రైల్వే రిజర్వేషన్ కౌంటర్ల దగ్గర గంటల తరబడి క్యూ లైన్లలో నిలబడాల్సిరావడం మన దేశంలో సర్వసాధారణమయిన విషయమే. లైన్లో నిలబడ్డవారు కౌంటర్ వద్దకు చేరుకొనేలోగా తాము కోరుకొన్న తేదీకి టికెట్లు దొరుకుతాయో లేదో అనే ఆందోళనతో ఉంటారు. చివరికి కౌంటర్ వద్దకు చేరుకొని ‘హమ్మయ్య!’ అని ఊపిరి తీసుకొని టికెట్ కోసం అడిగితే అవతలి వైపు నుండి ‘ఆధార్ కార్డ్ జిరాక్స్ కాపీ ఇవ్వండి,’ అని బుకింగ్ క్లర్క్ అడగగానే గతుక్కుమంటారు. ఎందుకంటే నేటికీ చాలా మందికి సామాన్య ప్రజలకు ఆధార్ కార్డులు లేవు. ఒకవేళ ఉన్నా రిజర్వేషన్ చేసుకోవాలంటే ఆధార్ కార్డ్, దాని జిరాక్స్ ఉండాలని తెలియకపోవడమే కారణం. టికెట్ రిజర్వేషన్ చేయించుకోవడానికి తమ పనులన్నీ మానుకొని ఎంతో దూరం నుండి వచ్చి తెల్లవారుజాము నుండే రిజర్వేషన్ కౌంటర్ దగ్గిర పడికాపులు కాసేక ఈ చేదు అనుభవం ఎదురయినప్పుడు రైల్వేవాళ్ళని తిట్టుకొంటూ వెళ్లిపోతుంటారు. చాలా మందికి ఎప్పుడో అప్పుడు ఎదురయిన అనుభవమే ఇది.
అదేవిధంగా ఆన్ లైన్లో ఒక్కరోజు ముందుగా తత్కాల్ రిజర్వేషన్ చేసుకొనే వాళ్లకు తరచూ ఇటువంటి చేదు అనుభవమే ఎదురవుతుంటుంది. ఎందుకంటే కేవలం ఒక్క గంట సేపు మాత్రమే పనిచేసే తత్కాల్ బుకింగ్ సమయంలో ఆన్ లైన్లో రిజర్వేషన్ చేసుకొనేముందు అందరి ఆధార్ కార్డ్ నెంబర్లు లేదా వేరే గుర్తింపు కార్డుల నెంబర్లను విధిగా కాలమ్స్ లో నింపలసి ఉంటుంది. కానీ ఒక పక్క క్షణక్షణానికి టికెట్స్ అయిపోతుంటే, అందరి ఆధార్ కార్డ్ నెంబర్లు నింపడానికే పుణ్యకాలం కాస్తా సరిపోతుంది. ఒకవేళ ఏ ఒక్కరి నెంబరు అందుబాటులో లేకపోయినా ఇక అంతే సంగతులు!
ఈ సమస్యను గుర్తించిన రైల్వేశాఖ సెప్టెంబర్ 1వ తేదీ నుండి ఈ ఆధార్ కార్డు, కాపీ నెంబరు నిబంధనని తొలగించబోతోంది. కనుక ఎటువంటి గుర్తింపు కార్డు, నెంబరు లేకుండానే ప్రయాణికులు తమ టికెట్స్ రైల్వే రిజర్వేషన్ కౌంటర్స్ దగ్గర మరియు ఆన్ లైన్లో కూడా బుక్ చేసుకోవవచ్చును. కానీ ట్రైన్ ఎక్కినప్పుడు మాత్రం విధిగా గుర్తింపు కార్డు తీసుకువెళ్ళాలి. టికెట్ కండెక్టర్ అడిగినప్పుడు చూపించాల్సి ఉంటుంది.
రైల్వే శాఖ త్వరలోనే దేశవ్యాప్తంగా ఒకే నెంబర్:1512 తో హెల్ప్ లైన్ సేవలను కూడా అందుబాటులోకి తేనుంది. దేశంలో ఎక్కడి నుండయినా ప్రయాణికులు ఈ నెంబర్ కి ఫోన్ చేసి తమ పిర్యాదులను నమోదు చేసుకోవచ్చును. దీని కోసం రైల్వేశాఖ దేశ వ్యాప్తంగా ప్రత్యేక కంట్రోల్ రూమ్స్ ని ఏర్పాటు చేయబోతోంది. అక్కడ ప్రయాణికుల పిర్యాదులను నమోదు చేసుకొని సంబంధిత అధికారులకు, విభాగాలకు తక్షణమే పంపించబడుతాయి. ప్రయాణాలలో డబ్బు లేదా తమ వస్తువులను పోగొట్టుకొన్నవారు ఈ నెంబర్ కి పిర్యాదు చేసి తమ ప్రయాణం ఆపకుండా సాగిపోయే అవకాశం ఏర్పడుతుంది. అదేవిధంగా రైలులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు తమ బోగీలో ఏదయినా సమస్య ఎదుర్కొంటుంటే వారు కూడా ఈ నెంబర్ కి ఫోన్ చేసి పిర్యాదు చేయవచ్చును.