ఆత్మకూరు ఉప ఎన్నికకు షెడ్యూల్ వచ్చిన సందర్భంలో ఆసక్తికరంగా పరిణామాలు మారుతున్నాయి. వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ కుమార్తె కైవల్యారెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఆమె తన భర్తతో కలిసి లోకేష్‌తో భేటీ అయ్యారు. వారు పార్టీలో చేరేందుకు ఆత్మకూరు సీటును అడిగినట్లుగా టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఆత్మకూరులో టీడీపీకి బలమైన నేత లేరు . దీంతో టీడీపీ కూడా అంగీకరించే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ఆత్మకూరు నియోజకవర్గానికి గతంలో ఆనం రామనారాయణరెడ్డి ప్రాతినిధ్యం వహించేవారు. కంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. అయితే వైసీపీలో చేరడంతో ఆయనకు ఆత్మకూరు దక్కలేదు. వెంకటగిరి ఇచ్చారు. అక్కడ్నుంచి ఆయన విజయం సాధించారు. అయితే ఈ సారి ఆయనకు టిక్కెట్ డౌటేనని ప్రచారం జరుగుతోంది. అక్కడ నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి కుమారుడ్ని జగన్ ప్రోత్సహిస్తున్నారు. ఈ క్రమంలో ఆనం ఎటూ పాలుపోని స్థితిలో ఉన్నారు. ఇప్పుడు కుమార్తెను వ్యూహాత్మకంగా టీడీపీలోకి పంపి ఆత్మకూరుపై గురి పెట్టినట్లుగా ప్రచారం జరుగుతోంది.
ఆనం కుమార్తె ఆయన అనుమతి లేకుండా టీడీపీలో చేరే అవకాశం ఉండదని భావిస్తున్నారు. మరో వైపు ఆత్మకూరుపై ఆనం ఫ్యామిలీ దృష్టి పెట్టినా ఉపఎన్నికల్లో మాత్రం కాదని అంటున్నారు. ముందస్తు ఎన్నికలు ఉంటాయని ప్రచారం జరుగుతున్న సమయంలో కొద్ది కాలం కోసం ఎన్నికల్లో పోటీ చేయడం దండగన్న అభిప్రాయంతో ఉన్నట్లుగా తెలుస్తోంది. అందుకే ఉపఎన్నికల్లో కాదని… నేరుగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి కైవల్యా రెడ్డి సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది.