డిల్లీకే పరిమితం అయిన ఆమాద్మీ పార్టీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో ఏమి పని? అంటే అది ఒక రాజకీయ పార్టీ కనుక దేశంలో అని రాష్ట్రాలలో తన రాజకీయ కార్యకలాపాలు నిర్వహించుకొనే స్వేచ్చ, హక్కు దానికి ఉన్నాయి కనుక ఏపికి కూడా విస్తరించాలనుకొంటే తప్పు కాదని చెప్పుకోవచ్చు. అందుకే అది 2014 ఎన్నికలలో ఆ ప్రయత్నం చేసింది కానీ రెండు తెలుగు రాష్ట్రాలలో దానిని ఎవరూ పట్టించుకోలేదు.
ఆ పార్టీ ఎమ్మెల్యే సోమ్ నాథ్ భారతి నిన్న తిరుపతికి వచ్చినప్పుడు “ప్రత్యేక హోదా సాధించలేకపోయినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజీనామా చేయాలి,” అని డిమాండ్ చేశారు. మీడియా ప్రతినిధులు జనసేన పార్టీ, దాని అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గురించి ఆయన అభిప్రాయం అడిగితే “పవన్ కళ్యాణ్ ఎవరు?” అని ఆయన ఎదురు ప్రశ్నించడం విశేషం. ఆమాద్మీ పార్టీ దక్షిణాది రాష్ట్రాల ఇన్-ఛార్జ్ గా వ్యవహరిస్తున్న ఆయనకి రాష్ట్రంలో జనసేన పార్టీ ఒకటుందనే సంగతి కూడా తెలియదని స్పష్టం అయింది. పవన్ కళ్యాణ్ కున్న ప్రాముఖ్యతని ప్రధాని నరేంద్ర మోడీ కూడా గుర్తించి గత ఎన్నికలలో ఆయన సహాయం పొంది లాభపడ్డారు. అటువంటి పవన్ కళ్యాణ్ ఎవరో కూడా తెలియనప్పుడు ఇక ఆమాద్మీ పార్టీ రాష్ట్రంలో ఏవిధంగా రాజకీయాలు చేయగలదు? అనుకొంటే పొరపాటే. ఎందుకంటే 2019 ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆమాద్మీ పార్టీయే అధికారంలోకి వస్తుందని ఆయన జోస్యం చెప్పారు. రాష్ట్ర రాజకీయాలు, పరిస్థితుల గురించి ఏమాత్రం అవగాహన లేకపోయినా ఆయన ప్రత్యేక హోదా గురించి మాట్లాడటం, దాని కోసం ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేయడం, రాష్ట్రంలో ఆమాద్మీ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పడం వలన ఆయనే నవ్వులపాలయ్యారు.
తెలుగు ప్రజలు అందరికీ ఆమాద్మీ పార్టీ గురించి, డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గురించి తెలుసు కానీ ఆమాద్మీ పార్టీకి మాత్రం తెలుగు రాష్ట్రాల గురించి ఏమాత్రం అవగాహన లేదని స్పష్టం అయింది. అయినా రాష్ట్ర రాజకీయాల గురించి అది మాట్లాడటం విచిత్రంగానే ఉంది.