సుకుమార్ సినిమా అంటే లాజిక్కుతో పాటు, ఐటెమ్ పాటలు గుర్తొస్తాయి. ‘అ అంటే అమలాపురం’ దగ్గర్నుంచి ఆయన ప్రభంజనం మొదలైంది. ‘ఊ అంటావా..’ వరకూ అది కొనసాగుతూనే ఉంది. నిజానికి సుకుమార్‌కు ఐటెమ్ గీతాలంటే ఇష్టం లేదట. తన తొలి సినిమాలోనూ ఐటెమ్ పాట పెట్టాలనుకోలేదట. అదంతా దిల్ రాజు చేసిన మోసం వల్ల జరిగిపోయిందని, సరదాగా ‘ఆర్య’ నిర్మాత దిల్ రాజుపై ఫిర్యాదు చేశారు సుకుమార్.
‘దిల్ సే’లోని ‘చలె ఛయ్య.. ఛయ్య’ పాటంటే సుకుమార్ కు చాలా ఇష్టం. అలాంటి పాటే తన సినిమాలో ఉండాలనుకొన్నారు. అదే విషయం దేవిశ్రీ ప్రసాద్ కి చెబితే ఆయనేమో ‘అ అంటే’ ట్యూన్ ఇచ్చారు. ట్యూన్ తీసుకెళ్లి వేటూరికి ఇస్తే, ఆయనేమో దాన్ని ఐటెమ్ గీతంగా మార్చేశారు. అయితే పాట రెడీ చేయడానికి పెద్దగా టైమ్ లేకపోవడంతో, ఇచ్చిన లిరిక్స్ తోనే సర్దుకొని, పాట రికార్డ్ చేసేశారు. కానీ అప్పటికీ… సుకుమార్‌లో అసంతృప్తి అలానే ఉంది. ఈ పాటని ఓ పెద్ద స్టార్ హీరోయిన్ తో తీద్దామనుకొన్నారు. ఆ హీరోయిన్ని కూడా బుక్ చేసేశారు. కానీ ఆ హీరోయిన్‌కి బిజినెస్ క్లాస్ టికెట్ తీయాల్సివస్తుందని చెప్పి, చివరి నిమిషంలో కాన్సిల్ చేసి, అభినయ శ్రీని పట్టుకొచ్చారు. అభినయ శ్రీని చూసి సుకుమార్ షాకైపోయార్ట. ‘నేను అడిగిన హీరోయిన్ ఏమిటి? దిల్ రాజు ఇచ్చిన హీరోయిన్ ఏమిటి’ అంటూ తెగ మదనపడిపోయార్ట. కానీ సెట్లో అభినయ శ్రీ డాన్స్ చూసి ‘ఈ పాటకు తనే కరెక్ట్’ అని డిసైడ్ అయిపోయార్ట సుకుమార్. ఈ సంగతులన్నీ `ఆర్య` 20 ఏళ్ల వేడుకలో సుకుమార్ పంచుకొన్నారు. ”ఐటెమ్ పాటలంటేనే ఇష్టం లేనివాడ్ని. ఆ తరవాత అందులోని కిక్ ఏమిటో తెలుసుకొన్నా. అయినా నా సినిమాలో ఐటెమ్ పాట పెట్టిన దిల్ రాజు, ఆ తరవాత తన సినిమాల్లో వాటి జోలికి వెళ్లలేదు” అంటూ పాత విషయాలన్నీ గుర్తు చేసుకొన్నారు సుకుమార్.