తెలుగు360 రేటింగ్ : 2.75/5
ఒకరి కష్టం, ఒకరి విజయం… ఆ ఒక్కరితో ఆగిపోవు. చాలామందికి స్ఫూర్తి పాఠాలుగా మిగిలిపోతాయి. ఎందరినో విజయ తీరాలకు చేరుస్తాయి. శిల్పంగా మారిన శిల… ఎన్ని ఉలి దెబ్బలు తిన్నదో మరో శిలకు తెలియాలి. అప్పుడే శిల్పం గొప్పదనం అర్థమవుతుంది. చుట్టూ చూస్తే ఎన్నో విజయ గాథలు కనిపిస్తుంటాయి. అవన్నీ మన జీవితంతోనూ, మన ప్రయాణంతోనూ, మన బతుకుతోనూ.. పరిచయం లేనివే కావొచ్చు. కానీ.. మన ప్రయాణం సవ్యంగా సాగాలంటే.. ఆ గెలుపు బాటలో వాళ్లకెదురైన ముళ్ల కథల గురించి మనకు తెలియాలి. అలాంటి కథల్లో ఓ కథ… ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకుడు గోపీనాథ్ ది.
రూపాయికే విమాన ప్రయాణం ఎలా? … ఈప్రశ్న చాలా కాలం క్రితం దేశమంతా నివ్వెరపోయేలా చేసింది.ఆ ప్రశ్నకు సమాధానం గోపీనాథ్. అసలు ఆ ఆలోచన ఎందుకొచ్చింది.? దాన్ని ఆచరణలో పెట్టడానికి ఎన్ని అడ్డంకుల్ని, ఎన్ని సవాళ్లని, ఎన్ని కుతంత్రాలనూ ఎదుర్కోవాల్సివచ్చింది? అన్న దానికి ప్రతిరూపమే.. `ఆకాశం నీ హద్దురా` సినిమా.
చుండూరు అనే గ్రామం అది. అక్కడ రైలు బండి కూడా ఆగదు. దాని కోసం ఎన్నో లేఖలు, నిరీక్షణలు, ఉద్యమాలు. అలాంటి ఊరి ప్రజల్ని విమానం ఎక్కిస్తానని శపథం చేస్తాడు మహా అనే.. చంద్రమహేష్ (సూర్య). ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగం వదిలి… ఎయిర్ డక్కన్ అనే సంస్థని స్థాపించాలని కలలు కంటాడు. రైలు ప్రయాణ ఛార్జీలకే.. విమాన ప్రయాణ సౌకర్యాన్ని ప్రజలకు అందించాలని ప్రయత్నిస్తాడు. కానీ… మహా వెనుక ఎలాంటి అండదండలు లేవు. డబ్బు లేదు. అధికారుల సహాయం లేదు. పైగా… ఈ వ్యాపారంలో పాతుకుపోయిన పరేష్ (పరేష్ రావల్) జిత్తుల మారి తెలివితేటల ముందు.. మహా బోల్తా కొడుతూనే ఉంటాడు. అడుగడుగునా ఆటంకం. కానీ.. మనసు మాత్రం గాల్లో ఎగురుతుంటుంది. భార్య బేబీ (అపర్ణ) అందుకు వంత పాడుతుంటుంది. `నీ ఆశలన్నీ మాటలకే పరిమితమా, చేతల్లో చూపించలేవా?` అంటూ సవాల్ విసురుతుంటుంది. మరి.. చంద్రమహేష్ ఏం చేశాడు? ఎన్ని డక్కాముక్కీలు తిన్నాడు? చివరికి తన విమానాన్ని ఎలా ఎగరవేశాడు? ఇవన్నీ తెరపైనే చూడాలి.
ఈ సినిమాలో ఓ సీన్ ఉంది. ఉడిపీ హోటెల్ కీ, స్టార్ హోటెల్కీ తేడా చెబుతూ సాగే సన్నివేశం అది. ఇక్కడ 13 రూపాయలకు దొరికేదోశ… స్టార్ హోటెల్లో 200కి ఎందుకు అమ్ముతున్నారు? అని ప్రశ్నిస్తాడు హీరో. హంగులు అన్నీ పక్కన పెడితే – అతి తక్కువ ధరకి విమాన ప్రయాణం సాధ్యం అవుతుందన్నది హీరో పాయింట్. దాన్నిఎంత సింపుల్ గా చెప్పాడో కదా అనిపిస్తుంది. నిజానికి ఈ కథ అంత సింపుల్ కాదు. విమాన యాన వ్యవస్థ, అందులో మతలబులు, అనుమతులు సాధించడానికి చేసే ప్రయత్నాలు.. ఇవన్నీ టెక్నికల్ విషయాలు. వాటిని ఎంత సులభంగా చెప్పినా అర్థం కావు. అలాంటి సన్నివేశాలు ఇందులో చాలా ఉన్నాయి. వాటిని సుధా కొంగర సాధ్యమైనంత వరకూ సాఫ్ట్ గా డీల్ చేయడానికి ప్రయత్నించినా, అర్థం కాని పాయింట్స్చాలానే కనిపిస్తాయి. ప్రతీదాన్నీ ఉడిపీ హోటల్ థీరీ లా.. విడమరచి చెప్పే వీలు లేదు. వీలున్నమట్టుకు చెప్పగలిగింది. మిగిలినవి.. కొన్ని అర్థం కావు.
ఇది ఓ విజేత కథ. మామూలుగా అయితే… మిగిలిన కథల్లో హీరో ఈజీగా గెలిచేస్తాడు. ఒకట్రెండు దెబ్బలు తగిలినా, ఓర్చుకుని.. మూడో దెబ్బ తనపై పడకుండా చూసుకుంటాడు. కానీ.. ఇది అలాంటి ఫిక్షన్ కథ కాదు. జరిగిన కథ. కాబట్టి.. హీరో చివరి వరకూ ఎదురు దెబ్బలు తింటూనే ఉంటాడు. చివరికి మాత్రమే గెలుస్తాడు. అందుకే కట్.. చేస్తే – విక్టరీ అనే కథలకు ఈ సినిమా బాగా దూరంగా ఉంటుంది. దాదాపు అన్ని సన్నివేశాలు రియలిస్టిక్ గానే ఉండేలా జాగ్రత్త పడ్డారు. కొన్ని సందర్భాల్లో దర్శకురాలు సినిమాటిక్ అడుగులు వేసింది. ముఖ్యంగా మహా రాష్ట్రపతిని కలుసుకోవడం. ఆ సీన్ చూస్తే… రాష్ట్రపతి సెక్యురిటి ని బురిడీ కొట్టించ డం అంత తేలికా అనిపిస్తుంది. కథానాయకుడి సంబంధించిన ఫ్లైట్ లాండ్ అవ్వడానికి కూడా ప్రతినాయకుడు అడ్డు తగలడం చూస్తే… దర్శకురాలు సినిమా పేరిట ఎంత స్వేచ్ఛ తీసుకుందో అర్థం అవుతుంది.
హీరో గెలిస్తే ఈ సినిమా ఐపోతోంది. ఆ తరవాత చెప్పడానికి ఏమీ వుండదు. అందుకే వీలైనంత వరకూ ఆ విజయాన్ని దర్శకురాలు వాయిదా వేసుకుంటూ వెళ్ళింది. చివర్లో కూడా… హీరో చేతికి గెలుపు పగ్గాలు అందించే ముందు.. ఓ ట్విస్టు జోడించి.. దాన్ని ఇంకాస్త సాగదీసింది. ఒక దశలో హీరో గెలుస్తాడా లేదా అనే అనుమానం తో కూడిన విసుగు ప్రేక్షకులకి కలుగుతుంది. నిజానికి అంత మెలోడ్రామా అవసరం లేదు. కాకపోతే.. అలాంటి సన్నివేశాలు రాసుకోకపోతే కథలో `హై` రాదు.
కథానాయిక బేబీ పాత్రని బాగా రాసుకోవడం, భార్యా భర్తల మధ్య అనుబంధాన్ని, వాళ్ల ప్రేమని ఓ కొత్త కోణంలో చూపించడం – ఈ కథకు బలం చేకూరేలా చేయగలిగింది. నాన్నని కడసారి చూడ్డానికి కథానాయకుడు తాపత్రయ పడడం, విమాన ప్రయాణానికి తగినంత డబ్బులు లేకపోవడం, ఎయిర్ పోర్టులో మిగిలిన ప్రయాణికుల దగ్గర ప్రాధేయ పడడం లాంటి సన్నివేశాలు.. కాస్త ఎమోషన్ టచ్ ఇవ్వగలిగాయి. కాకపోతే కొన్ని చోట్ల తమిళ అతి కనిపిస్తుంది. తండ్రిని కడసారి చూడ్డానికి వెళ్లినప్పుడు తల్లి ఊర్వశి చెప్పిన డైలాగులు తమిళ వెర్షన్ వరకూ ఉంచుకుంటే బాగుండేది. తెలుగులో కాస్త శ్రుతిమించినట్టు కనిపిస్తాయి.
సూర్య సినిమాలు ఫ్లాప్ అవ్వుండొచ్చు గానీ, నటుడిగా సూర్య ఎప్పుడూ ఫ్లాప్ అవ్వలేదు. తన కమిట్మెంట్ ఈ సినిమాలోనూ చూపించాడు. అత్యంత సహజమైన నటన ప్రదర్శించాడు. తన కలల్ని సాధించడానికి ఓ సాధారణమైన వ్యక్తి పడే తపన, తాపత్రయం ఆ పాత్రలో కనిపించాయి. ఈ పాత్రకు సత్యదేవ్ డబ్బింగ్ చెప్పాడు. సత్యదేవ్ ది బాగా తెలిసిన గొంతు. పైగా ఈమధ్య నటుడిగానూ బాగా రాణిస్తున్నాడు. అందుకనేనేమో.. తెరపై సూర్యతో పాటు సత్యదేవ్ కూడా కనిపిస్తున్న ఫీలింగ్ కలిగింది. సూర్య పాత వాయిసే బాగుండేది అనుకుంటే అది ప్రేక్షకుల తప్పు కాదు. సత్యదేవ్ తప్పు అంతకంటే కాదు. అపర్ణది హీరోయిన్ ఫేస్ కాదు. కాకపోతే చూడగా చూడగా తాను కూడా నచ్చుతుంది. ఎందుకంటే బేబీ పాత్రని డిజైన్ చేసిన విధానం అలా ఉంది. పరేష్ రావల్ హుందాగా కనిపించాడు. మోహన్ బాబుది కేవలం అతిథి పాత్ర. మూడు సన్నివేశాల్లోనే కనిపించాడు. అయితే… ఓ కీలకమైన సన్నివేశంలో ఆ పాత్ర హీరోని ఆదుకుంటుంది. కాబట్టి కాస్తో కూస్తో మైలేజీ వచ్చింది.
పాటలకు పెద్దగా స్కోప్ లేదు. హీరోయిన్ పాడుకునే పాట బాగుంది. మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది. కెమెరా, ఆర్ట్ విభాగాలకు మంచి పని దొరికింది. గ్రాఫిక్స్‌పై ఇంకాస్త వర్క్ చేయాల్సింది. దర్శకురాలు… ఓ స్ఫూర్తి గాధని వీలైనంత నిజాయతీగా చూపించే ప్రయత్నం చేసింది.
తెలుగు360 రేటింగ్ : 2.75/5