తమిళనాట విజయ్ కూడా పార్టీలో చేరికలు ప్రోత్సహిస్తున్నారు. తాజాగా లాటరీ కింగ్ గాపేరున్న శాంటియాగో మార్టిన్ అల్లుడు అధవ్ అర్జునను పార్టీలో చేర్చుకున్నారు. ఆయన ఇక నుంచి విజయ్ పార్టీ టీవీకేలో నెంబర్ టు పొజిషన్లో ఉంటారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. శాంటియాగో మార్టిన్ దేశంలో అనేక రాష్ట్రాల్లో లాటరీ వ్యాపారం చేస్తారు. ఎలక్టోరల్ బాండ్లు వెలుగులోకి వచ్చినప్పుడు అందరి కన్నా ఆయనే అన్ని పార్టీలకు ఎక్కువ విరాళాలు ఇచ్చినట్లుగా వెల్లడి అయింది. డీఎంకేకు అత్యంత సన్నిహితంగా ఉంటారు.
అయితే ఆయన అల్లుడు అర్జన మాత్రం బిన్నమైన దారిలో వెళ్తున్నారు. మొదట్లో ఆయన వీసీకే పార్టీలో ఉండేవారు. ఆ పార్టీ డీఎంకేకు మిత్రపక్షం. అయితే విజయ్ పార్టీ పెడతారని తెలిసిన తర్వాత ఆయన డీఎంకేపై విమర్శలు గుప్పించడం ప్రారంభించారు. దాంతో ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఇప్పుడు విజయ్ సమక్షంలోఆయన టీవీకేలో చేరిపోయారు. రాజకీయంగా ఆయనకు పెద్దగా పలుకుబడి లేకపోయినప్పటికీ.. విజయ్ పిలిచి పార్టీలో నెంబర్ టు పొజిషన్ ఇవ్వడం మాత్రం ఆసక్తికరంగా మారింది.
శాంటియాగో మార్టిన్ .. డీఎంకేతో సన్నిహితం సంబంధాలు కొనసాగిస్తున్నారు. ఆయనకు రాజకీయాలు కన్నా వ్యాపారమే ముఖ్యం. ఏపీలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీకి కూడా 150 కోట్ల రూపాయలు విరాళాలు ఇచ్చారు. అప్పట్లో ఏపీలో లాటరీలు తీసుకు రావాలని జగన్ అనుకున్నారు. తర్వాత వెనక్కి తగ్గారు.