ఆమ్ ఆద్మీ పార్టీ దేశంలో ఉన్న రాజకీయ పార్టీల్లోకెల్లా ప్రత్యేకమైనదని అనుకుంటారు కానీ.. ఆ పార్టీ కూడా ఓట్లేస్తే డబ్బులిస్తామనే హామీలనే ఎక్కువగా నమ్ముకుంటోంది. పంజాబ్ , గోవాల్లో అధికారం చేపట్టే స్థాయిలో కాకపోయినా ప్రతిపక్ష స్థానానికి తగ్గ సీట్లు వస్తాయని సర్వేల్లో తేలుతూండటంతో.. కేజ్రీవాల్ ఉత్సాహంగా ఉచిత హామీలు ఇస్తున్నారు. వాటితో ఆయన అధికార పీఠం దాకా వెళ్లాలని అనుకుంటున్నట్లుగా కనిపిస్తోంది.
పంజాబ్,గోవాల్లో ఉచిత కరెంట్ హామీ ఇచ్చేశారు. మూడు వందల యూనిట్లు వరకూ ఉచిత కరెంట్ ఇస్తామని చెప్పారు. 18 ఏళ్ల పైబడిన మహిళలందరికీ ప్రతినెలా రూ.1,000 సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఇక నిరుద్యోగులకు నిరుద్యోగభృతి కింద నెలకు రూ.3,000 సాయం చేస్తామన్న హామీ కూడా ఇస్తున్నారు. కామన్‌గా నిరంతరాయ విద్యుత్, నీటిని ఉచితంగా అందిస్తామని, రోడ్లను మెరుగుపరుస్తామని, అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత విద్యను కల్పిస్తామని మేనిఫెస్టోలో పెడుతున్నారు.
కేజ్రీవాల్ ఇస్తున్న హామీలు చూసి ఇతర రాజకీయ పార్టీల నేతలు కూడా ఆశ్చర్యపోతున్నారు. అధికారం కోసం ఉచిత హామీలను ఇవ్వడంతో సంప్రదాయ రాజకీయ పార్టీల కన్నా ఎక్కువగా కేజ్రీవాల్ హామీలిస్తూండటమే దీనికి కారణం. ఇప్పటి వరకూ చాలా మంది ఆమ్ ఆద్మీ పార్టీ అంటే ఉన్నతమైన లక్ష్యలతో ఉండే పార్టీగా భావిస్తూ వస్తున్నారు. ఇప్పుడా అభిప్రాయాన్ని రాజకీయ విస్తరణ కోసం కేజ్రీవాలే.. త్యాగం చేసుకుంటున్నారు.