Aa Okkati Adakku Movie review
తెలుగు360 రేటింగ్ 2.25/5
-అన్వర్
ఒకప్పుడు అల్లరి నరేష్ నుంచి కామెడీ సినిమా వస్తుందంటే మినిమం గ్యారెంటీ వుండేది. తర్వాత పరిస్థితి మారింది. ఆయనపై కామెడీ కథలు సరిగ్గా ఆడలేదు. దీంతో రూటు మార్చి సీరియస్ కథలు ఎంచుకొన్నారు. ఇప్పుడు చాలా గ్యాప్ తర్వాత ‘ఆ ఒక్కటీ అడక్కు’ తో మళ్ళీ ఓ కామెడీ కథలో కనిపించారు. ఈవీవీ క్లాసిక్ టైటిల్ ఇది. మరి ఇంత క్లాసిక్ టైటిల్ తో వచ్చిన ఈ సినిమా ఆ పేరుని నిలబెట్టిందా? నరేష్ అల్లరి అలరించిందా?
గణపతి అలియాస్ గణ (అల్లరి నరేష్) సబ్ రిజిస్టార్ ఆఫీస్ లో ఉద్యోగి. తన చేతుల మీద వందల పెళ్ళిళ్ళు చేస్తాడు కానీ తనకు మాత్రం పెళ్లి కుదరదు. వయసుపై బడిపోతుంటుంది. గణ కంటే ముందే తమ్ముడు (రవికృష్ణ)కి మేనమామ కూతురు దేవి (జేమీ లివర్)తో పెళ్లి జరుగుతుంది. వాళ్ళకి ఒక పాప కూడా వుంటుంది. తమ్ముడు తర్వాత అన్నయ్య పెళ్లి చేసుకోవడమా? అని ఆశ్చర్యపోయి అంతా పెళ్లి సంబధాలు తిరస్కరిస్తుంటారు. మరో దారి కనిపించక మ్యాట్రీమొనీ సంస్థని ఆశ్రయిస్తాడు గణ. వాళ్ళు చూపించిన మ్యాచ్ లో భాగంగా సిద్ది( ఫారియా అబ్దుల్లా)ని చూస్తాడు గణ. తొలి చూపులోనే నచ్చేస్తుంది. అయితే తనకి ఇంకా తొమ్మిది ఆప్షన్స్ వున్నాయని, అవన్నీ చూశాక అప్పుడే డిసైడ్ చేసుకొంటానని చెబుతుంది. తర్వాత ఏం జరిగింది? అసలు సిద్ది ఎవరు? తన నేపధ్యం ఏమిటి? గణ కంటే ముందు తమ్ముడు ఎలా పెళ్లి చేసుకున్నాడు? చివరికి గణకి పెళ్లి కుదిరిందా లేదా? అనేది తక్కిన కథ.
పెళ్లి అనేది అందరూ కనెక్ట్ చేసుకునే టాపిక్. అందుకే రొమాంటిక్ కామెడీలు దాదాపు పెళ్లి, ప్రేమలు చుట్టూనే తిరుగుతాయి. ఆ ఒక్కటీ అడక్కు కోసం కొత్త దర్శకుడు మల్లి అంకం ఎత్తుకున్న ‘పెళ్లి’ పాయింట్ బలమైనదే. అయితే పాయింట్ లోని బలం తెరపై కనిపించినపుడే దాని ప్రభావం వుంటుంది. లేకపోతే వాట్సప్ మెసేజ్ లో ప్లెయిన్ టెక్స్ట్ చదివినట్లుగా వుంటుంది. ఆ ఒక్కటీ అడక్కు కథ, కథనం నడిచిన తీరు ఇలానే తయారైయింది.
‘పెళ్లి కాని ప్రసాద్’ లాంటి క్యారెక్టర్ల చుట్టూ పండే హ్యుమర్ ఇదివరకే కొన్ని సినిమాల్లో చూశాం. గణది కూడా అలాంటి క్యారెక్టరే. దీంతో ఆ పాత్రలో అంత కొంతదనం ఫీల్ అవ్వడానికి ఏమీ వుండదు. అయితే ఈ కథలో కీలక అంశమైన మ్యారేజ్ ‘బిజినెస్’ ఈ కథకు కొంత కొత్తదనం తీసుకొచ్చినప్పటికీ ఆ టాపిక్ ని డీల్ చేసిన విధానం మైక్ పట్టుకొని మరీ సందేశాలు దంచేస్తున్నట్లుగా వుంటుంది.
గణ పెళ్లి చూపుల తంతుతో కథ మొదలౌతుంది. హీరో పాత్ర చుట్టూ నడిపిన సన్నివేశాలు ఇదివరకు చూసిన చాలా సినిమాల సీన్లని గుర్తుకు తెస్తాయి. క్యారెక్టర్ లో కొత్తదనం లేనప్పుడు సన్నివేశాల్లో ఉండేలా చూసుకోవాలి. కానీ ఇందులో అది జరగలేదు. సన్నివేశాల అల్లిక పేలవంగా వుంది. ఒక సీన్ ఓపెన్ అయినవెంటనే అందులో కంటెంట్ ఏమిటో ప్రేక్షకుడి ఊహకు ముందే అందిపోతుంటుంది. గుణ, సిద్ది పాత్రల మధ్య కెమిస్ట్రీ వర్క్ అయితే కథలో డ్రామా బిల్డ్ అయ్యేది. కానీ ఆ రెండు పాత్రలు కథలో లీనం కాలేదు. ఇంటర్వెల్ ముందు వచ్చే ట్విస్ట్ బాగున్నప్పటికీ తర్వాత కథనాన్ని రక్తికట్టించేలా ముందుకు నడపలేకపోయారు.
ద్వితీయార్ధంలో ఈ కథ సీరియస్ టోన్ లోకి వెళ్ళిపోతుంది. తొలి సగంలో జేమి లివర్, నరేష్ కి మధ్య వచ్చే కొన్ని సీన్స్ నవ్వించేలా వుంటాయి. సెకండ్ హాఫ్ లో ఈ అవకాశం లేదు. మ్యాట్రీమోనీ మోసాలు చుపించే ప్రక్రియలో కథని ఒక న్యూస్ బులిటెన్ లా నడిపిన తీరు ఎంతమాత్రం ఆకట్టుకోదు. హీరోయిన్ పాత్ర చుట్టూ నడిపిన డ్రామా తేలిపోతుంది. కథ కోర్టు రూమ్ కి షిఫ్ట్ అయిన తర్వాత మరీ రొటీన్ గా మారిపోతుంది. ఆ వాదనలు, ప్రతి వాదనల్లో బలం లేదు. ఇక్కడ హీరో పాత్రకి టూ మచ్ లిబర్టీ ఇచ్చారు. తను అనుకున్న సాక్ష్యాన్ని చిటికెలో జడ్జ్ ముందు పెట్టేస్తుంటాడు హీరో. చివరికి ప్రభుత్వం వారు జారీ చేసిన హెచ్చరికలా ఈ కథ ముగిసిపోతుంది. `అసలు నువ్వు అప్పుడు ఈ నిర్ణయం తీసుకోక పోతే..` అంటూ హీరో పాత్రకు ఓ ఎలివేషన్ ఇస్తుంటాయి కొన్ని పాత్రలు. దాంతో హీరోకి పెళ్లి కాకపోవడానికి బలమైన కారణం ఏదో ఉండే ఉంటుంది అనిపిస్తుంది. చివరికి అది కూడా తుస్సుమంది. ఓ త్యాగశీలి ఎపిసోడ్ తో మరింత బోర్ కొట్టించారు.
అల్లరి నరేష్ ఈ మధ్య అన్నీ సీరియస్ పాత్రలు చేస్తున్నారు. ఇది కామెడీ టచ్ వున్న కథ. అలాగని బెండు అప్పారావ్ లాంటి ఎనర్జీ ఆశిస్తే నిరాశ తప్పుదు. ఇందులో ఆయది ప్రభుత్వం ఉద్యోగి పాత్ర. ప్రభుత్వ ఉద్యోగులంతా హుందాగా వుండాలనే రూలు ప్రకారం టక్ చేసుకొని నీట్ క్రాప్ దువ్వుకొని పద్ధతిగా కనిపించారు. నరేష్ కి పెక్యులర్ కామెడీ టైమింగ్ వుంటుంది. బహుశా రైటింగ్ లో లోపం ఏమో కానీ అది ఇందులో కనిపించలేదు. ఎమోషన్స్ సీన్స్ లో తన అనుభవం చూపించారు. ఫారియా నరేష్ హైట్ ని మ్యాచ్ చేసింది. ఈ కథలో ఆమేది కీలక పాత్రే. తన పాత్ర వరకూ చక్కగానే చేసింది. అయితే పాత్రని ఇంకా బలంగా తీర్చిదిద్దాల్సింది. జెమీ లివర్ టైమింగ్ బావుంది. తను చాలా యాక్టివ్ గా కనిపించింది. కాకపోతే అక్కడక్కడ కాస్త ఓవర్ అయ్యింది. వెన్నెల కిశోర్ ది కాసేపు కనిపించి మాయమయ్యే పాత్ర. మురళీ శర్మ, అజయ్, అనీష్ కురువిల్ల, రాజీవ్ కనకాల, రఘు బాబు, గోపరాజు రమణ ఇలా ఎంతోమంది తారాగణం ఉన్నప్పటికీ ఎవరికీ చెప్పుకోదగ్గ సీన్స్ లేవు.
గోపీ సుందర్ సంగీతం చప్పగా వినిపించింది. పాటలు రిజిస్టర్ కాలేదు, నేపధ్య సంగీతం సన్నివేశాలని ఇంకా రొటీన్ గా మార్చేసింది. కెమరాపనితనం ఫర్వాలేదు. ప్రొడక్షన్ డిజైన్ కథకు తగ్గట్టుగా వుంది. అబ్బూరి రవి మాటలు ప్రభావాన్ని చూపలేకపోయాయి. చాలా ఎమోషనల్ మాటలు రాశారు కానీ అవి మెసేజ్ లా మారిపోయాయి. దర్శకుడు కథ, కథనాన్ని రాసుకున్న విధానం బేసిక్ గా వుంది. అద్భుతంగా తీశారనే సన్నివేశాలు వెతికినా దొరకవు. ‘ఆ ఒక్కటీ అడక్కు’ ఈవీవీ క్లాసిక్ టైటిల్. ఇంత సాధారణమైన కంటెంట్ కి ఈ టైటిల్ పెట్టి పేరులోని మ్యాజిక్ ని తగ్గించినట్లయింది.
తెలుగు360 రేటింగ్ 2.25/5
-అన్వర్