హైదరాబాద్: కొద్ది రోజులుగా మీడియాలో ఆమ్ ఆద్మీ పార్టీ పబ్లిసిటీ హడావుడి ఎక్కువైన సంగతి తెలిసిందే. దినపత్రికలలో ఎడాపెడా ఫుల్ పేజ్ ప్రకటనలతోపాటు, ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా జోరుగా ప్రకటనలు గుప్పిస్తున్నారు. కేజ్రీవాల్ ప్రభుత్వ పాలనలో కరెంట్, వాటర్ బిల్లులు గణనీయంగా తగ్గిపోయాయని, ఆప్ పాలన అద్భుతంగా ఉందని ఆ ప్రకటనలలో చెప్పిస్తున్నారు. త్వరలో జరగబోయే తమిళనాడు, కేరళ, పంజాబ్, పశ్చిమ బెంగాల్, ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసమే ఆప్ ఈ హడావుడి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పంజాబ్‌లో ఎన్నికల ప్రచారానికి ఇప్పటికే శ్రీకారం చుట్టారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీ పంజాబ్‌లో నాలుగు ఎంపీ సీట్లు గెలుచుకుని ఉండటంతో(దేశం మొత్తానికి వచ్చింది ఆ నాలుగు సీట్లే) ఆ స్ఫూర్తితో అసెంబ్లీ ఎన్నికల్లో కూడా సత్తా చూపాలని ఆప్ ప్రయత్నిస్తోంది.
కేజ్రీవాల్ తన ఐదు రోజుల పంజాబ్ పర్యటనలో భాగంగా నిన్న సంగ్రూర్, మాన్సా, తల్వాండి సాబో తదితర ప్రాంతాలలో పర్యటించారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలను పరామర్శించారు. దుకాణాల యజమానులు, గ్రామస్తులతో మాట్లాడారు. తమకు అధికారం ఇస్తే పంజాబ్‌లోనూ ఢిల్లీ తరహా పాలన అందిస్తామని, అవినీతి భరతం పడతామని కేజ్రీవాల్ చెప్పారు. ఢిల్లీలో గత ఏడాదికాలంలో నిజాయతీ ప్రభుత్వం పనితీరును అందరూ చవిచూశారని, పంజాబ్‌లో అధికారంలోకి వస్తే రెండు నెలల్లో అవినీతిని రూపుమాపుతామని అన్నారు.