చివరి చిత్రం కాబోతోందన్న ఊహాగానాలు గట్టిగా వినిపిస్తున్నాయి. విజయ్ సినిమా అంటే కనీసం రూ.250 నుంచి రూ.300 కోట్ల వరకూ మార్కెట్ జరుగుతుంది. ఒక్కో సినిమాకు రూ.120 కోట్లకు పైబడే పారితోషికం అందుకొంటాడు విజయ్. ఇంతటి స్టార్ డమ్ ని పక్కన పెట్టి రాజకీయాల్లో దిగుతున్నాడు విజయ్.