పూరి తనయుడు ఆకాష్‌కి ఓ విచిత్రమైన అనుభవం ఎదురైంది. తండ్రి ముందే.. హీరోయిన్ తో రొమాన్స్ చేయడం. ఎంత కెమెరా ముందే అయినా – ఏ నటుడికైనా అది ఇబ్బందే. పూరి ఆకాష్ నటించిన చిత్రం.. `రొమాంటిక్`. ఈ చిత్రానికి పూరి నిర్మాత. కథ కూడా ఆయనే రాశారు. అయితే దర్శకత్వ బాధ్యతలు మాత్రం తన శిష్యుడికి అప్పగించారు. టైటిల్ కి తగ్గట్టుగానే… ఈ సినిమాలో రొమాన్స్ కుమ్మరించేశాడు పూరి. తండ్రి ముందు హీరోయిన్ తో అంత రొమాన్స్ చేయడం ఆకాష్ కి ఇబ్బంది అనిపించిందట. అందుకే `నువ్వు ఎక్కడి నుంచి దూకమంటే అక్కడి నుంచి దూకుతా. కానీ ఈ రొమాన్స్ మాత్రం తగ్గించు నాన్నా` అని ఓసారి పూరిని వేడుకున్నాడట. కానీ పూరి మాట వింటే కదా? `సినిమా పేరే రొమాంటిక్. అలాంటిది రొమాన్స్ తగ్గించమంటే ఎలా` అని అడిగాడట. అలా.. పూరి రాసిన రొమాన్స్ అంతా.. తెరపై చూపించాల్సి వచ్చింది.
”నిజానికి ఈ కథ నాకు ముందే తెలుసు. నాన్న గారు కథ రాస్తున్నప్పుడు ఈసినిమాలో నన్ను హీరోగా ఊహించుకోలేదు. నేను కూడా ఈ సినిమా ఎవరు చేస్తారా? అనుకున్నా. కానీ ఓరోజు నన్ను పిలిచి.. నువ్వే ఇందులో హీరో అన్నారు. దాంతో నేను షాక్ కి గురయ్యా..” అని చెప్పుకొచ్చాడు ఆకాష్. ఈ శుక్రవారం విడుదల అవుతున్న `రొమాంటిక్`లో రమ్యకృష్ణ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. కేతిక శర్మ కథానాయిక.