ఓటీటీ వైఖరి పట్ల ఇప్పటికే చిత్రసీమలో నిర్మాతలు విసిగిపోయారు. అసలు సినిమాని చంపేస్తోందని, థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ లేకుండా చేస్తోంది ఓటీటీనే అన్నది చాలామంది మేధావుల వాదన. ఇప్పుడు అమీర్ ఖాన్ కూడా ఇదే మాట చెబుతున్నారు. గత కొన్నేళ్లుగా బాలీవుడ్ స్థబ్దుగా ఉండడానికి, అక్కడ సినిమాలు సరిగా ఆడకపోవడానికి కారణం ఓటీటీలే అన్నది అమీర్ మాట. ఇటీవల ముంబైలో జరిగిన ఓ ఇష్టాగోష్టిలో పాల్గొన్న అమీర్ ఓటీటీలపై తనకున్న అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పారు. ”ఇది వరకు ప్రేక్షకులకు పెద్దగా అవకాశాలు ఉండేవి కావు. సినిమా చూడాలంటే థియేటర్‌కి రావాల్సిందే. ఇప్పుడు అలా కాదు. ఇంటికే సినిమా వెళ్లిపోతోంది. సినిమా విడుదలైన ఎనిమిది వారాల తరవాత ఓటీటీలో చూడొచ్చు. ఏడాది సబ్ స్క్రిప్షన్ తీసుకొన్న ప్రేక్షకుడు ఓ సినిమా కోసం 8 వారాలు ఆగడానికి ఏమాత్రం సంకోచించడు. అలాంటప్పుడు థియేటర్ వరకూ వచ్చి సినిమా ఎందుకు చూడాలి” అని ప్రశ్నించారు.
”సినిమా అనేది ఓ వస్తువు. దాన్ని మనం ప్రేక్షకులకు రెండుసార్లు అమ్మడానికి ప్రయత్నిస్తున్నాం. ఒకసారి థియేటర్లో, ఇంకోసారి ఓటీటీలో అమ్ముతున్నాం. రెండుసార్లు ఒకే వస్తువు కొనడానికి ప్రేక్షకులు అమాయకులు కాదు. సినిమా బాగుంటేనే థియేటర్లకు వస్తున్నారు. ఈ మార్పుని మనం అంగీకరించాల్సిందే” అని అమీర్ అభిప్రాయ పడ్డారు. ఈ ప్రమాదం నుంచి బయటపడాలంటే రెండే రెండు మార్గాలున్నాయి. ఒకటి.. మంచి సినిమా తీసి థియేటర్లకు ప్రేక్షకుల్ని రప్పించాలి, లేదంటే… ఓటీటీలకు లొంగిపోవాలి. థియేటర్లకు రాకపోయినా పర్వాలేదు, ఓటీటీలో జనం చూస్తే సరిపోతుంది అనుకొనేవాళ్లు మాత్రమే సినిమాలు తీయాలి.
ప్రేక్షకులు కూడా రెండు రకాలుగా ఆలోచిస్తున్నారు. మంచి సినిమాని థియేటర్లలోనే చూడాలన్నది వాళ్ల ఆశ. అందుకే పుష్ప, ఛావా, స్త్రీ లాంటి సినిమాలు థియేటర్లకు వెళ్లి చూశారు. ఓటీటీలో మళ్లీ మళ్లీ చూస్తున్నారు. ఈ మార్పుని మేకర్స్ గమనించాల్సిందే.