విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమం రాజుకుంటోంది. విశాఖలో ప్రారంభమైన ఈ ఉద్యమం రాష్ట్రం మొత్తం విస్తరిస్తోంది. ” విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు’ అనే నినాదంతో ఆనాడు వీధుల్లో మార్మోగితే.. నేడు ‘విశాఖ ఉక్కు-ఏపీ భవిష్యత్’ అని ఉద్యమకారులు ఏపీ అంతటా నినదిస్తున్నారు. సాగర తీరం నుంచి ఈ ఉద్యమం ఆంధ్ర దేశం నలుమూలల విస్తరిస్తోంది. రాజకీయాలకతీతంగా ఉద్యమాన్ని నడిపేందుకు కలసి కట్టుగా నడవాలని నిర్ణయించుకున్నాయి. అవసరమైతే బంద్కు పిలుపునివ్వాలని భావిస్తున్నారు.
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశం ఇప్పుడు ఏపీలో చర్చనీయాశమైంది. దీనికి కారణం విశాఖ ఉక్కు కోసం అప్పట్లో జరిగిన పోరాటాలు ఒక్క సారిగా సోషల్ మీడియాలో వైరల్ కావడమే కారణం. విశాఖలో ఉక్కు పరిశ్రమ కోసం నాడు… ఒక్క విశాఖ వాసులు మాత్రమే కాదు.. ఆదిలాబాద్ నుంచి చిత్తూరు వరకూ అందరూ ఉద్యమించారు. ఆదిలాబాద్లో పోలీసుల కాల్పుల్లో కొంత మంది ప్రాణత్యాగం చేశారు. అమృతరావు అనే గుంటూరు ఉద్యమకారుడు .. ప్రాణత్యాగం చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే.. నాడు ఉద్యమం… నలుదిశలా ఉవ్వెత్తున ఎగసి పడింది. అందుకే స్టీల్ ప్లాంట్ సాధ్యమయింది.
అప్పటి పరిస్థితులన్నీ కళ్ల ముందు కడుతున్నాయి. భూములిచ్చిన వారి ఔదార్యం… అలాంటి వారిత్యాగాలను ఇప్పుడు అమ్ముకోవడం ఏమిటన్న చర్చ ప్రారంభమయింది. అందుకే సాధారణ ప్రజల్లోనూ కదలిక కనిపిస్తోంది. నష్టాల పేరుతో పరిశ్రమల్ని తెగనమ్మడం కన్నా ప్రత్యామ్నాయ మార్గాలను చూడాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది. విశాఖ ఆందోళనలకు మద్దతు అంతకంతకూ పెరుగుతోంది. రాజకీయ నేతల మద్దతు ఇప్పుడు ఈ ఉద్యమానికి కీలకం. ఎవరు ఉద్యమాన్ని నడిపిస్తారో వారి ద్వారానే ఇప్పుడు కార్యక్రమాలు జరగాల్సి ఉన్నాయి.
విశాఖ ఉక్కు ఉద్యమం ఇప్పటి వరకూ ఆంధ్రుల్ని పట్టిపీడిస్తున్న జడత్వాన్ని వదిలించే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటి వరకూ ఏం కోల్పోయినా.. ఆ ప్రాంతం.. ఆ వర్గం అంటూ కొన్ని రాజకీయ పార్టీలు చేసిన ప్రచారంతో మనకెందుకులే అనుకున్నట్లుగా ఉండిపోతున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారే సూచనలు కనిపిస్తున్నాయి., ఏదైనా మనదే అనుకునే పరిస్థితి ఇప్పుడు ఏపీ ప్రజల్లో కనిపించడం ప్రారంభమయింది. అది ఎంత వేగంగా వ్యాప్తి చెందితే.. స్టీల్ ప్లాంట్ ఉద్యమం అంత వేగంగా విస్తరిస్తుంది.