రాసి శ్రోతల్ని
రాయకుండా నిర్మాతల్ని ఏడిపిస్తాడని – ఆత్రేయపై ఓ సెటైర్ ఉంది.
`రాస్తూ రాస్తూ నేనెంత ఏడుస్తానో` అని ఆత్రేయ కౌంటర్ కూడా ఇచ్చాడు. ఆత్రేయ దగ్గర ఉన్న పెద్ద కంప్లయింట్ త్వరగా పాటలు ఇవ్వడనే.
ఆత్రేయతో పాట రాయించుకోవాలని ప్రతి దర్శకుడికీ ఉంటుంది. కానీ.. ఒకటే భయం. ఆయన పాట ఎప్పుడు ఇస్తాడో తెలీదు. ఓ సహాయ దర్శకుడ్ని ఆత్రేయ ఇంటి దగ్గర కపలాగా ఉంచేవార్ట. ఆత్రేయ పాట ఇస్తే.. లటుక్కున తీసుకొని చటుక్కున వచ్చేయడానికి. ఆత్రేయ ఇంటి ఆవరనలోని కారు షెడ్డు.. ఇలా సహాయ దర్శకులందరికీ… విడిదిలా ఉండేది.
`ఇదిగో.. నిన్నే.. నిన్ను ఏ దర్శకుడు పంపాడు` అని పిలిచి అప్పటికప్పుడు పాట రాసిచ్చి పంపండం ఆత్రేయకు అలవాటైన పద్ధతి.
పాట రికార్డింగ్ రోజున, సెటప్ అంతా సిద్ధంగా ఉండి, గాయకుడు కూడా రెడీ గాఉండి, పాట కోసం ఆత్రేయ ఇంటికి పరుగులు పెట్టిన రోజులు ఎన్నో. పాట లేటుగా ఇచ్చినా, లేటెస్టుగా ఇస్తాడని, ఆ పాట ఓ ప్రభంజనం సృష్టిస్తుందని అందరి నమ్మకం. అందుకే ఆ ఆలస్యాన్ని ఇష్టంగా భరించారు. అలా భరించినందుకు ఎన్నో గొప్ప పాటలు ఇచ్చాడు ఆత్రేయ.
అభినందన పాటల రికార్డింగ్ జరుగుతోంది.
ఇళయరాజా పెద్ద సెటప్ తో రెడీగా ఉన్నాడు. పాట పాడడానికి బాలు కూడా రెడీ. బాలు అప్పట్లో చాలా బిజీ. ఎంత బిజీ అంటే.. పాటకు ఓ గంట మాత్రమే సమయం ఉండేది. పాట నేర్చుకుని పాడేసి, కరెక్షన్స్ ఉంటే వెంటనే వాటిని సర్దేసి, మరో పాట కోసం ఇంకో స్టూడియోకి పరుగులు పెట్టాలి. ఇదీ.. ఆయన పని తీరు. అందరూ ఉన్నా.. ఆత్రేయ నుంచి పాట రాలేదు. ఆయన ఓ చెట్టు కింద కూర్చుని ఉండడం బాలు గమనించి.. ఆయన దగ్గరకు వెళ్లారు. ఇళయరాజా అప్పటికే ట్యూను రికార్డు చేసి ఇచ్చేశారు. అది వింటున్నా.. ట్యూను సరిగా అర్థం కావడం లేదు. బాలు ఆ ట్యూను విని.. ఓ డమ్మీ రిలిక్ తో పాట పాడారు. అది విన్న ఆత్రేయ.. `ఆ.. పేపర్ అందుకో.. చెప్పేస్తా..` అంటూ అక్కడికక్కడ పాటని చెప్పేశారు. అదే..
`ప్రేమ ఎంత మధురం. ప్రియురాలు అంత కఠినం`. ఇలా ఇనిస్టెంట్ గా పాటలు రాసి హిట్టు కొట్టిన ఘనత ఆత్రేయకే చెల్లింది.
`అభినందన` పాటల పుట్టుక వెనుక ఓ విచిత్రమైన కథ ఉంది. ఇళయరాజా కి సైతం అప్పటికిప్పుడు ట్యూను ఇవ్వడం అలవాటు. ట్యూను చేసి, దాన్ని దాచుకుని, సమయానుకూలంగా వాడుకోవడం ఇష్టం ఉండదు. అంత ఖాళీ కూడా ఉండదు. కానీ ఓసారి.. తనకిష్టమైన ట్యూన్లు కొన్ని రికార్డు చేసి పెట్టుకున్నారు. అవన్నీ అయ్యాక.. ఆత్రేయని పిలిపించి – ఇవి నేను చాలా ఇష్టపడి చేసుకున్న ట్యూన్లు.. వీటికి మీరే పాటలు రాయగలరు.. అని అవన్నీ ఆత్రేయ చేతిలో పెట్టారు. ఆయన పాటలు కూర్చి.. ఇచ్చారు. ఆ తరవాత.. రికార్డు చేశాక.. దానికి అనుగుణమైన కథ రాసి.. `అభినందన` తీశారు. ఎక్కడైనా కథలోంచి పాటలు పుట్టాలి. కానీ. ఈసారి మాత్రం పాటల్లోంచి కథ పుట్టింది. అదీ.. అభినందన ఘనత. ఆ పాటలు సృష్టించిన చరిత్ర… కొత్తగా చెప్పేదేముంది..?
వాగ్దానం షూటింగ్ జరుగుతోంది.
సెట్లో అందరూ ఉన్నారు. హీరో అక్కినేని నాగేశ్వరరావుతో సహా. ఆయనే ఆ చిత్రానికి ప్రొడ్యూసర్.
దర్శకుడు ఆత్రేయ మాత్రం రాలేదు. ఆత్రేయ కోసం ఎదురు చూసి ఎదురు చూసి విసుగొచ్చిన వేళ.. ఆయన తీరిగ్గా వచ్చారు.
`ఏంటి.. ఇంత ఆలస్యమైంది` అని అక్కినేని అడిగితే..
`ఓ బద్దకస్తుడైన రచయితని పెట్టుకున్నాను. తన వల్లే ఇంత ఆలస్యం` అన్నారు ఆత్రేయ.
అన్నట్టు ఆ చిత్రానికి రచయిత కూడా ఆత్రేయనే.
(ఈరోజు ఆత్రేయ శత జయంతి సందర్భంగా)