దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పూణేలోని యాక్సిడెంట్ కేసు మలుపులు తిరుగుతూనే ఉంది. మైనర్ అయిన బడా పారిశ్రామికవేత్త కొడుకు మద్యం మత్తులో రాష్ డ్రైవింగ్ చేసి ఇద్దరు అమ్మాయిల మృతికి కారణం అయ్యాడు. ఈ కేసులో నిందితున్ని తప్పించేందుకు వ్యవస్థలన్నీ పనిచేసినా సీసీటీవీ ఫుటేజ్ ల కారణంగా దొరికిపోయాడు.
ఇంత జరిగినా… ఆ మైనర్ తల్లితండ్రులు తన కొడుకు కాపాడుకునేందుకు అడ్డదారులు తొక్కుతూనే ఉన్నారు. తమ ఇంట్లో పనిచేసే డ్రైవర్ ను ఈ కేసు ఒప్పుకోవాలని ఆశ చూపించినట్లు తెలుస్తోంది. దీనిపై అక్కడి పోలీసు అధికారులు స్పందించారు.
ఆ రోజు డ్రైవింగ్ చేసింది తానే అని డ్రైవర్ వచ్చారని…. నిజంగా తనే డ్రైవ్ చేశారా, లేదా డబ్బు ఆశ చూపించి తనను పంపించారా అన్న కోణంలో తాము దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ప్రమాదం జరిగిన రోజే పబ్బులో మద్యం తాగిన దగ్గర నుండి యాక్సిడెంట్ ప్లేస్ వరకు సీసీటీవీ ఫుటేజ్ తీసుకున్నామని… దాన్ని విశ్లేషిస్తున్నట్లు ప్రకటించారు.
ఇప్పటికే ఓసారి ఆ మైనర్ తప్పించేందుకు ప్రయత్నించి విఫలం కాగా… ఇప్పుడు మళ్లీ ప్రయత్నించటం పట్ల పలువురు దుమ్మెత్తిపోస్తున్నారు. డబ్బున్నంత మాత్రాన ప్రతీసారి వ్యవస్థలను మేనేజ్ చేయలేరని, నిజం దాగదు అంటూ సోషల్ మీడియాలో ఫైర్ అవుతున్నారు.
హైదరాబాద్ లోనూ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు ఇలాంటి కేసులోనే ఇరుక్కున్నారని… డ్రైవర్ ను లొంగిపోమని చెప్పి ఎన్నాళ్లు నిజాలు దాచారంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.