మలయాళంలో రూపొందిన ‘దృశ్యమ్’ అరుదైన ఘనత సాధించింది. హాలీవుడ్ లో రీమేక్ అవుతున్న తొలి భారతీయ చిత్రంగా రికార్డు సృష్టించింది. హాలీవుడ్ సినిమాలు చూసి, స్ఫూర్తిపొంది, కథలు రాసి, మన భాషలో తీసే ట్రెండ్ గురించి తెలిసిన మనకు.. మన సినిమా ఒకటి హాలీవుడ్ కి వెళ్లడం నిజంగా అబ్బురంగా అనిపించే విషయమే. మోహన్‌లాల్ నటించిన ‘దృశ్యమ్’ భారతీయ చలన చిత్రసీమలో ఓ క్రైం క్లాసిక్! తెలుగుతో సహా, అన్ని భాషల్లోనూ రీమేక్ చేశారు. అన్ని చోట్లా మంచి విజయాన్ని అందుకొంది. ఈ చిత్రానికి కొనసాగింపూ వచ్చింది. దానికీ ఆదరణ దక్కింది. కొరియాలో సైతం ఈ కథని రీమేక్ చేస్తున్నారు. ఇప్పుడు హాలీవుడ్ కీ ‘దశ్యమ్’ నచ్చింది. అక్కడికీ వెళ్తోంది. గల్ఫ్ స్ట్రీమ్ పిక్చర్స్ సంస్థ ఈ చిత్రాన్ని హాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించింది. రీమేక్ రైట్స్ రూపంలో మలయాళ నిర్మాతకు భారీ మొత్తాన్ని అందజేసినట్టు టాక్. అంతేకాకుండా, చిత్ర లాభాల్లో వాటా కూడా ఇవ్వనున్నదని తెలుస్తోంది.
జీతూ జోసెఫ్ ఈ చిత్రానికి దర్శకుడు. ఓ సగటు తండ్రి.. తన కూతుర్ని, కుటుంబాన్నీ కాపాడుకోవడం కోసం వేసే ఎత్తులూ, క్రైమ్ ఇన్వెస్టిగేషన్, కథలో మలుపులూ.. ‘దృశ్యమ్’ చిత్రానికి మూలం. క్రైమ్ కథే అయినా, బలమైన ఎమోషన్స్ మేళవించడం వల్ల దృశ్యమ్ ఓ క్లాసిక్‌గా నిలిచింది. ఇప్పటికే చాలా ఇన్వెస్టిగేషన్ కథలు ‘దృశ్యమ్’ నుంచి స్ఫూర్తి పొందాయి. హాలీవుడ్ వెర్షన్లో ఎవరు నటిస్తారు? దర్శకత్వం ఎవరు వహిస్తారు? అనే విషయాలు తెలియాల్సివుంది.