ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని విమర్శిస్తూ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు చిరంజీవి శనివారం ఒక బహిరంగ లేఖ వ్రాశారు. అందులో కాపుల రిజర్వేషన్ సమస్యని ముఖ్యమంత్రి సరిగ్గా పరిష్కరించే ప్రయత్నం చేయకుండా, దానిలోకి అనవసరమైన రాజకీయాలు చొప్పిస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి కాపుల మద్య చిచ్చు పెట్టేవిధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తుని విద్వంసానికి బాధ్యులను శిక్షించాలని కోరుతున్నానని కానీ ఆ కేసులో అరెస్టులన్నీ ఏకపక్షంగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. తుని ఘటనలలో స్థానికులెవరూ పాల్గొనలేదని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు స్థానికులని ఎందుకు అరెస్ట్ చేస్తోందని ప్రశ్నించారు. దాని కోసం తక్షణం సిబిఐ విచారణకు ఆదేశించాలని ఆయన డిమాండ్ చేశారు. కాపుల కోసం పోరాడుతున్న ముద్రగడ పద్మనాభం పట్ల ప్రభుత్వం శత్రుత్వం ప్రదర్శిస్తుండటం వలననే సమస్య జటిలమవుతోందని అభిప్రాయపడ్డారు. కాపుల రిజర్వేషన్లు, ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ సమస్యలతో సహా అన్నిటినీ ప్రభుత్వం సామరస్యంగా పరిష్కరించాలని చిరంజీవి కోరారు. మీడియా ప్రసారాలను నిలిపివేయడం ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నియంతృత్వ పోకడలు పోతున్నారని, తక్షణమే మీడియాపై విధించిన నిషేధం ఎత్తివేయాలని చిరంజీవి తన లేఖ ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కోరారు.
ముద్రగడని అరెస్ట్ చేసిన వెంటనే చిరంజీవి ఈవిధంగా స్పందించి ఉంటే అది సహజంగా ఉండేది కానీ ఈరోజు ఆయన ఇంటికి సి. రామచంద్రయ్య వచ్చి మాట్లాడిన తరువాత స్పందించడం చూస్తే ఆయన సూచన మేరకే చిరంజీవి స్పందించినట్లు అర్ధమవుతుంది. తుని ఘటనలను ఖండిస్తూనే మళ్ళీ అరెస్టులు ఏకపక్షంగా సాగాయని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. ఆ ఘటనలకు ఎవరు బాధ్యులో ఎవరూ చెప్ప(లే)రు కానీ పోలీసులు ఎవరిని అరెస్ట్ చేసినా అది తప్పని ఖండిస్తుంటారు. తుని విద్వంసంపై సిబిఐ విచారణ జరపాలని జగన్ కోరిన తరువాతనే చిరంజీవి కూడా అది అవసరం అనిపిస్తోంది. అంతకు ముందు ఆయనకి ఆ ఆలోచన ఎందుకు కలుగలేదో?
సున్నితమైన ఈ సమస్యని ప్రభుత్వ అయోమయ వైఖరి కారణంగా జటిలం అవుతున్న మాట నిజమే. కానీ దానికి ప్రభుత్వానిదే పూర్తి బాధ్యత అనడం చాలా తప్పు. ఈ వ్యవహారంలో వైకాపా కూడా వేలుపెట్టడం వలననే, దానికి రాజకీయరంగు అలుముకొంది. ముద్రగడ పద్మనాభం కూడా తన లక్ష్యం కోసం పోరాడకుండా మద్యలో రాజకీయాలు చేస్తున్నారు. ముఖ్యమంత్రిపై విమర్శలు చేయడం, లేఖలు వ్రాయడం, ప్రభుత్వాన్ని బెదిరించడం, చీటికీమాటికీ ఆమరణ నిరాహార దీక్షలు చేయడం వంటివన్నీ అనవసరమైన చర్యలే.
అదే ఆయన ముఖ్యమంత్రిని స్వయంగా కలిసి మాట్లాడి ఉండి ఉంటే బహుశః ఈ సమస్య సామరస్యంగానే పరిష్కారం అయ్యుండేదేమో?ఆయన కోరిక మేరకే ప్రభుత్వం కాపు కార్పోరేషన్ ఏర్పాటు చేస్తే దాని చైర్మన్ రామానుజాన్ని కలిసేందుకు కూడా ఆయన ఇష్టపడలేదు. కానీ ఈ సమస్య గురించి ఏనాడు మాట్లాడని చిరంజీవి, దాసరి నారాయణ రావు, రఘువీరా రెడ్డి, హర్షకుమార్ వంటివారినందరినీ కలిసివచ్చారు. కనుక ఆయన కూడా ఈ సమస్య పరిష్కారం గురించి కాకుండా దానితో రాజకీయాలు చేయడానికే ప్రయత్నిస్తున్నట్లు తెదేపా నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాపులకి రిజర్వేషన్లు కల్పించే విషయంలో ఎవరికీ నిబద్ధత లేకపోయినా అందరూ కలిసి సున్నితమైన ఈ సమస్యపై తలో మాట మాట్లాడుతూ ఇంకా జటిలం చేస్తున్నారని చెప్పక తప్పదు.