బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ కు కూడా గత కొద్దినెలలుగా దేశంలో సమన్యాయం లోపించినట్లు, సహనశీలత కనుమరుగైపోయినట్లు అనిపిస్తున్నదట. దేశ ప్రజల్లో ఒకనిగా ఉన్న తనకు అభద్రతాభావం రోజురోజుకీ పెరిగిపోతున్నదని చెబుతున్నాడీ బాలీవుడ్ స్టార్. అంతేకాదు, ఆయన భార్య కిరణ్ రావ్ కూడా అలాగే భయపడిపోతున్నదనీ, పరిస్థితులు చూస్తుంటే దేశం విడిచి వెళ్ళాల్సి వచ్చేలా ఉన్నదని తనతో ఆమె అన్నదని అమీర్ ఖాన్ అంటున్నారు.
అమీర్ ఖాన్ చేసిన వ్యాఖ్యలతో కొంతలోకొంత చప్పబడిన `అసహనం’ వ్యవహారం మళ్ళీ ముదిరేసూచనలు కనబడుతున్నాయి. రాంనాథ్ గోయింకా జర్నలిస్టుల అవార్డుల కార్యక్రమంలో మాట్లాడుతూ అమీర్ ఖాన్, దేశంలో అసహనం పెరిగిపోయిందని తానుకూడా నమ్ముతున్నానని చెప్పారు.
`ఒక వ్యక్తిగా, దేశ పౌరునిగా నిత్యం న్యూస్ పేపర్లు చదువుతున్నప్పుడు, దేశంలో ఏం జరుగుతున్నదో తెలుసుకుంటున్నప్పుడు అసమానత, అసహనం పెరిగిపోతున్నట్లుగానే అనిపిస్తున్నది. జరుగుతున్న సంఘటనలు అలా ఉన్నాయి. వాటిని త్రోసిపుచ్చలేము’ అని వివరణ ఇచ్చారు.
అంతేకాదు, ఒక సందర్బంలో తన భార్య కిరణ్ తో మాట్లాడుతున్నప్పుడు ఆమెలో కూడా ఇలాంటి భయం తొంగిచూసిందని అంటున్నారు అమీర్ ఖాన్. పరిస్థితులు ఇలాగే కొనసాగుతుంటే, ఇక్కడ ఉండటంకంటే, ఏదైనా దేశానికి వెళితే బాగుంటుందేమోనని ఆమె సలహా కూడా ఇచ్చిందని అంటున్నాడీ బాలీవుడ్ స్టార్.
ఏ సమాజంలోనైనా ప్రజలకు భద్రత ఉండాలి, అలాగే, సమన్యాయం కనిపించాలి. ఆ రెండూ లోపిస్తే ఆ దేశంలో సహనశీలత లోపించినట్లేనని అమీర్ ఖాన్ భావిస్తున్నారు. దేశంలో అసహనం పెరిగిపోయినట్లు భావించి మేధావులు తమ అవార్డులను తిరిగిఇచ్చేయడాన్ని అమీర్ ఖాన్ సమర్థించారు. దీన్ని ఎవ్వరూ తప్పుపట్టలేరనీ, నిరసనను తెలియజేసే ఒక మార్గంగానే దీన్ని భావించాలని అమీర్ అంటున్నారు. సామాజిక వ్యవస్థమీద అవగాహన ఉన్న అమీర్ ఖాన్ మరి దేశాన్ని సరైన మార్గంలోకి తిప్పకుండా, అలా భార్యా పిల్లలతో వేరేదేశానికి టపా కట్టేయాలనుకోవడమేమిటో…!