తమిళ సినిమాల్లో నటులు చేసే ఓవర్ యాక్షన్ను తమిళ అతిగా చెప్పుకుంటూ ఉంటాం. అది బయట కూడా బయటపడుతోంది. ఏపీలో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని.. ఏపీ నుంచి ఎవరూ తమిళనాడులోకి రావొద్దంటూ… చిత్తూరు జిల్లాలో తమిళనాడులోకి ఎంటరయ్యే దారుల్లో గోడలు కట్టేస్తున్నారు తమిళనాడు అధికారులు. మొత్తం మూడు సరిహద్దు ప్రాంతాల్లో ఈ గోడల నిర్మాణం జరిగింది. తమిళాడులోని వేలూరు .. చిత్తూరు సరిహద్దు జిల్లాలు. అక్కడి ప్రజలు రోజువారీ కార్యకలాపాలకూ అటూ ఇటూ తిరుగుతూ ఉంటారు. వారికి సరిహద్దులు పట్టవు. అయితే.. హఠాత్తుగా కరోనా పేరుతో వేలూరు జిల్లా కలెక్టర్ అతి నిర్ణయం తీసుకున్నారు.
పలమనేరు నుంచి గుడియత్తాం అనే ఊరికి వెళ్లే రహదారి, తిరుత్తణి మార్గంలోని శెట్టింతంగాళ్, బొమ్మ సముద్రం నుంచి తమిళనాడు వెళ్లే మార్గాలకు అడ్డంగా గోడలను నిర్మించారు. రోడ్డుకు అడ్డంగా రాత్రికి రాత్రే 6 అడుగుల మేర గోడలను కట్టివేశారు. నిజానికి ఆ మార్గాల్లో లాక్ డౌన్ తర్వాత రాకపోకలు దాదాపుగా నిలిచిపోయాయి. నిత్యావసర వస్తువులు.. అత్యవసర సేవల వాహనాలు మాత్రమే వెళ్తున్నాయి. ఇప్పుడు గోడ కట్టాల్సిన అవసరం ఏమిటో.. ఏపీ అధికారలకు అర్థం కాని పరిస్థితి. ఇప్పటికే రాష్ట్రాలు, జిల్లాల సరిహద్దులన్నింటినీ మూసేశారు. జాతీయరహదారులను కూడా క్లోజ్ చేశారు.
తమిళాడు అధికారుల అతిపై..ఏపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఏపీలో కన్నా కరోనా వైరస్.. తమిళనాడులోనే తీవ్రంగా ఉందని గుర్తు చేస్తున్నారు. ఏపీతో పోలిస్తే.. తమిళనాడులో రెట్టింపు పాజిటివ్ కేసులు ఉన్నాయంటున్నారు. ఇప్పుడు ఏపీలోనే కరోనా ఉన్నట్లుగా.. ఎవరూ … ఏపీ నుంచి రావొద్దన్నట్లుగా ఓవర్ యాక్షన్ చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. తెలంగాణలో కర్నూలు సరిహద్దుగా ఉండే గ్రామాల్లో… ఎట్టి పరిస్థితుల్లోనూ కర్నూలుకు పోవద్దని పోలీసులు చాటింపు వేస్తున్న వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీటిపై విమర్శలు వస్తున్నాయి.