దసరా సీజన్ మొదలైపోయింది. దాంతో పాటుగా బాక్సాఫీసు దగ్గర కొత్త సినిమాలు జోరుగా వస్తున్నాయి. ఈ వారం 4 సినిమాలు వరుస కట్టబోతున్నాయి. అయితే అందరి దృష్టి కొండపొలెం మీదే. గోపీచంద్ పాత సినిమా ఆరడుగుల బుల్లెట్ ఎట్టకేలకు ఈవారమే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
క్రిష్ నుంచి వస్తున్న సినిమా కొండపొలం. అదే పేరుతో సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రాసిన నవల అది. తానా అవార్డు అందుకుంది. ఆ నవలనే సినిమాగా తీశారు. వైష్ణవ్ తేజ్ కథానాయకుడు. రకుల్ ప్రీత్ కథానాయిక. ట్రైలర్ ఆకట్టుకుంది. విజువల్ ఎఫెక్ట్స్‌కి పెద్ద పీట వేసిన సినిమా ఇది. అయినా సరే, క్రిష్ చాలా వేగంగా ఈ సినిమా తీశాడు. `హరిహర వీరమల్లు` సినిమా పక్కన పెట్టి, క్రిష్ ఈ సినిమా టేకప్ చేశాడంటే తన ధైర్యాన్ని మెచ్చుకుని తీరాలి. ఈ కథలో పులి పాత్రకీ ప్రాధాన్యం ఉంది. పులితో కథానాకుడు చేసే విన్యాసాలు ఆకట్టుకుంటాయని చిత్రబృందం చెబుతోంది. వైష్ణవ్ తొలి సినిమా `ఉప్పెన` సూపర్ హిట్ అయ్యింది. ఆ సినిమాతో యూత్ లోకి వెళ్లిపోయాడు వైష్ణవ్. కాబట్టి.. రెండో సినిమాకి మంచి ఓపెనింగ్స్ వచ్చే అవకాశం వుంది.
గోపీచంద్ సినిమా ఆరడుగుల బుల్లెట్ కూడా ఈనెల 8నే రాబోతోంది. నయనతార కథానాయిక. బి.గోపాల్ దర్శకుడు. ఎన్నోసార్లు రిలీజ్‌డేట్ ప్రకటించుకుని, ఆ తరవాత వాయిదా పడుతూ.. వస్తున్న సినిమా ఇది. ఈసారి మాత్రం పక్కా అంటున్నారు నిర్మాతలు. కొత్తగా ఓ ట్రైలర్ కట్ చేసి వదిలారు. ఫ్యామిలీ ఎమోషన్స్, యాక్షన్, కామెడీ బాగానేమిక్స్ చేసినట్టు కనిపిస్తోంది. గోపీచంద్ `సిటీమార్`కి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. నయన తార హీరోయిన్.. పైగా మాస్ సినిమా. కాబట్టి… దీనికీ ఓపెనింగ్స్ వస్తాయన్నది ఆశాభావం. ఈ రెండు సినిమాలతో పాటుగా, నేను లేని నా ప్రేమకథ, డాక్టర్ (డబ్బింగ్) సినిమాలు కూడా ఈ వారమే వస్తున్నాయి.