‘నవాబ్’ ప్రచార కార్యక్రమంలో భాగంగా చిత్రబృందం హైదరాబాద్‌లో సందడి చేసింది. టీమ్‌లో కీలకమైన సభ్యుడైన ఏఆర్ రెహమాన్ కూడా ప్రెస్ మీట్లలో పాల్గొన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్, ఎఫ్ ఎమ్ మీడియాలకు రెహమాన్ ప్రత్యేకంగా ఇంటర్వ్యూలు కూడా ఇచ్చాడు. అయితే… ఒకే ఒక్క షరతు విధించాడు. ‘సైరా’ గురించి మాత్రం ఏమీ అడగొద్దని. ‘సైరా’కీ రెహమాన్‌కీ ఉన్న సంబంధం ఏమిటంటారా? ‘సైరా’ సంగీతం కోసం ముందుగా సంప్రదించిన రెహమాన్నే. దాదాపు ఆయన పేరు ఖాయమైపోయింది. `సైరా` ప్రారంభోత్సవంలో రెహమాన్ పేరు కూడా ప్రకటించారు. కానీ సడన్‌గా ఈ టీమ్ నుంచి రెహమాన్ తప్పుకున్నాడు. ‘బిజీ షెడ్యూల్ వల్లే సైరా చేయలేకపోయా’ అని మొన్నోసారి చెప్పాడు రెహమాన్. అయితే పదే పదే అదే ప్రశ్న అడుగుతుండడంతో `ఈ ప్రశ్న అడగొద్దు` అంటూ తన పీఆర్ టీమ్‌కి ముందే హింట్ ఇచ్చాడట రెహమాన్. దాంతో… ‘సైరా’ గురించి ప్రశ్న సంధించకుండానే రెహమాన్ ఇంటర్వ్యూలు ముగిశాయి. మణిరత్నం కాంబోలో రూపొందించిన `నవాబ్` ఆడియోలో కూడా రెహమాన్ మెరుపుల్ని చూడలేకపోయారు అభిమానులు. విజయ్ నటిస్తున్న తమిళ చిత్రం ‘సర్కార్’కీ తనే సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రంలోని తొలిపాట సోమవారం విడుదలైంది. అదీ అంతంతమాత్రంగానే ఉంది. `నవాబ్` విడుదలయ్యాక మణి మేకింగ్ వాల్యూతోడై… రెహమాన్ పాటలకు తగిన గుర్తింపు వస్తుందేమో చూడాలి.