బాలీవుడ్ లో ఘన విజయాన్ని అందుకొన్న సినిమా ‘కిల్’. తెలుగులో ఈ చిత్రాన్ని రీమేక్ చేస్తారని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. బడా బడా నిర్మాణ సంస్థలు రీమేక్ రైట్స్ కోసం పోటీ పడ్డాయి. చివరికి ‘ఏ స్టూడియోస్’ సంస్థ ఈ హక్కుల్ని సొంతం చేసుకొంది. ఏ స్టూడియోస్ తో పాటుగా ధర్మా ప్రొడక్షన్స్ సంస్థ ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి నిర్మించనుంది. కోనేరు సత్యనారాయణ నిర్మాత. రమేష్ వర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అధికారిక ప్రకటన ఈరోజు సాయింత్రం కల్లా బయటకు వచ్చే అవకాశం వుంది.
రమేష్ వర్మ దర్శకత్వంలో ఏ స్టూడియోస్ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మించనున్నట్టు, అందులో రాఘవ లారెన్స్ కథానాయకుడిగా నటించబోతున్నట్టు ఇటీవలే ఓ ప్రకటన వచ్చింది. దాంతో ‘కిల్’ రీమేక్ లారెన్స్ తోనే చేస్తున్నారనుకొన్నారంతా. నిజానికి ఆ ప్రాజెక్ట్ వేరు.. ఈ సినిమా వేరు. లారెన్స్ తో రమేష్ వర్మ ఓ సినిమా చేస్తారు. దాంతో పాటుగా ‘కిల్’ కూడా చేస్తారు. ‘కిల్లో’ హీరో ఎవరన్నది మరి కొద్ది రోజుల్లో తెలుస్తోంది. లారెన్స్ తో రమేష్ వర్మ తీసే సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఉంటుంది. ‘కిల్’ తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. ధర్మా ప్రొడక్షన్స్ నిర్మాణ భాగస్వామి కాబట్టి, పెద్ద హీరోలే ‘కిల్’ రీమేక్ చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ హీరో ఎవరో తెలియాలంటే ఇంకొద్ది రోజులు ఎదురు చూడాల్సిందే.