ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోసారి చిక్కుల్లోపడ్డారు. నీతిమంతమైన రాజకీయాలు చేస్తున్నామంటూ ఆదరణ పొందిన ఆమ్ ఆద్మీకి ఇది గట్టి ఎదురుదెబ్బే..! ఉన్నపళంగా ప్రభుత్వ మనుగడకు వచ్చిన నష్టమేమీ కనిపించడం లేదుగానీ.. పరువు బజారున పడుతోంది కదా! 20 మంది ఆమ్ ఆద్మీ శాసన సభ్యుల్ని అనర్హులుగా ప్రకటించాలంటూ రాష్ట్రపతికి ఎన్నికల సంఘం సిఫార్సు చేయడంతో ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా సంచలనమౌతోంది. 2015లో ఈ ఎమ్మెల్యేలను పార్లమెంటు సెక్రటరీలుగా కేజ్రీవాల్ నియమించారు. ఈ నియామకాలు రాజ్యాంగ విరుద్ధం అంటూ అప్పట్నుంచే ఫిర్యాదులూ ఆరోపణలు వినిపిస్తూ వచ్చాయి. లాభదాయకమైన పదవుల్లో ఆప్ ఎమ్మెల్యేలు కొనసాగుతున్నారంటూ, వారిపై అనర్హత వేటు వేయాలంటూ ఎన్నికల సంఘం ఇన్నాళ్లకు తేల్చి చెప్పింది. అయితే, ఈ నిర్ణయంపై వెంటనే హైకోర్టును ఆమ్ ఆద్మీ పార్టీ ఆశ్రయించినా ప్రయోజనం లేకపోయింది.
దీంతో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై తీవ్ర విమర్శలకు దిగుతోంది. ఇదంతా మోడీ చేస్తున్న కుట్ర అనీ, దేశవ్యాప్తంగా మోడీ ఆటలు చెల్లుతాయేమోగానీ ఢిల్లీలో కాదనీ, తాము ఎన్నికలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామంటూ ఆప్ ఎమ్మెల్యేలు సవాళ్లు చేస్తున్నారు. ఈసీ నిర్ణయంపై సుప్రీం కోర్టుకు వెళ్తామని ఆప్ నేతలు అంటున్నారు. అయితే, రాష్ట్రపతి నిర్ణయం లోపే దీనిపై స్టే తెచ్చుకుంటే కొంత ప్రయోజనం ఉంటుంది. కానీ, పరిస్థితి చూస్తుంటే… సుప్రీం కోర్టును ఆశ్రయించినా కూడా పెద్దగా ప్రయోజనం ఉండదనే అనిపిస్తోంది. అందుకే, ఆమ్ ఆద్మీ నేతలు రాజకీయ దాడికి దిగుతున్నారు. ఈ నిర్ణయంపై అన్ని పార్టీలకంటే కాంగ్రెస్ ఎక్కువగా ఖుష్ అవుతోంది! ఎందుకంటే, ఢిల్లీలో ఆ పార్టీకి ఒక్క ఎమ్మెల్యే సీటుగానీ, ఎంపీ సీటుగానీ లేవు. అందుకే, ఢిల్లీలో ఎన్నికలు వస్తాయన్న ఆశతో మాంచి జోష్ మీద ఉంది. ఇక, భాజపా నేతలు కూడా ఎన్నికలకు సిద్ధమన్నట్టుగా ప్రకటిస్తున్నారు. ఒకవేళ ఎన్నికలే వస్తే.. ఢిల్లీ గడ్డపై రాహుల్ గాంధీ, నరేంద్ర మోడీ, అరవింద్ కేజ్రీవాల్ సత్తా ఎంత అనేది ఆసక్తికరంగా మారబోయే అవకాశం ఉంటుంది.
తాజా నిర్ణయం నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వానికి వచ్చే ఢోకా ఏమీ లేదు. ఎందుకంటే, మొత్తం 70 స్థానాలకు గానీ ఆప్ గెలుచుకున్నది 66. వీరిలో ఓ ఇరవైమంది అనర్హత వేటు పడినా, ప్రస్తుతం కేసులు ఎదుర్కొంటున్న మరో పదిమందిపై వేటు పడ్డా కూడా అధికారానికి వచ్చే ఢోకా లేదు. అయితే, తాజా పరిస్థితిని భాజపా కక్ష సాధింపు చర్యగా కేజ్రీవాల్ చిత్రించేందుకు ఎంతోకొంత ప్రయత్నం చేస్తారనే అనుకోవాలి. అలాగని, గతంలో మాదిరిగా మెరుపు నిర్ణయాలు తీసుకుని… మొత్తంగా ఎన్నికలకు వెళ్లేంత సాహసం చేసే పరిస్థితులు ప్రస్తుతం కనిపించడం లేదు. గతంతో పోల్చితే అరవింద్ కేజ్రీవాల్ దూకుడు బాగా తగ్గిపోయింది. కానీ, తాజా నిర్ణయంతో చోటు చేసుకోబోయే పరిణామాలపై మాత్రం కొంత ఆసక్తి నెలకొంది. అన్నిటికీమించి.. రాజకీయంగా ఆమ్ ఆద్మీ పార్టీకి ఇదొక మరకగానే మారుతుందనడంలో సందేహం లేదు.