ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. ‘2018’ చిత్రం ఆస్కార్ నామినేషన్స్ వరకూ వెళ్ళింది. ప్రస్తుతం అక్కడ బాక్సాఫీసు రికార్డులుని కొల్లగొడుతున్న ‘మంజుమ్మల్ బాయ్స్’ సర్వైవల్ మూవీనే. ఇప్పుడు ‘ఆడు జీవితం’ పేరుతో మరో సినిమాని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. బెన్యామిన్ రాసిన పాపులర్ నవల ‘గోట్ డేస్’ఆధారంగా తెరకెక్కిన సినిమా ఇది. పృథ్వీరాజ్ సుకుమారన్ కథానాయకుడు కావడం, దాదపు పదేళ్ళు పాటు స్క్రిప్ట్ పనులకే కేటాయించడం, ఆరేళ్లపాటు చిత్రీకరణ జరపడం, ఆస్కార్ విజేత ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందించడం.. ఇలా ఎన్నో విశేషాలతో ప్రేక్షుకుల దృష్టిని ఆకర్షించిన ఈ చిత్రం.. ఎలాంటి అనుభూతిని పంచింది? ఎడారిలో బానిసలుగా చిక్కుకుపోయిన వ్యక్తులు తమ మనుగడ కోసం సాగించే సాహసోపేతమైన ప్రయాణం ఎలా సాగింది?
నజీబ్ మహ్మద్ (పృథ్వీరాజ్ సుకుమారన్) ఇసుక కూలీ. నదిలో మునకవేసి ఇసుక తోడుకొచ్చి చిన్న పడవలో పోసుకొని ట్రాక్టర్ లో డంప్ చేయడం అతని పని. తను చేస్తున్న పనితో వచ్చిన డబ్బు ఎందుకూ సరిపడదు. నజీబ్ భార్య సైను(అమలాపాల్) గర్భవతి. కనీసం పుట్టబోయే బిడ్డకైనా మంచి భవిష్యత్ వుండాలని, బాగా చదివించాలని, ఓ ఇల్లు కట్టుకోవాలనే ఆశతో మరోదారి లేక వలస కూలీగా సౌదీకి వెళ్తాడు. తనతో పాటు మరో స్నేహితుడు హకీం (కేఆర్ గోకుల్) కూడా ఉంటాడు. అయితే ఏజెంట్ చేసిన మోసం కారణంగా ఎయిర్ పోర్ట్ లో వారిని రిసీవ్ చేసుకోవడానికి ఎవరూ రారు. ఈ ఇద్దరికీ భాష రాదు. ఎయిర్ పోర్ట్ లో దిక్కు తోచని పరిస్థితిలో ఈ ఇద్దరినీ అరబ్ వ్యక్తి ఖఫిల్(తాలిబ్) వ్యాన్ లో ఎక్కించుకుంటాడు. భాష రాకపోవడంతో అతనే తమ యజమానని భావిస్తారు. అలా ఖఫిల్ తో వెళ్లిన ఈ ఇద్దరి జీవితాలు ఏమయ్యాయి? అక్కడ ఎడారుల్లో బానిసలుగా ఎలాంటి జీవితం గడిపారు? తిరిగి స్వదేశం వచ్చారా లేదా? అనేది మిగతా కథ.
బతుకు తెరువుకు దేశం కానీ దేశం వెళ్లి అక్కడ చిక్కుల్లో కూరుకుపోయి వారి బాధలు వర్ణానాతీతం. ఆ బాధలు వింటుంటే గుండెలు బరువెక్కిపోతాయి. అలాంటి గుండె బరువెక్కించే కథే ‘ఆడు జీవితం’. ఎలాంటి కమర్షియల్ పట్టింపులూ లేకుండా కథని నిజంలా చిత్రీకరించి కాసేపు ప్రేక్షకులని పాత్రలతో పాటు ఎడారిలో నడిపించాడు ఈ చిత్ర దర్శకుడు బ్లెసీ. నెమ్మదిగా మొదలుపెట్టి పాత్రని అందులోని ఎమోషన్ ప్రేక్షకులు పట్టించడం మలయాళం ఫిల్మ్ మేకర్స్ స్టయిల్. ఆడు జీవితంలో కూడా అదే జరిగింది. ప్రతిది వివరంగా చూపిస్తూ నెమ్మదిగా మొదలైన కథ ఆ తర్వాత కాసేపటి బలంగా పట్టేస్తుంది. అదిరిపోయే డ్రామా, మలుపులు లేకపోయినప్పటికీ అసలు నజీబ్ చివరికి ఏమౌతాడనే ఆసక్తి ప్రేక్షకుల్లో వచ్చేస్తుంది.
నజీబ్ ఎడారి జీవితం, కేరళలో గడిపిన రోజులుని చూపిస్తూ ఒక బావోద్వేగ ప్రయాణంలో తొలిసగం సాగుతుంది. భాష తెలియని నజీబ్ అన్యాయంగా బానిసలా బతుకీడుస్తున్న సన్నివేశాలు మనసుని కలిచివేస్తాయి. నది, ఎడారి జీవితాన్ని దర్శకుడు చిత్రీకరించిన తీరు కదిలిస్తాయి. ఒక నది వొడ్డున పుట్టడం ఎంతటి సౌభాగ్యమో గతాన్ని గుర్తు చేసుకొని బాధపడుతున్న నజీబ్ కళ్ళలో కనిపిస్తుంది. ఎడారిలో దిక్కు తోచక మేకపిల్లని దగ్గరకి తీసుకొని ప్రేమగా కౌగిలించుకున్న దృశ్యం ప్రేక్షకుడి కళ్ళలో నిలిచిపోతుంది. అయితే సర్వైవల్ సినిమాల్లో కథతో పాటు కథనంలో వేగం, ఉత్సాహం వుండాలి. ఈ విషయంలో మాత్రం ఆడు జీవితం ప్రయాణం చాలా నిదానంగా వుంటుంది. ఎడారి నుంచి తప్పించుకోవాలనే నిర్ణయయానికి రావడం ఈ సినిమా విరామ ఘట్టం. అయితే అప్పటివరకూ నజీబ్ కు ఎదురైన అనుభవాలు, అతని బాధ.. మళ్లీ మళ్లీ పునరావృతం అవుతున్న భావన కలిగిస్తాయి.
సెకండ్ హాఫ్ లో అసలైన సర్వైవల్ జర్నీ మొదలౌతుంది. ఎంతకీ తరగని సముద్రం లాంటి ఎడారి. అందులో మూడు పాత్రలు చేసే ప్రయాణాన్ని దర్శకుడు చిత్రీకరించిన తీరు చాలా చోట్ల ఆశ్చర్యపరుస్తుంది. ఆ ఎడారిలో ప్రాణం ఉన్నంత వరకూ నడవడం తప్పితే మరో మార్గం లేదు. నడిచీ నడిచీ కాళ్ళు, దాహంతో పెదాలు పగిలిపోతాయి. ఒకదశలో ప్రేక్షకుడు అప్రయత్నంగా వాటర్ బాటిల్ ని వెతుక్కుంటాడు. అంత సహజంగా వుంటాయి సన్నివేశాలు. చమట చుక్కని పెదాలపై రాసిన సన్నివేశం ప్రేక్షకులు మనసులో ప్రింట్ అయిపోతుంది. ఇసుక నుంచి బయటికి వచ్చిన విష సర్పాలని చూస్తే వొళ్ళు జలదరిస్తుంది. ఎడారిలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయో దాదాపు అన్నీ కళ్ళకు కట్టినట్లు చూపించాడు దర్శకుడు.
ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలలబడింది పృథ్వీరాజ్ సుకుమారన్ నటన. నటుడిగా ఆయనకు మరో గొప్ప పాత్ర ఇది. నజీబ్ పాత్ర అతని కెరీర్ లో నిలిచిపోతుంది. ఈ సినిమా కోసం ఆయన పడిన శారీరక శ్రమ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. సెకండ్ హాఫ్ నుంచి అసలు తన మొహాన్ని గుర్తుపట్టలేం. స్నానం చేయడానికి వెళ్తున్నప్పుడు చూపించిన అతని శరీర సౌష్టవం షాక్ ఇస్తుంది. పొట్టలోపలకి అంటుకుపోయి, నడుం సన్నగిల్లిపోయిన అతన్ని చూస్తుంటే పాత్ర కోసం ఎంత కష్టపడ్డాడో తెరపై కనిపిస్తుంది. అతని ముఖంలో కళ్లు తప్ప మరోటి కనిపించదు. ఆ కళ్ళతోనే ఎన్నో భావాలు పలికించాడు. అమలా పాల్ పాత్ర చిన్నదే. ఆమెతో నదీ-ఎడారి ట్రాన్సిసన్ లో చిత్రీకరించిన పాట చాలా కవితాత్మకంగా, రసాత్మకంగా కుదిరింది. హకీం పాత్రలో కేఆర్ గోకుల్ నటన కట్టిపడేస్తుంది. దాహంతో మతిస్థిమితం కోల్పోయిన అతన్ని చూస్తే జాలి దుఃఖం కలుగుతాయి. ఇబ్రహీం ఖాదిరి పాత్రలో జిమ్మీ జీన్ లూయిస్ నటన సెకండ్ హాఫ్ లో కీలకం. మిగతా పాత్రలు కూడా సహజంగానే వున్నాయి.
ఏఆర్ రెహ్మాన్ పాటలు బావున్నాయి కానీ ఒక్కసారి వింటే రిజిస్టర్ అయ్యే పాటలు కావవి. నేపధ్య సంగీతం మాత్రం అసాధారణంగా వుంది. ఎడారిని తనలో లీనం చేసుకొని మ్యూజిక్ చేసినట్లుగా అనిపిస్తుంది. ఎడారి ప్రయాణంలో ఆ నేపధ్య సంగీతం కూడా ఒక పాత్రలా వుంటుంది. వేణువులో ఇసుక రేణువులు చేరితే ఎలాంటి ధ్వని వస్తుందో అంత సహజంగా ఈ కథ ఆత్మని పట్టుకొని మ్యూజిక్ చేశాడు. కెమెరాపనితనం, నిర్మాణ విలువలు ఉన్నతంగా కనిపిస్తాయి.
అయితే అన్ని వర్గాల ప్రేక్షకులు ఆస్వాదించే సినిమా కాదిది. ఒక్క శాతం వినోదం ఆశించి వెళ్ళిన నిరాశ తప్పదు. చాలా సీరియస్ ఫిల్మ్. కమర్షియల్ ఎలిమెంట్స్ తో పని లేకుండా ఒరిజినల్ సినిమాలని విపరీతంగా ఇష్టపడేవారు, పృథ్వీరాజ్ సుకుమారన్ నటనని ఆస్వాదించే వారు, సర్వైవల్ కథలపై ఆసక్తి వున్నవారికి ఈ సినిమా నచ్చే అవకాశం ఎక్కువ.