తెలంగాణలో దళిత బంధు పథకాన్ని సీఎం కేసీఆర్ పైలెట్ ప్రాజెక్టుగా హుజురాబాద్ మొత్తం అమలు చేస్తున్నారు. అయితే అక్కడ ఇంకా పూర్తి స్థాయిలో అమలు ప్రారంభం కాలేదు. సర్వే, యూనిట్లు,లబ్దిదారుల దగ్గరే ఉంది. అయితే సీఎం కేసీఆర్ కొత్తగా మరో నాలుగు మండలాలపై దృష్టి పెట్టారు. ఈ ప్రకారం మధిర అసెంబ్లీ నియోజకవర్గంలోని చింతకాని మండలం, తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరి మండలం, అచ్చంపేట-కల్వకుర్తి నియోజకవర్గాల్లోని చారగొండ మండలం, జుక్కల్ నియోజకవర్గంలోని నిజాంసాగర్ మండలాల్లో లబ్దిదారులందరికీ పథకం వర్తింప చేయబోతున్నారు.
ఈ మండలాల్లో పథకం అమలు .. విధి విధానాలు ఖరారు చేసేందుకు సోమవారం సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన తర్వాత కేసీఆర్ ముందుగా దళిత బంధుపైనే దృష్టి పెట్టారు. రాష్ట్రానికి నాలుగు దిక్కుల ఉన్న నాలుగు మండలాలను పైలట్ ప్రాజెక్టుగా సీఎం ఎంపిక చేయడంతో ఆ జిల్లాల మంత్రులు, కలెక్టర్లు తదితరులను ఈ మీటింగుకు రావాల్సిందిగా సమాచారం పంపారు. ఈ నియోజకవర్గాల్లోని దళిత కుటుంబాల సంఖ్య, వాటి జీవన ప్రమాణాలు, ఆర్థిక పరిస్థితి, దళితబంధు ద్వారా నిలదొక్కుకోడానికి ఉన్న అవకాశాలపై చర్చిస్తారు.
హుజురాబాద్ ఉపఎన్నిక ఎప్పుడు జరుగుతుందో క్లారిటీ లేదు. పండుగల సీజన్ అయిపోయిన తర్వాత నిర్వహించాలని తెలంగాణ సర్కార్ కోరింది. అంటే దసరా తర్వాత అనుకోవచ్చు. అప్పటికి నవంబర్ వస్తుంది. అప్పటికి కరోనా పరిస్థితి ఏ మాత్రం పెరిగినట్లుగా ఉన్నా.. ఎన్నిక జరిగే అవకాశం లేదు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతోనే నిర్వహించే అవకాశం ఉంటుంది. అందుకే కేసీఆర్కు బిగ్ ప్లాన్స్ ఉన్నాయని.. ఆ కోణంలోనే నిర్ణయాలు తీసుకుంటున్నారన్న చర్చ నడుస్తోంది.