అరవింద్ కేజ్రీవాల్ తనకుతాను గొప్పలు చెప్పుకోవచ్చు. కానీ గతంలో ఆయన్ని అభిమానించిన ఫాలోయర్స్ లో కొంతమంది కేజ్రీవాల్ పనితీరు, ప్రవర్తన పట్ల ఈమధ్యకాలంలో తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. కేజ్రీవాల్ దిష్టిబొమ్మలు తగలబెడుతున్నారు. ఆయనపై ఇంకు జల్లుతున్నారు. ఆయనో క్రాక్ అంటూ తిట్టిపోస్తున్నారు. ఇంత వ్యతిరేకత వస్తున్నప్పటికీ, కేజ్రీవాల్ తన పంథా మార్చుకునే లక్షణాలు ఏమాత్రం కనబడటంలేదు.
`ఆమ్ ఆద్మీ సేన’ (AAS) పేరిట వెలిసిన ఒక రాజకీయ వేదిక కేజ్రీవాల్ పనితీరుపై దుమ్మెత్తిపోస్తోంది. ఆదివారం (17-01-16)నాడు ఢిల్లీలోని ఛత్రాసాల్ స్టేడియంలో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తన గొప్పను చాటింపువేయడంకోసం ఒక ఉత్సవ సభను పెట్టించారు. ఢిల్లీలో కాలుష్యాన్ని తగ్గించేదిశగా ఈమధ్యనే ఆయన ప్రవేశపెట్టిన `ఆడ్ అండ్ ఈవెన్ కార్ పాలసీ’ విజయవంతమైన సందర్భంగా ఈ ఉత్సవ సభను ఏర్పాటుచేశారు. వేదికమీద నిలబడి కేజ్రీవాల్ ఢిల్లీ ప్రజల నుద్దేశించి ప్రసంగిస్తున్న సమయంలో అనుకోకుండా ఒక సంఘటన జరిగింది. ఆమ్ ఆద్మీ సేన (AAS)కు చెందిన 27 ఏళ్ల భావనా అరోరా అనే యువతి వేదిక దిశగా దూసుకువస్తూ కేజ్రీవాల్ కు వ్యతిరేక నినాదాలు చేసింది. అక్కడితో ఊరుకోకుండా ముఖ్యమంత్రిపై ఇంకుజల్లింది. అంతేకాదు, ఒక సిడీని, కొన్ని కాగితాలను వేదికవైపు విసిరేసింది. సీఎన్ జీగా ఆమె పేర్కొన్న కుంభకోణంపై విచారణ జరపాలని డిమాండ్ చేసింది. ఈ స్కామ్ లో కేజ్రీవాల్ ప్రమేయం ఉన్నదని ఆమె అంటున్నది.
ఈ సంఘటన జరగ్గానే సహజంగానే ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) స్పందిస్తూ, ఢిల్లీ పోలీసులు, బిజెపీ కలసి తమపార్టీపై కుట్రపన్నుతున్నాయని ఆరోపించారు. దీంతో వాగ్వివాదం చెలరేగింది. ఆరోపణలు, ప్రత్యారోపణలు మామూలే. AAS గతంలో కూడా కేజ్రీవాల్ మీద, ఆయన పార్టీమీద ఘాటైన విమర్శలు చేసింది. ఈ రాజకీయ వేదికకు ప్రభాత్ కుమార్ నాయకత్వం వహిస్తున్నారు. నెమ్మదిగా ఇది శాఖోపశాఖలుగా విస్తరిస్తోంది. AAS పంజాబ్ శాఖకు భావనా అరోరా ఇన్ ఛార్జ్ గా ఉన్నట్లు తెలిసింది. క్రిందటేడాది ఒక ర్యాలీలో కేజ్రీవాల్ ప్రసంగిస్తున్న సమయంలోనే గజేంద్ర సింగ్ అనే రైతు చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ సంఘటనపై AAS కూడా తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. అప్పట్లో భావనా అరోరా ఢిల్లీలోని AAS మహిళా మోర్చాకు నాయకత్వం వహిస్తున్నారు. రైతు ఆత్మహత్యకు పూర్తి బాధ్యత AAPదేనంటూ మండిపడ్డారు. అలాగే గత ఏడాది ఏప్రిల్ లో కేజ్రీవాల్ నివాసం ఎదుట మహిళలు నిరసనకు దిగారు. ఉద్యోగాలు చేస్తున్న మహిళలకు రక్షణగా డిటిఎస్ బస్సుల్లో మార్షల్స్ ని నియోగిస్తామంటూ ఇచ్చిన హామీకి తిలోదకాలిచ్చారంటూ AAS మహిళలు ఈ ధర్నాకు దిగారు. ఆమ్ ఆద్మీ పార్టీలో అంతర్గత కుమ్ములాటలున్నాయనీ, కేజ్రీవాల్ మేధావిగా కనిపిస్తున్నా, క్రాక్ గా బిహేవ్ చేస్తున్నారంటున్నది AAS రాజకీయ వేదిక.
AAS వాలంటీర్లు బాగా చురుగ్గానే నిరసన తెలుపుతున్నారు. కేజ్రీవాల్ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన సందర్భంతో పాటుగా, ఆప్ నాయకుడైన సోమనాథ్ భారతీపై ఇంకు జల్లిన సంఘటన కూడా వీరి ఖాతాలో ఉంది. AAS వాళ్లకు ఒక ట్విట్టర్ అకౌంట్ కూడా ఉండేది. దానికి 113 మంది ఫాలోయర్స్ కూడా ఉండేవారు. కానీ అది గత ఏడాది జులై నుంచి క్రీయాశీలకంగా లేదు.