షర్మిల నాయకత్వం ఏపీ కాంగ్రెస్ పార్టీకి కొత్త ఊపిరి ఊదేలానే ఉంది. బాధ్యతలు తీసుకున్న వెంటనే ఆమె .. సిక్కోలు నుంచి కడప వరకూ మొత్తం పర్యటించి మిగిలి ఉన్న కార్యకర్తల్ని, నేతల్ని కదిలించారు. ఇప్పుడు ప్రత్యేకహోదా పేరుతో ధర్నా చేయడంతో పాటు జిల్లాల వారీగా సభల్ని పెట్టాలని నిర్ణయించారు. సీనియర్ నేతలంతా యాక్టివ్ అయ్యారు. రఘువీరారెడ్డి, కేవీవీ వంటి వారు షర్మిల వెంటే ఉండి రాజకీయ వ్యవహారాలు చక్క బెడుతున్నారు. ప్రత్యేకహోదా కోసం ఢిల్లీలో ధర్నా నిర్వహించారు. సీనియర్ నేతల్ని కలిశారు.
గతంలో కాంగ్రెస్ పార్టీ తరపున చిన్న ప్రెస్ మీట్ పెట్టడానికి కూడా నేతలకు ఓపిక ఉండేది కాదు. ఎందుకంటే మీడియా పట్టించుకోదు. ప్రజలకూ ఆసక్తి ఉండదు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. షర్మిల సమావేశం ఏర్పాటు చేశారంటే… ఆ కాన్ఫరెన్స్ హాల్ నిండిపోతోంది. పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలి వస్తున్నారు. మీడియా సమావేశం పెడితే ప్రత్యేకంగా కవరేజీ వస్తోంది. సాక్షి మీడియాలో ఆమెకు వ్యతిరేక ప్రచారం చేయడం వల్ల మరింతగా ఆమె గురించి చర్చ జరుగుతోంది.
జిల్లాల వారీగా నిరవహించిన సమావేశాల తర్వాత కాంగ్రెస్ నేతలకు… ఓ ధైర్యం వచ్చింది. ఉన్న పళంగా కాకపోయినా.. కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్ ఉందన్న నమ్మకానికి వస్తున్నారు. బహిరంగసభల్ని నిర్వహించగలమన్న నమ్మకానికి వచ్చారు. మడకశిర నుంచి బహిరంగసభుల్ని ప్రారంభించబోతున్నారు. కాంగ్రెస్ పై అభిమానం ఉన్న వారు లేకుండా ఉండరు. అయితే వారితో ఓటు వేయించుకోవడమే కీలకం. ఇప్పుడా బాధ్యతను షర్మిల పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయి. నాలుగైదు శాతంమ ఓటు బ్యాంక్ ను వెనక్కి తెచ్చుకోగలిగితే.. షర్మిల ఏపీ రాజకీయాల్లో అత్యంత కీలకం అవుతారు. ఈ దిశగా మొదటి అడుగుల్లో తాను అనుకున్నది సాధిస్తున్నారు షర్మిల.