విలన్లు ఇంత స్టైలిష్గా వుంటారా? అదీ బోయపాటి సినిమాలో? అనిపించిన నటుడు ఆది పినిశెట్టి. ‘సరైనోడు’లో వైరం ధనుష్ పాత్రలో విలన్గా ఇరగదీసి నటించాడీ హీరో. తరవాత ‘అజ్ఞాతవాసి’లోనూ పాత్ర పరిధి మేరకు ఇంచు మించు అటువంటి విలన్ పాత్రే చేశాడు. ఇప్పుడు కొన్ని రోజుల పాటు విలన్ పాత్రలకు దూరంగా వుండాలని నిర్ణయించుకున్నాడు. వాటికి విరామం ప్రకటించాడు. హీరో పాత్రలపై కాన్సంట్రేట్ చేశాడు. ఆది పినిశెట్టి మంచి నటుడు. కానీ, హీరోగా సరైన సక్సెస్ రాలేదు. తెలుగుతో పాటు తమిళంలో హిట్ సినిమాలు చేసినా ప్రేక్షకుల్లో కోరుకున్న గుర్తింపు లభించలేదు. అటువంటి సమయంలో ‘సరైనోడు’ చేయడంతో ప్రేక్షకులకు బాగా చేరువయ్యాడు. తరవాత పాజిటివ్ క్యారెక్టర్ చేసిన ‘నిన్ను కోరి’ హిట్ అయ్యింది. రేపు రిలీజవుతున్న ‘రంగస్థలం’లోనూ పాజిటివ్ క్యారెక్టర్ చేశాడు. ఈ సినిమాలతో వస్తోన్న గుర్తింపుని హీరోగా కెరీర్ బిల్డ్ చేసుకోవడం కోసం ఉపయోగించుకోవాలనే ఆలోచనలో వున్నాడు. అందుకు తగ్గట్టు క్రేజ్ వున్న హీరోయిన్లతో హీరోగా సినిమాలు చేస్తున్నాడు. సమంత ‘యూటర్న్’లోనూ, తాప్సీతో కోన వెంకట్ నిర్మాణంలో రూపొందుతోన్న మరో సినిమాలోనూ ఆది నటిస్తున్నాడు.