ఆంధ్రజ్యోతి పాఠకులకు ఎ.కృష్ణారావు రాసే ఇండియా గేట్ సుపరిచితం.దేశ రాజకీయాలను ప్రత్యేకించి తెలుగు వారి కోణంలో వారం వారం ఆవిష్కరిస్తూ ఆకట్టుకునే పాత్రికేయుడాయన. కృష్ణుడు అన్న పేరిట కవిగానూ సాహిత్య లోకానికి తెలుసు. ఢిల్లీలో దీర్ఘకాలం వున్నారు గనక అన్ని పార్టీల వారితో సంబంధాలు వుంటాయి. బిజెపి అగ్రనేత వెంకయ్య నాయుడుకు సన్నిహితుడుగానూ పేరు పొందారు. సుదీర్ఘకాలం ఆంధ్రజ్యోతిలో పని చేసిన తర్వాత ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో ఒక స్థాయి సంపాదక హౌదాలో చేరారు. అయితే ఆ తర్వాత వెంకయ్య చూస్తున్న సమాచార శాఖలో ప్రవేశించారు. పాత్రికేయుడుగా చురుగ్గా వుంటే కృష్ణారావు ఈ అధికార బాధ్యతలతో ఆట్టే కాలం వుండలేకపోయారు. పైగా వెంకయ్య ఉపరాష్ట్రపతిగా మారిపోయారు గనక క్రియాశీల రాజకీయాలలో పాలనా నిర్వహణలో ప్రత్యక్ష పాత్ర వుండదు. ఈ నేపథ్యంలోనే మళ్లీ ఆంధ్రజ్యోతిలో ఆయన కాలమ్ ప్రత్యక్షమైంది. ఏమంటే ఢిల్లీలో బ్యూరో చీప్‌గా పున:ప్రవేశం చేశారట. ఈ మాట విని జ్యోతి పాఠకులు బాగా సంతోషిస్తారు. రాజకీయ వర్గాలు కూడా ఆయన వ్యాఖ్యలను ఆసక్తిగా చదువుతుంటారు.