తెలుగు360 రేటింగ్ : 1.5/5
టైమింగ్ అనేది చాలా అవసరం. ఏ సమయానికి చేయాల్సింది అప్పుడు చేసేయాల్సిందే. లేట్… కూడదు. సినిమాల్లో అది అస్సలు పనికిరాదు. ఏదైనా వేడి వేడిగా వడ్డించేయాల్సిందే. ఆలస్యమయ్యే కొద్ది… రుచి పెరగడానికి సినిమా వైన్ కాదు. అవుడ్డేటెడ్ అయిపోతుంది. ఆరడుగుల బుల్లెట్ విషయంలోనూ ఇదే జరిగింది. ఎప్పుడో నాలుగేళ్ల క్రితం విడుదల అవ్వాల్సిన సినిమా ఇది. `ఇదిగో అదిగో` అంటూ నిర్మాతలు ప్రకటించినా చాలా కాలం లాబుల్లోనే మగ్గిపోయింది. అందుకు కారణాలు అనేకం. అయితే ఎట్టకేలకు ఈరోజు బుల్లెట్ థియేటర్ల వైపు దూసుకొచ్చింది. మరి ఈ బుల్లెట్ కి గురి కుదిరిందా? గురి తప్పిందా? నాలుగేళ్ల పాటు నలిగిన ఈసినిమా ఎలా ఉంది?
శివ (గోపీచంద్) ఓ ఆవారా. వయసొచ్చినా బాధ్యత తెలీదు. కానీ కుటుంబం అంటే ప్రేమ. తన వాళ్లపై ఈగ కూడా వాలనివ్వడు. తండ్రి మూర్తి (ప్రకాష్ రాజ్) ప్రభుత్వ ఉద్యోగి. నిజాయతీకి మారుపేరు. కొడుకు గాలికి తిరగడం, బాధ్యత లేకుండా ప్రవర్తించడం తండ్రికి నచ్చదు. ఎన్నిరకాలుగా చెప్పినా శివకి ఈ విషయం అర్థం కాదు. నయన (నయనతార)ని తొలి చూపులోనే ప్రేమించేస్తాడు. తను కూడా శివ ప్రేమని ఒప్పుకుంటుంది. కానీ… తండ్రి మాత్రం `నా కొడుకు పెళ్లికి యోగ్యుడు కాదు. నువ్వు పెళ్లి చేసుకోకు` అని నయన ముందే.. శివని అవమానిస్తాడు. అంతేకాదు… ప్రేమ పేరుతో నా ఇంట్లో పడి తింటున్నావ్.. అంటూ శివని ఇంట్లోంచి గెంటేస్తాడు. అయితే తండ్రికి కాశీ (అభిమన్యు సింగ్) అనే గుండా నుంచి ఓ ప్రమాదం వచ్చి పడుతుంది. అదేమిటి? దాన్నుంచి తన తండ్రిని, కుటుంబాన్నీ శివ ఎలా కాపాడాడు? అనేది మిగిలిన కథ.
కమర్షియల్ సినిమాలో కథని, లాజిక్కుల్నీ పట్టుకోవడం… మైసూర్ బజ్జీలో మైసూర్ ని వెదుక్కోవడం రెండూ ఒక్కటే. ఈ సినిమాలో కథలేదు. కాకరకాయ లేదు. ఫక్తు కమర్షియల్ హంగులకు ముందూ వెనుకా ఓ తోకలా ఉండడానికి ఓ కథంటూ వేసుకోవాలి కాబట్టి – ఇలా నాలుగు లైన్లు అనుకున్నారంతే. హీరో క్యారెక్టరైజేషన్ చెప్పడానికి నాలుగు సీన్లు, హీరోయిన్ తో ప్రేమ వ్యవహారం నాలుగు సీన్లు, విలన్లతో గొడవ నాలుగు సీన్లు, తండ్రితో ఎమోషన్ నాలుగు సీన్లు ఇలా వేసుకుంటూ పోయారు. మధ్యలో గ్యాపులు పూడ్చడానికి ఫస్టాఫ్ లో ఎమ్మెస్ నారాయణనీ, సెకండాఫ్ లో బ్రహ్మానందాన్ని కామెడీ సీన్లకు వాడుకున్నారు. మధ్యలో ఇంట్రవెల్ బ్యాంగ్ కోసం ఓ ఫైటు, చివర్నో క్లైమక్స్ లో గ్రూపు ఫొటో దిగడానికి ముందు మరో ఫైటూ కామనే. ఈ మధ్యలో కథ కోసమో, లాజిక్కుల కోసమే వెదుక్కోవడం అనవసరమైన ప్రయాస.
బి.గోపాల్ – గోపీచంద్ కాంబినేషన్లో కొత్త కథలు ఊహించడం అత్యాశే. కాకపోతే.. కథనం, అందులో ట్రాకులైనా కొత్తగా అనిపించాలి కదా? ఇది నాలుగేళ్లు లేటైన సినిమా కాబట్టి ఇలా ఉందిలే అనుకోవడానికి లేదు. నలభై ఏళ్లక్రితం విడుదలైనా ఇదే ఫీలింగ్ వచ్చేది. నయనతారతో లవ్ ట్రాక్‌లో అయినా దర్శకుడు కాస్త కొత్తగా ఆలోచిస్తే బాగుండేది. ప్రతీ సీనుకీ సవాలక్ష రిఫరెన్సులు దొరికేస్తుంటాయి. తండ్రీ కొడుకుల ఎమోషన్ అనేది ఈ కథకు కీలకం. దాన్ని చాలా సాదాసీదాగా రాసుకున్నారు. కాశీ అనే రౌడీ నుంచి తన కుటుంబానికి ప్రమాదం ఉంటుంది. ఆ ప్రమాదం ఎంత భయంకరంగా ఉంటే, హీరోయిజం అంత ఎలివేట్ అయ్యేది. కానీ ఫైటు కావల్సివచ్చినప్పుడు మాత్రమే కాశీ అనేవాడు రంగంలోకి దిగుతుంటాడు. నయనతార కూడా అంతే `ఇక్కడ పాట` అనగానే ఎక్కడున్నా ఆమె ప్రత్యక్షమైపోతుంటుంది. బ్రహ్మానందం కామెడీ ట్రాక్ అయితే… అదెప్పుడో భూమి పుట్టకముందు పుట్టిన ఐడియా అన్నట్టుంటుంది. మధ్య మధ్యలో కొన్ని సీన్లు సీజీలో కనిపిస్తుంటాయి. కొన్ని చోట్ల డీఐ చేయలేదు. బహుశా… బడ్జెట్ సమస్య అనుకుంటా. `ఇప్పటికే ఎక్కువైంది.. చుట్టేద్దాం` అని ఫిక్సయ్యాక ఆ సీన్లన్నీ తీసుంటారు. ఎమ్మెస్, జయప్రకాష్ రెడ్డి చనిపోయి చాలాకాలం అయ్యింది. వాళ్లిద్దరినీ తెరపై చివరి సారి చూసుకున్నం అనే ఫీలింగ్ తప్ప – ప్రత్యేకించి చెప్పుకోవడానికి ఏం లేదు.
గోపీచంద్ ఒక్కోసారి ఒక్కోలా కనిపించాడు. తను ఇలాంటి రొడ్డకొట్టుడు సినిమాలు ఇది వరకు చాలా చేశాడు. అందులో ఇదొకటి. నయనతారది ఏమాత్రం ప్రాధ్యాన్యత లేని పాత్ర. ప్రకాష్ రాజ్ తండ్రి పాత్రలు చేయడం, అభిమన్యుసింగ్ అరచుకుంటూ మీదడిపోవడం ఇవన్నీ ప్రేక్షకులకు కొత్తేం కాదు. ఎమ్మెస్ కి ఇది చివరి సినిమా. ఆయన లేకపోవడంతో డబ్బింగ్ మరొకరితో చెప్పించారు. ఆ డబ్బింగ్ కాస్త పంటికింద రాయిలా తగులుతుంటుంది. మిలిగిన పాత్రలేవీ గుర్తుండవు.
బి.గోపాల్ ఈ జనరేషన్ ని అర్థం చేసుకుని, వాళ్ల టేస్ట్ కి తగిన సినిమా తీయాలనుకోవడంలో తప్పు లేదు. కానీ కావల్సినంత కసరత్తు చేయాల్సింది. పాటలు, నేపథ్య సంగీతం… వీటిలో హోరు తప్ప ఇంకేం వినిపించలేదు. ప్రొడక్షన్ వాల్యూస్ గురించి కూడా మాట్లాడాల్సిన పనిలేదు. ఓ ముతక కథని, మరింత ముతక విధానంలో తీస్తే ఎలా ఉంటుందో అలా ఉంది ఈసినిమా.
ఫినిషింగ్ టచ్: తుప్పట్టిన బుల్లెట్
తెలుగు360 రేటింగ్ : 1.5/5