ఆమాద్మీ పార్టీ డిల్లీలోనే కాకుండా పంజాబ్ రాష్ట్రంలో కూడా కొంచెం బలంగానే ఉంది. 2014 ఎన్నికలలో ఆ పార్టీ నాలుగు ఎంపి సీట్లు గెలుచుకొని తన సత్తా నిరూపించుకొంది. కనుక వచ్చే ఏడాది జనవరిలో జరుగబోయే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాదించాలని ఇప్పటి నుండే ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఆ ప్రయత్నాలలో భాగంగానే 1984లో డిల్లీలో జరిగిన సిక్కుల ఊచకోతపై విచారణ చేసేందుకు అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసారు. వారిలో కొన్ని బాధిత కుటుంబాలకు ఒక్కకరికీ రూ.5లక్షల చొప్పున నష్టపరిహారం కూడా చెల్లించారు.
అవినీతిపై పోరాటాన్ని అజెండాగా స్వీకరించి డిల్లీ ఎన్నికలలో గెలిచిన ఆమాద్మీ పార్టీ, పంజాబ్ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య మాదకద్రవ్యాల సరఫరాను అరికట్టడం తన ప్రదాన అజెండాగా పెట్టుకొన్నారు. పంజాబ్ లో ప్రస్తుతం అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్ నేతృత్వంలోని శిరోమణి అకాలీ దళ్ ప్రభుత్వంలో కొందరు మంత్రులు అవినీతిపరులుగా ముద్ర సంపాదించుకొన్నారు. వారిలో కొందరు మాదకద్రవ్యాల వ్యాపారంలో కూడా ఉన్నట్లు సమాచారం. అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం సుమారు ఏడాదిగా అవినీతికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న తీరు వలన పంజాబ్ లో ఆ పార్టీకి మంచి ఆదరణే కనబడుతోంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పంజాబ్ లో అధికారం దక్కించుకోగలిగితే, ఆ తరువాత పక్కనే ఉన్న హర్యానా రాష్ట్రంలోకి ఆమాద్మీ పార్టీని విస్తరించవచ్చునని అరవింద్ కేజ్రీవాల్ భావిస్తున్నారు. ఎలాగు పంజాబ్ లో ఆమాద్మీ పార్టీ ఉంది కనుక పార్టీ వ్యవహారాలు చూసుకొనే మిషతో అరవింద్ కేజ్రీవాల్ అపుడప్పుడు పంజాబ్ వెళ్లి వస్తూ అక్కడి ప్రజలతో కొంచెం టచ్చులో ఉంటున్నారు.
కానీ ఆమాద్మీ పార్టీకి ఆ పార్టీ నుండి బహిష్కరించబడిన నేతలు యోగేంద్ర యాదవ్, ప్రశాంత్ భూషణ్ ల నుంచే సవాలు ఎదురయ్యే అవకాశం కనబడుతోంది. వారిద్దరూ కలిసి కొత్తగా ఒక పార్టీ స్థాపించి పంజాబ్ ఎన్నికలలో తమ పార్టీ తరపున అభ్యర్ధులను బరిలోకి దింపడం ద్వారా, తమను రాజకీయంగా దెబ్బ తీసిన అరవింద్ కేజ్రీవాల్ పై ప్రతీకారం తీర్చుకోవాలనుకొంటున్నారు. బహుశః కాంగ్రెస్ లేదా బీజేపీ వారిరువురికి అందుకు తప్పకుండా సహకరించవచ్చును.