ఒకప్పుడు ఎన్నో సూపర్ డూపర్ హిట్స్తీసి, మాస్ దర్శకుడు అనిపించుకొన్నారు రవిరాజా పినిశెట్టి. ఆయన తనయుడు ఆది పినిశెట్టి హీరోగా బిజీగానే ఉన్నాడు. వైవిధ్యభరితమైన సినిమాలతో ముందుకెళ్తున్నాడు. ఇప్పుడు సరైనోడులో విలన్ పాత్ర పోషించి భేష్ అనిపించుకొన్నాడు. అన్నట్టు త్వరలోనే ఆది పెళ్లి చేసుకోబోతున్నాడట. ఈవిషయాన్ని తానే స్వయంగా చెప్పుకొచ్చాడు.
”ఇంట్లో పెళ్లి చేసుకోమని గొడవ చేస్తున్నారు. అంటే త్వరలోనే జీవిత ఖైదు విధించబోతున్నారన్నమాట. నేను తప్పకుండా జైలు కెళ్లాల్సిందే” అంటూ తన పెళ్లిపై తానే జోకు వేసుకొన్నాడు ఈ యువ నటుడు. ”ఎవ్వరినైనా ప్రేమిస్తే.. పెళ్లి చేస్తాం అని ఇంట్లోవాళ్లు చెప్పేశారు. అయితే అలాంటి గొడవలేం లేవు. ఇంట్లో చూసిన సంబంధాన్నే చేసుకొంటా. నా పెళ్లి బాధ్యత మొత్తం ఇంట్లోవాళ్లదే” అంటున్నాడు ఆది పినిశెట్టి. ‘సరైనోడు’ సినిమాలో తన పాత్రకు వచ్చిన రెస్పాన్స్ సూపర్బ్‌గా ఉందని మున్ముందూ ప్రతినాయకుడిగా మంచి అవకాశాలొస్తే నటిస్తానని అంటున్నాడు ఆది.