‘లవ్ స్టోరీ’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి అమీర్ ఖాన్ అతిథిగా వస్తున్నాడు అనగానే – అందరి దృష్టీ ఈ ఈవెంట్ పై పడింది. అమీర్ నటిస్తున్న హిందీ సినిమాలో చైతూ ఓ కీలక పాత్ర పోషించాడు. ఆ అనుబంధంతోనే.. అమీర్ ని చైతూ ఈ వేడుకకు ఆహ్వానించాడనుకున్నారంతా. అయితే నిజానికి… చైతూ అమీర్ ఖాన్ ని పిలవలేదు. అమీర్ ఖానే అడిగి మరీ ఈ ఈవెంట్ కి వచ్చాడట. ఈ విషయాన్ని అమీర్ స్వయంగా చెప్పాడు. అంతేకాదు.. చైతూని పొగడ్తలతో ముంచెత్తాడు. ఈ వేడుకలో అమీర్ ఖాన్ మాట్లాడుతూ..
”రెండ్రోజుల క్రితం ట్రైలర్ చూశా. నాకు బాగా నచ్చింది. ఈ సినిమాకి సంబంధించిన ఓ వేడుక హైదరాబాద్ లో జరగబోతోందని తెలిసింది. అందుకే నేనే చైతూని అడిగా. ఈ ఈవెంట్ కి వస్తానని చెప్పా. ఎందుకంటే చైతూ గురించి వాళ్ల అమ్మానాన్నలకు ఓ విషయం చెప్పాలి. ఫోన్లో కాదు. నేరుగా కలిసి చెప్పాలనుకున్నా. వాళ్లందరి కంటే ముందు చైతూ అభిమానులకు చెబుతున్నా. చైతో పనిచేయడం చాలా స్పెషల్. తను మంచి నటుడే కాదు… చాలా మంచి మనిషి కూడా. ఈ విషయం చెప్పడానికే ఇక్కడికి వచ్చా. తొలిసారి తనని కలిసినప్పుడు అదే మా మొదటి పరిచయం అనిపించలేదు. చాలా కాలంగా తెలిసిన వ్యక్తిలా అనిపించాడు. చై తల్లిదండ్రులు తనకి ఎంత సంస్కారం ఇచ్చారో అర్థమైంది. షూటింగ్ అయిపోయాక తనని చాలా మిస్ అవుతున్నా. ఈ సినిమా చూడ్డానికి నేను కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. 24నే థియేటర్లో చూస్తా. మహారాష్ట్రలో స్క్రీనింగ్‌లకు ఇంకా అనుమతి లేకపోయినా ఒక్క స్క్రీన్ కోసమైనా పర్మిషన్ తెచ్చుకుంటా. సాయి పల్లవి పాటలు యూ ట్యూబ్ లో చూశా. తన సినిమాలు చూడలేకపోయా. ఎందుకంటే.. నేను పెద్దగా సినిమాలు చూడను. ఈ సినిమా మాత్రం కచ్చితంగా చూస్తా. చిత్రబృందానికి ఆల్ ది బెస్ట్” అన్నారు.