సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు, ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు వ్యవహారం పోలీసులకు పెను సవాల్ గా మారింది. ఈ కేసు నమోదుకు ముందే ప్రభాకర్ రావు అమెరికా వెళ్ళడంతో..ఆయనను స్వదేశానికి తీసుకువచ్చేందుకు అనేక ప్రయత్నాలు చేస్తోన్నా ప్రభాకర్ రావు మాత్రం చాకచక్యంగా తప్పించుకుంటున్నారు. అనారోగ్యం కారణాలు చూపుతూ విదేశాల్లోనే ఉంటున్నారు.
ఈ కేసు ఆయన ఇండియాకు వస్తేనే ముందుకు వెళ్తుందనేది ఓపెన్ సీక్రెట్. తాను విచారణకు సహకరిస్తానని, జూన్ 26న తిరిగివచ్చి దర్యాప్తుకు సహకరిస్తానని న్యాయస్థానంలో మేమో దాఖలు చేశారు ప్రభాకర్ రావు.కానీ, అనారోగ్యంతో మరికొన్ని రోజులు ఇక్కడే ఉండాల్సి వస్తుందని రెండు రోజుల కింద మెయిల్ ద్వారా అధికారులకు ప్రభాకర్ రావు సమాచారం అందించారు. వీటిని ముందే అంచనా వేసిన అధికారులు బ్లూ కార్నర్ నోటీసు ఇచ్చేందుకు రెడీ అయ్యారు. విదేశాల్లో ఉన్న నిందితులను గుర్తించేందుకు ఈ నోటీసు ఇస్తుంటారు. ఇందుకోసం ఇంటర్ పోల్ కు లేఖ రాయాలని సీఐడీ ద్వారా సీబీఐని కోరారు అధికారులు. అయితే, ఇదీ ఇంటర్ పోల్ కు వెళ్ళడానికి చాలా సమయం పడుతుంది. కారణం.. ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదుకు ముందే అమెరికా వెళ్ళారు. అనారోగ్యం కారణంగా పలుమార్లు విదేశాలకు వెళ్లి వచ్చిన ఉదంతాలు ఉండటంతో ఆయన పరారీలో ఉన్నట్లు నిర్దారించడం సాధ్యం కాదు . సో, ఈ కేసులో ఇంటర్ పోల్ విభాగం ప్రభాకర్ రావుకు బ్లూ కార్నర్ నోటీసు ఇవ్వడం కష్టమే.
ప్రభాకర్ రావును ఇండియాకు తీసుకొచ్చేందుకు మరో ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకున్నారు అధికారులు. ప్రభాకర్ రావు పాస్ పోర్ట్ జప్తు చేయాలని పాస్ పోర్ట్ అధికారికి లేఖ రాశారు. నిందితులు ఎవరైనా విదేశాలకు వెళ్లి , తిరిగి రాకుండా అక్కడే ఉంటే పాస్ పోర్ట్ రద్దు చేయవచ్చు. కానీ, ప్రభాకర్ రావు విషయంలో ఇలా చేయడం అంతా ఈజీ కాదు. తాను పారిపోలేదని, విచారణకు సహకరిస్తానని, అనారోగ్యంతోనే విదేశాల్లో ఉంటున్నట్లు పోలీసులకు సమాచారం అందిస్తుండటంతో పాస్ పోర్ట్ అధికారి ప్రభాకర్ రావు పాస్ పోర్ట్ జప్తు చేయకపోవచ్చు. దీంతో ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు ఇప్పట్లో స్వదేశానికి వచ్చేలా కనిపించడం లేదు. మరో నిందితుడు శ్రవణ్ రావు కూడా అదే బాటలో ఉన్నారు. ఫలితంగా ఈ కేసులో మరికొన్నాళ్లు స్తబ్దత నెలకొనే అవకాశం ఉంది.