ఆమిర్ ఖాన్ సినిమాల జోరు తగ్గించేసారు. తనకి సరైన కథలు రాకపోవడం ఒక కారణం అయితే తను నమ్మకం పెట్టుకున్న సినిమాలు ఆశించినంతగా ఆడకపోవడం మరో కారణం. ఎన్నో ఆశలతో లాల్ సింగ్ చద్దా సినిమాని చేశారు. ఆస్కార్ సినిమా ఫారెస్ట్ గంప్ కి రిమేక్ ఇది. ఒక దేశ చరిత్రని ముడిపెడుతూ ఓ క్యారెక్టర్ చేసే జర్నీని బయోపిక్ గా తీర్చిదిద్దన ఆ కథని ఇండియా వెర్షన్ లోకి మార్చి చాలా వ్యయ ప్రయాసలతో సినిమాని తీశారు. కానీ డిజాస్టర్ రిజల్ట్ వచ్చింది. ఈ ఫలితం చూశాక కొన్నాళ్ళు సినిమాలకి దూరంగా వుండాలని నిర్ణయించుకున్నారు ఆమిర్.
అయితే ఇప్పుడు మళ్ళీ తన కెరీర్ ని ట్రాక్ లో పెట్టెపనిలో పడ్డారు. ప్రస్తుతం సితారే జమీన్ ఫర్ అనే సినిమా చేస్తున్నారు. ఇదొక స్పోర్ట్స్ డ్రామా. ఆమిర్ అభిరుచికి తగ్గకథే. అయితే ఇప్పుడున్న ట్రెండ్ వేరు. క్రేజీ కాంబినేషన్ లో క్రేజీ డైరెక్టర్స్ తో సినిమాలు సెట్ చేసుకోవాలి. అప్పుడే హైప్, రికార్డ్ ఓపెనింగ్స్ వుంటాయి.
ఈ ట్రెండ్ ని షారుఖ్ ఖాన్ పట్టుకున్నారు. ప్రస్తుతం సౌత్ డైరెక్టర్ల హవా నడుస్తోంది. సౌత్ సినిమాలకి పాన్ ఇండియా ఆడియన్స్ పట్టం కడుతున్నారు. తమిళ దర్శకుడు అట్లీతో ‘జవాన్’ చేసి ఓ మంచి హిట్ కొట్టారు షారుఖ్. నిజానికి ఇది పాత కథే అయినప్పటికీ టేకింగ్, ప్రజంటేషన్ బాలీవుడ్ జనాలకి నచ్చింది.
ఇప్పుడు ఆమిర్ కూడా అదే దారిలో ఆలోచిస్తున్నారు. లోకేష్ కనకరాజ్ తో ఓ యాక్షన్ డ్రామా చేయడానికి సన్నహాలు జరుగుతున్నట్లుగా కథనాలు వినిపిస్తున్నాయ్. నిజానికి ఇది క్రేజీ కాంబినేషనే. ఖైదీ, విక్రమ్, లియో సినిమాలతో తనకంటూ ఒక సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ చేశాడు. లోకేష్ మార్క్ లో ఆమిర్ ని చూడటం ఫ్యాన్స్ ఖచ్చితంగా కొత్తగా వుంటుంది. ఈ కాంబినేష్ కుదిరితే ఆటోమేటిక్ గా హైప్ క్రియేట్ అవుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.