రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్… మహాభారత్. ఈ ఇతిహాస గాథని 5 భాగాలుగా రూపొందించాలన్నది రాజమౌళి కళ. ఈ సినిమా తరవాత రిటైర్ అయిపోయినా ఫర్వాలేదని చాలా సందర్భాల్లో జక్కన్న చెప్పారు కూడా. మహాభారతం నిర్మించే శక్తి, తెలివితేటలు తన దగ్గర ఇంకా లేవని, సినిమాకు సంబంధించిన టెక్నాలజీని పూర్తి స్థాయిలో అర్థం చేసుకొన్న తరవాతే… మహాభారతం స్క్రిప్ట్ చేపడతానని రాజమౌళి చెప్పేవారు. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్‌ని అమీర్‌ఖాన్ టేకప్ చేసేశారు. రాజమౌళి లాగే అమీర్కీ.. మహాభారతం అంటే ప్రత్యేకమైన ఆసక్తి. ఈ ఇతిహాసాన్ని అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కించాలన్నది అమీర్ డ్రీమ్. అందుకు సంబంధించి అమీర్ ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. మహాభారతాన్ని ఓ సిరీస్‌లా డిజైన్ చేశారు అమీర్. ఈ గాథని 5 భాగాలుగా విడగొట్టి, ఐదుగురు దర్శకులు ఒకేసారి ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కించే ప్రయత్నంలో ఉన్నారు. ఆ ఐదురుగు దర్శకులెవరు? అనేది ఇంకా చెప్పలేదు. దేశంలోని అన్ని ప్రధానమైన భాషలకు సంబంధించిన దర్శకుల్ని ఈ ప్రాజెక్ట్ లో భాగం చేయించే ప్రయత్నంలో ఉన్నారు అమీర్. ఆయన దృష్టి రాజమౌళిపై ఉంది. కనీసం ఓ భాగానికి, లేదంటే ఒక్క సీక్వెన్స్‌కి అయినా రాజమౌళితో టేకప్ చేయించాలన్న ప్రయత్నాల్లో ఉన్నారు అమీర్. రాజమౌళి గనుక ఈ ప్రాజెక్ట్‌తో చేయిగలిపితే… దీనికి అంతర్జాతీయ స్థాయి వస్తుందని అమీర్ ఆశలు పెట్టుకొన్నారు.
అమీర్‌తో రాజమౌళికి ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఇద్దరూ చాలాసార్లు కలుసుకొన్నారు. అమీర్‌తో రాజమౌళి ఓ ప్రాజెక్ట్ చేయనున్నారని కూడా వార్తలొచ్చాయి. రాజమౌళి `మహాభారతం` తీస్తే గనుక అందులో అమీర్ ఖాన్‌కు స్థానం ఉంటుందని భావించారు. ఇప్పుడు అదే ప్రాజెక్ట్ అమీర్ టేకప్ చేశారు. రాజమౌళి ఎప్పటికైనా మహాభారతం తీసే తీరుతారు. ఈలోగా అమీర్ ప్రాజెక్ట్ లో భాగం పంచుకోవడం దాదాపు అసాధ్యం. పైగా రాజమౌళి చేతిలో మహేష్ సినిమా వుంది. ఇది ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేని పరిస్థితి. ఇంత పెద్ద సినిమా చేతిలో పెట్టుకొని మరో ప్రాజెక్ట్ లో భాగం పంచుకోవడం అసాధ్యమే. కాకపోతే… అమీర్ మాత్రం తన ప్రయత్నాలు ఆపలేదని తెలుస్తోంది. రాజమౌళికి టచ్‌లో వచ్చి, మహాభారతం గురించి చర్చించాలని, ఏదోలా ఇందులో భాగం పంచుకొనేలా ప్రేరేపించాలని ట్రై చేస్తూనే ఉన్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.