హైదరాబాద్: ఆమిర్ ఖాన్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా మత అసహనంపై మళ్ళీ చర్చకు దారితీయటమేకాక, పెద్ద రాద్ధాంతం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇండియాలో మత అసహనం పెరిగిపోతోందని, ఇక్కడనుంచి వెళ్ళిపోదామని తన భార్య కిరణ్ సూచించిందంటూ ఆ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలకుగానూ ఆమీర్ ఖాన్ ఇవాళ వివరణ ఇచ్చారు. దేశవ్యాప్తంగా తన వ్యాఖ్యలకు అనుకూలంగా, వ్యతిరేకంగా ఉద్యమాలు జరుగుతుండంతో ఇవాళ ఆమిర్ ఒక ప్రకటన విడుదల చేశారు. తనకుగానీ, తన భార్యకుగానీ ఇండియా వదిలివెళ్ళే ఆలోచన లేదని చెప్పారు. ఇండియా వదిలి వెళ్ళాలనే ఆలోచన ఉన్నట్లు చెప్పలేదని, అలా భావించేవారు తన ఇంటర్వ్యూను పూర్తిగా చూసి ఉండకపోవటం గానీ, కావాలనే తన వ్యాఖ్యలను వక్రీకరించటంగానీ చేస్తూ ఉండి ఉండొచ్చని అన్నారు. మొన్న తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని స్పష్టీకరించారు. భారతదేశం తన జన్మభూమి అని, ఇండియాను ప్రేమిస్తానని, ఇక్కడ పుట్టటం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. భారతీయుడు అయినందుకు గర్వపడుతున్నానని తనను దేశ వ్యతిరేకిగా పిలిచే వారందరికీ చెప్పాలనుకుంటున్నానని అన్నారు. దీనికిగానూ తనకు ఎవరి అనుమతి, సమర్థన అవసరంలేదని చెప్పారు.
ఈ వివాదం విషయంలో తనకు అండగా నిలిచినవారికి కృతజ్ఞతలు తెలుపుతూ, భారతదేశం యొక్క సమగ్రత, వైవిధ్యం, సంస్కృతి, భాషలు, చరిత్ర, సహనం, ప్రేమ, భావోద్వేగ బలాలను అందరం కాపాడుకోవాలని అన్నారు. చివరిగా, ‘వేర్ ది మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్’ అనే రవీంద్రనాథ్ ఠాగూర్ కవితను ఉటంకించి జైహింద్ అంటూ తన ప్రకటనను ముగించారు.