‘నా కథని కాపీ కొడితే కొట్టారు. కనీసం నాపేరైనా వేయలేదు’ ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు క్రిష్టఫర్ నోనల్ ముంబై పర్యటనకి వచ్చినప్పుడు చేసిన కామెంట్ ఇది. నోలన్ నుంచి కొట్టేసిన కథ.. గజనీ. ఆయన డైరెక్టర్ చేసిన ‘మెమెంటో’ సినిమా ఐడియాని నైస్ గా ఎత్తేసిన దర్శకుడు మురగదాస్ సూర్యతో గజనీ, అదే పేరుతో అమీర్ ఖాన్ తో సినిమా తీసి ఆ రోజుల్లోనే వందకోట్ల సినిమాలు ఖాతాలో వేసుకున్నాడు. హీరోల ఇమేజ్ పెరిగింది. నిర్మాతలకు లాభాల పంటపడింది. కానీ మూలకథ రచయిత పేరుని కూడా వేయలేదు.
‘మా కథ వేరు. ఒక్క సీన్ మెమెంటో లా వుండదు. ఐడియాతో స్ఫూర్తి పొంది కొత్త కథ రాసుకున్నాం” అప్పట్లో ఇలా ముక్తాయించాడు దర్శకుడు మురగ. అప్పట్లో ఇది చెల్లుబాటు అయింది. కాపీ రైట్ యాక్ట్ బలంగా లేకపోవడం, హాలీవుడ్ మేకర్స్ కూడా ఇక్కడ సినిమాలపై ఉదాసీనం వుండటంతో చాలా కథలు, ఐడియాలు అనధికారికంగా దిగుమతి జరిగింది. కానీ ఇప్పుడలా కుదరదు. ఫారిన్, హాలీవుడ్ జనాలకు ముంబైలో కొన్ని సంస్థలు ఇప్పుడు కాపీ రైట్ విషయంలో సేవలు అందిస్తున్నాయి. ఏవైనా కథ, సీన్లతో పోలిక వుంటే..వెంటనే కాపీ రైట్ నోటీసులు వెళుతున్నాయి. ఇందులో చాలా వరకూ బయటికి తెలియకుండా సెటిల్మెంట్లు జరుగుతున్నాయి. సినీ పరిశ్రమలన్నీ కాపీ రైట్ విషయంలో ఇప్పుడు జాగ్రత్తగానే ఉంటున్నాను.
నిజానికి ఒకరి క్రియేటినీ కాపీ కొట్టేయడం చాలా పెద్ద నేరం. అందులోని తీవ్రత ఏ స్థాయిలో ఉంటుందో చెప్పడానికి తాజాగా సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశం ఒక నిదర్శనం. కొరటాల శివ, మహేష్ బాబు శ్రీమంతుడు సినిమా విషయంలో సుప్రీం కోర్టు తీసుకున్న నిర్ణయం గంభీరంగా వుంది. ‘శ్రీమంతుడు’ స్టోరీని స్వాతి పత్రికలో ప్రచురించిన కథ ఆధారంగా కాపీ చేశారని రచయిత శరత్ చంద్ర గతంలో హైదరాబాద్ నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్పై విచారణ జరిపిన కోర్టు దర్శకుడు కొరటాల శివపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. నాంపల్లి కోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ, కొరటాల తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు, నాంపల్లి కోర్టు ఆదేశాలని సమర్ధించింది. దీనిని సుప్రీం కోర్టులో సవాల్ చేశారు కొరటాల. ఇప్పుడు సుప్రీం కూడా కొరటాల శివ క్రిమినల్ కేసుని ఎదుర్కోవాల్సిందేనని ఆదేశించింది. దేశంలోని సర్వోన్నత న్యాయస్థానమే ఇలా అదేశించడంతో ఆయనకి షాక్ తగినట్లయింది.
దేశంలో చాలా కాపీరైట్ కేసులు వెలుగు చూశాయి. అయితే ఇందులో చాలా వరకూ స్థానిక న్యాయస్థానాలలో పరిష్కారం అయ్యేవి. ఇరుపక్షాలు రాజీకి వచ్చేవారు. కానీ శ్రీమంతుడు కేసులో ఏకంగా సుప్రీం కోర్టుమెట్లు ఎక్కడం, అక్కడ చుక్కెదురవ్వడం చర్చనీయంశమౌతుంది. ఈ కేసులో వాస్తవాలు ఏమిటి? ఎవరిది తప్పు, ఒప్పు అనేది పక్కన పెడితే.. కాపీరైట్ ఎంత తీవ్రంగా ఉంటుందో ఈ కేసు తెలియజేస్తుంది.
ఇప్పుడు హీరోల్లో కూడా ఈ విషయంలో చాలా అవగాహన పెరిగింది. ఈ సంక్రాంతికి విడుదలైన ఓ సినిమా ఇలానే ఓ రచయిత చాలా తెలివిగా వేరే భాష నుంచి ఎత్తేసి సొంత కథగా చెప్పుకున్నాడు. తర్వాత అసలు విషయం తెలుసుకున్న సదరు హీరో, ఆ రచయితని మెల్లగా తప్పించి, మూలకథ రచయితలకు తగిన డబ్బు చెల్లించిన తర్వాతే వేరే దర్శకుడితో పట్టాలెక్కించారు. నిజానికి ఇలా ముందుగా మేల్కోవడం చాలా మంచింది. ఒక ఐడియా కానీ, సీన్ గానీ ఒకరి నుంచి తీసుకున్నపుడు ఒరిజినల్ క్రియేటర్ కి తగిన రాయల్టీ చెల్లించడం రాయల్ గా వుంటుంది. అది సముచిత గౌరవం. దిన్ని గుర్తిస్తే అందరికీ మంచిది.