సాధారణంగా రాజకీయాల్లో పైకి రావాలంటే.. ఏం చేయాలి ?. ముందుగా పది మంది కుర్రోళ్లను పోగేసి రౌడీయిజం చేయాలి. కొట్టుకోవాలి.. కొట్టించుకోవాలి. రౌడీగా పేరు తెచ్చుకున్నాక.. రాజకీయ నాయకుడు అవుతాడు. లేకపోతే అప్పటికే రాజకీయంలో ఉన్న వాళ్ల వారసులు నేతలవుతారు. అంతే కానీ.. బాగా చదువుకున్నాడు.. తెలివి తేటలున్నాయి..సేవ చేసేందుకు వచ్చాడు అంటే.. ఎవరూ పట్టించుకోరు. కానీ అలాంటి వాళ్లను రాజకీయ నేతలుగా మార్చింది ఆమ్ ఆద్మీ పార్టీ. దానికి తాజా సాక్ష్యం.. ఢిల్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్న అతిషీ.
అతిషీ ఆక్స్ ఫర్డ్ లో రెండు పీజీలు చేసిన మహిళ. ఆమె తల్లిదండ్రులు ఢిల్లీ యూనివర్శిటీలో ప్రొఫెసర్లు. విద్యాధికుల కుటుంబం నుంచి వచ్చారు. బాగా చదువుకున్నారు. అయినా రాజకీయాల్లోకి వచ్చారు. ఆమ్ ఆద్మీ పార్టీలో మంత్రి అయ్యారు. ఇప్పుడు సీఎం అవుతున్నారు. ఇంకా చెప్పాలంటే..ఆమ్ ఆద్మీ పార్టీ ఉన్న నేతలంతా భిన్నమైన వారే . బీజేపీ, కాంగ్రెస్ పార్టీల్లో నేతలు.. ఆప్ లో చేరరు. చేర్చుకోరు కూడా. పంజాబ్ ఎన్నికల్లో అయినా హర్యానాలో అయినా…భిన్నమైన రాజకీయ నేతల్ని తెరపైకి తేవడంతో ఆప్ ది ప్రత్యేకత.
అతిషీ డిల్లీ సీఎం అవడం.. మన ప్రజాస్వామ్యంలో మార్పునకు సంకేతం అనుకోవచ్చు. రాబోయే రోజుల్లో ఇలా విద్యాధికులు.. సమాజం గురించి ఆలోచించేవారికి ఇది ప్రోత్సాహం ఇస్తుందనడంలో సందేహం లేదు. తెలుగు రాష్ట్రాల్లో గతంలో లోక్ సత్తా పార్టీ అలాంటి ప్రయత్నం చేసింది కానీ..ప్రజలు ఆ ప్రయత్నంలో నిజాయితీని చూడలేకపోయారు. ఫలితంగా ఫెయిల్డ్ ప్రాజెక్టుగా మిగిలిపోయింది. కానీ ఆమ్ ఆద్మీ మాత్రం కొత్త తరం నేతల్ని అందిస్తోంది.