‘రంగస్థలం’లో రామ్‌చరణ్‌కి అన్నయ్యగా కనిపించినా… ‘అజ్ఞాతవాసి’లో పవన్‌కల్యాణ్‌కి ప్రతినాయకుడిగా నటించినా… ‘నిన్ను కోరి’లో కథానాయిక నివేథా థామస్‌కి భర్తగా ప్రధాన పోషించినా… ఆది పినిశెట్టి అద్భుతంగా నటించాడనే పేరు తెచ్చుకున్నాడు. ‘సరైనోడు’లోనూ అంతే. హీరో మెటీరియల్ అనేట్టు ప్రతి పాత్రనూ అద్భుతంగా చేశాడు. కానీ, ఆయా సినిమాల్లో ఆది హీరో కాదు. నిజానికి, ‘ఒక విచిత్రం’తో తెలుగులో ఆది హీరోగా ఇంట్రడ్యూస్ అయ్యాడు. తరవాత తమిళంలోకి వెళ్లి తెలుగులోకి వచ్చేసరికి క్యారెక్టర్ రోల్స్ వచ్చాయి. తన దగ్గరకు వచ్చిన అవకాశాలను కాదనకుండా చేశాడు. అయితే… ఆది అమ్మమ్మకు మనవడు తెలుగులో హీరోగా నటిస్తే చూడాలని కోరిక. కానీ, ‘ఒక విచిత్రం’ తరవాత సోలో హీరోగా అతను తెలుగు సినిమా చేయలేదు. ‘గుండెల్లో గోదారి’ చేశాడు గానీ.. అందులో మరో హీరో సందీప్ కిషన్ వున్నాడు. మధ్యలో తమిళ అనువాద చిత్రాలతో తెలుగులోకి వచ్చాడు. నటుడిగా కెరీర్ స్టార్ట్ చేసిన 12 సంవత్సరాలకు ఆది అమ్మమ్మ కోరిక తీరింది. ఆది పినిశెట్టి హీరోగా నటించిన స్ట్రయిట్ తెలుగు సినిమా ‘నీవెవరో’. అందుకని, శుక్రవారం విడుదలవుతోన్న ఈ సినిమాని అమ్మమ్మకు అంకితం ఇస్తున్నట్టు ఆది పినిశెట్టి ప్రకటించాడు. దీని తరవాత ఈ హీరో ‘యుటర్న్’ చేస్తున్నాడు. అందులో సమంతది మెయిన్ రోల్. లేడీ ఓరియెంటెడ్ సినిమా. ఆది పినిశెట్టిది సపోర్టింగ్ రోల్. ‘నీవెవరో’ విడుదల తరవాత అమ్మమ్మ కోరికకు తగ్గట్టు హీరోగా సినిమా అవకాశాలు వస్తాయేమో చూడాలి!!