దర్శకుడిగానే కాదు, నిర్మాతగానూ తన మార్క్ చూపించుకొన్నాడు సుకుమార్. తన బ్యానర్ సుకుమార్ రైటింగ్స్ నుంచి ఓ సినిమా వస్తోందంటే అటెన్షన్ మొదలైపోతుంది. కమర్షియల్ గా ఆ బ్యానర్‌కు ఓ ట్రాక్ రికార్డు వుంది. తన శిష్యుల్ని, తనకు ఇష్టమైన కథల్ని ఎంకరేజ్ చేయడానికి ఈ బ్యానర్ స్థాపించాడు సుకుమార్. ఈసారి సుకుమార్ రైటింగ్స్ నుంచి ఓ స్పెషల్ మూవీ రాబోతోంది. అదే `గాంధీ తాత చెట్టు`. ఈ సినిమాలో సుకుమార్ కుమార్తె సుకృతి వేణి ప్రధాన పాత్ర పోషించింది. తబితా సుకుమార్ సమర్పకురాలిగా వ్యవహరించబోతోంది. పద్మావతి మల్లాది దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మైత్రీ మూవీస్ భాగస్వామి. ఈనెల 24న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.
ఇప్పటికే ఈ చిత్రాన్ని పలు అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శించారు. అక్కడ అనేక అవార్డుల్ని ఈ సినిమా సొంతం చేసుకొంది. ఉత్తమ బాల నటిగా కొన్ని పురస్కారాల్ని సుకృతి సొంతం చేసుకొంది. గాంధీ ఆదర్శాలను పాటిస్తూ ఓ పదమూడేళ్ల అమ్మాయి తను పుట్టిన ఊరి కోసం ఏం చేసిందన్నదే కథ. సోషల్ మీడియా సమాజాన్ని ఎలా భ్రస్టు పట్టిస్తుందో, అందులోంచి బయటపడాలంటే ఏం చేయాలో కూడా ఈ సినిమా ద్వారా చెప్పబోతున్నార్ట. సుకుమార్ సహాయ సహకారాలు ఈ సినిమాకు పుష్కలంగా ఉన్నాయి. మైత్రీ మూవీస్ విడుదల చేస్తోంది. కాబట్టి ప్రమోషన్లకు ఢోకా లేనట్టే. అవార్డుల కోసం ఇలాంటి సినిమాలు తీసినా, వాటికి థియేటరికల్ రిలీజ్ కల్పించడం మామూలు విషయం కాదు. ఓ నిర్మాతగా, తండ్రిగా సుకుమార్ కు ఈ సినిమా సమ్ థింగ్ స్పెషలే. ఇటీవలే సుకుమార్ కూడా ఈ సినిమాని చూశారు. తనయురాలిగా నటన మెచ్చుకొన్నారు. త్వరలోనే సుకుమార్ తో ప్రమోషనల్ ఈవెంట్ చేసే అవకాశాలు ఉన్నాయి.