అధికారంలోకి వచ్చి ఏడాదైనా కాకముందే ఆమ్ ఆద్మీ పార్టీ వారు ఇతర పార్టీలను మించి అబద్ధాలు, కుట్రల్లో ఆరితేరినట్టు కనిపిస్తోంది. ఢిల్లీ సచివాలయం మూడో అంతస్తులోని ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ రాజేంద్ర కుమా్ కార్యాలయంపై ఇటీవల సీబీఐ అధికారులు దాడి చేశారు. మొత్తం 14 చోట్ల దాడులు జరిపారు. వాటిలో ఒకటి ఈ ఆఫీసు. కానీ కేజ్రీవాల్ మాత్రం తన ఆఫీసు మీదే దాడి జరిగిందంటూ పొద్దున్నే ట్వీట్ల పరంపర మొదలుపెట్టారు. నిజానికి, సీబీఐ అధికారులు సీఎం కార్యాలయం జోలికి పోలేదు.
ఈ విషయం స్వయంగా ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వమే ఒప్పుకొంది. ఢిల్లీ ప్రభుత్వ కేబినెట్ నోట్ లో ఈ విషయం స్పష్టంగా పేర్కొన్నారంటూ టైమ్స్ నౌ చానల్ బయటపెట్టింది. దీనికి సంబంధించిన డాక్యుమెంటును సంపాదించి ప్రేక్షకుల ముందుంచింది. అలాగే, మంగళవారం జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో కేజ్రీవాల్ మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం తన ఆఫీసు మీదే సీబీఐ దాడులు చేయించిందని ఆరోపించారు. మోడీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ఈ విషయంలో ఆప్ నేతలను ప్రశ్నిస్తే గయ్యిమంటున్నారు. అరుపులు కేకలతో దబాయిస్తున్నారు. సామాజిక కార్యకర్తలనే పేరుతో ఇతరులమీద కేకలు వేయడంలో చాలా మంది ఆరితేరిపోయారు. ఇప్పుడు మీడియా తోనూ అదే విధంగా ప్రవర్తిస్తున్నారు.
మోడీ రాజీనామాకు కేజ్రీవాల్ డిమాండ్ చేయడమంటే, ప్రజాస్వామ్యం మీద ఆయనకు గౌరవం లేనట్టే. మోడీ ప్రజాస్వామికంగా ఎన్నికైన ప్రధాన మంత్రి. ఆయన్ని రాజీనామా చేయాలని అడగడానికి కేజ్రీవాల్ ఎవరు? పైగా, ఒక అధికారిపై అవినీతి ఆరోపణలు వస్తే సీబీఐ దాడి చేసింది. ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం ఎంతో మంది అధికారులపై ఏసీబీ దాడులు చేయించింది. ప్రభుత్వంలో అవినీతిని అరికట్టడానికి చర్యలు తీసుకోవడం సహజం. తన కార్యదర్శిపై దాడి చేస్తే కేజ్రీవాల్ కు అంత ఉక్రోశం ఏమిటో అర్థం కాదు. కార్యదర్శితో ఉన్న లావాదేవీలు ఏమిటో బయటపడాల్సి ఉంది.
నీతి నియమాలు, కొత్త తరహా రాజకీయాలంటూ ఉపన్యాసం ఇచ్చిన ఆప్ నేతల వ్యవహార శైలి రోజురోజుకూ అందుకు భిన్నంగా కనిపిస్తోంది. ఎవరిని పడితే వాళ్లను నోటికొచ్చినట్టు తిట్టడం, ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం, దాదాగిరీ తరహాలో ఇతరులను బెదిరించేలా ప్రకటనలు చేయడం ద్వారా ఆప్ తన ఇమేజిని చేజేతులా చెడగొట్టుకుంటోంది. తొలిసారి ప్రభుత్వం నుంచి దిగిపోయినప్పుడు తీవ్రంగా బద్నాం అయ్యారు. అయినా జనం దయతలిచి 67 సీట్లతో అధికారాన్ని ఇచ్చారు.
ఢిల్లీలో విద్య, వైద్యం, రేషన్ పంపిణీ, విద్యుత్తు, మంచి నీరు, రెవెన్యూ, ఇంకా అనేక అంశాలున్నాయి. అనేక సమస్యలున్నాయి. ఎల్ కేజీ పిల్లలకు ప్రయివేటు స్కూళ్లలో ఫీజులు ఎంతో చెప్తేనే కళ్లు తిరుగుతాయి. ఇంకా ఇలాంటి అంశాలపై దృష్టి పెట్టడం, అభివృద్ధి పనులు చేయడం మానేసి, ఎంతసేపూ కేంద్రంతో కయ్యానికి కాలు దువ్వడమే పనిగా పెట్టుకుంటే ప్రజలను మోసం చేయడమే అవుతుంది. కేంద్రంతో కలిసి ఢిల్లీని ముందుకు నడపడం తెలివైన పని. కానీ చాలా మంది ఆప్ నేతల వ్యవహార శైలి చూస్తుంటే, వారు విమర్శించే కొన్ని సంప్రదాయ పార్టీలను మించి అధికార మైకం అప్పుడే ఒంటబట్టినట్టు అర్థమవుతుంది. మొత్తం మీద ఢిల్లీ ప్రజలు ఆప్ చేతిలో మోసపోతారో, మిగిలిన నాలుగేళ్లలో అయినా ఆప్ నేతలు అభివృద్ధికి బాటలు వేస్తారో చూద్దాం.