శర్వానంద్ కి ఫ్యామిలీ హీరో ఇమేజ్ ఉంది. తాను మాస్ కథలు ఎక్కువ చేయకపోవడానికి కారణం అదే. తాజాగా తాను ఎంచుకున్న మరో ఫ్యామిలీ స్టోరీ.. `ఆడాళ్లూ మీకు జోహార్లు`. కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రష్మిక హీరోయిన్. శర్వానంద్, కిషోర్ల ట్రాక్ రికార్డ్, టైటిల్ చూస్తుంటే కచ్చితంగా కుటుంబ సమేతంగా చూసే చిత్రంలా అనిపిస్తోంది.దానికి తోడు ఈరోజు ఓ పాట విడుదలైంది. ఈ టైటిల్ సాంగ్ భలే క్యాచీగా ఉంది. శ్రీమణి రాసిన పదాలు ఈ పాటని మరింతగా జనంలోకి తీసుకెళ్లేలా ఉన్నాయి. పైగా దేవిశ్రీ ప్రసాద్ గొంతాయె. `మీరంతా మొగుళ్లతో కాపురాలు చేసుకుంటారు. నేను చేసుకోవద్దా` అంటూ.. తీయగా, గారంగా హీరో అడగడం బాగుంది.
కిషోర్ తిరుమల సినిమాల్లో ఈ తరహా క్యాచీ పదాలు, ట్యూన్తో పాట ఉండడం సర్వసాధారణం అయిపోయింది. నేను శైలజలో `శైలజా.. శైలజా` పాట సూపర్ హిట్టయ్యింది. `ఉన్నది ఒకటే జిందగీ`లో `వాటమ్మా.. వాటీస్ దిస్సమ్మా` పాట కూడా మార్మోగిపోయింది. ఈ రెండు పాటలు పాడింది దేవీనే. ఇప్పుడు ఈ పాటా తనే పాడాడు. పాట బాగుంది కానీ. చిన్న మైనస్ మార్కుంది. ఈ పాట కూడా `వాటమ్మా..` ట్యూన్లోనే సాగింది. కావాలని ఆ ట్యూన్ ని రిపీట్ చేశారా, లేదంటే… దేవిశ్రీ అలవాట్లో పొరపాటులా పాత ట్యూనే కొట్టేశాడా? అనేదే పెద్ద డౌటు. కాకపోతే… వినగానే ఎక్కేసింది పాట.