aay movie review
తెలుగు360 రేటింగ్: 2.75/5
చిన్న సినిమాకి ఒక అడ్వాంటేజ్ వుంది. సినిమాపై పెద్ద అంచనాలు వుండవు. చూస్తున్నంత సేపు కాలక్షేపమైపొతే చాలు. పాసైపోయినట్లే. బహుశా ఇదే నమ్మకంతో ఒకేరోజు మూడు పెద్ద సినిమాలు బాక్సాఫీసు ముందుకు వచ్చినప్పటికీ వెనక్కి తగ్గలేదు ‘ఆయ్’. గీతా ఆర్ట్స్ లాంటి పెద్ద బ్యానర్ అయినప్పటికీ పెద్ద స్టార్ ఎట్రాక్షన్ లేని చిన్న సినిమానే ఇది. అయితే కంటెంట్ పై మీద నమ్మకంతో పంద్రాగస్ట్ బరిలో దించారు. మరా నమ్మకం నిజమైయిందా? ఈ ఫ్రెండ్స్ కథ కితకితలు పెట్టించిందా?
అది అమలాపురం. కరోనా తగ్గుముఖం పట్టిన రోజులవి. అడబాల బూరయ్య (వినోద్ కుమార్) కొడుకు కార్తీక్ (నార్నె నితిన్). తనది హైదరాబాద్ లో ఉద్యోగం. కరోనా కారణంగా వూర్లోనే వర్క్ ఫ్రమ్ హోం చేసుకుంటూ చైల్డ్ వుడ్ ఫ్రెండ్స్ హరి (అంకిత్ కోయ), సుబ్బు (రాజ్ కుమార్ కసిరెడ్డి)తో టైం పాస్ చేస్తుంటాడు. ఆ పక్క ఊరిలో వుండే వీరవాసరం దుర్గ (మైమ్ గోపి) కూతురు పల్లవి (నయన్ సారిక). దుర్గకి కులం పట్టింపులు ఎక్కువ. తన కులానికి చెందిన అమ్మాయిని వేరే కులం వాడు పెళ్లి చేసుకున్నాడని అతని చేయి నరికేసిన చరిత్ర తనది. పల్లవికీ క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువ. కులమే మన బలం అని వాట్సప్ లో ఓ గ్రూప్ కూడా మెంటైన్ చేస్తుంటుంది. మీరు ఏమిట్లని అడిగిన తర్వాత మాట కలుపుతుంది. అలాంటి పల్లవిని చూసి తొలిచూపులోనే ఇష్టపడతాడు కార్తీక్. పల్లవి కూడా కార్తిక్ ని ఇష్టపడుతుంది. అయితే కార్తిక్ ది తన కులం కాదని తెలుసుకొని దూరం పెడుతుంది. తర్వాత ఏం జరిగింది? అంత సింపుల్ గా పల్లవి తన ప్రేమని ఎలా వదిలేసింది ? తన ప్రేమ కోసం కార్తిక్ ఏం చేశాడు? ఈ ప్రేమ కథలో ఫ్రెండ్స్ పాత్ర ఏమిటి? చివరికి కార్తిక్ పల్లవి కలిశారా? ఇది తక్కిన కథ.
కులాన్ని దాటి స్నేహాన్ని గెలిపించిన కథ ఇది. ఇలాంటి టాపిక్స్ ని వినోదాత్మకంగా హ్యాండిల్ చేయడం కత్తిమీద సాము. అయితే ఈ పనిని చాలా నేర్పుగా చేశాడు కొత్త దర్శకుడు అంజి. ఇది ఇప్పటివరకూ రాని కొత్త కధేం కాదు. చూసిన కథ, తెలిసిన పాత్రలనే కాస్త ఫ్రెష్ గా ప్రజెంట్ చేశాడు. కార్తిక్ ని హాస్పిటల్ లో చేర్పించే సన్నివేశంతో కథ మొదలౌతుంది. ఈ సినిమాకి బలం కామెడీ. ఆ కామెడీ గేర్ లోకి రావడానికి కాస్త టైం పట్టింది. కార్తిక్ పల్లవి వెంటపడే సన్నివేశాలు రొటీన్ గానే వుంటాయి. ముగ్గురు స్నేహితుa పరిచయ సన్నివేశాలు కూడా అంత నవ్వు తెప్పించేలా వుండవు. ఎప్పుడైతే ఇద్దరూ ఫ్రండ్స్ ఒకే అమ్మాయిని ప్రేమించారని తెలుస్తుందో అక్కడి నుంచి కామెడీ అర్గానిక్ గా జనరేట్ అయిపోతుంది.
ముఖ్యంగా ఈ క్రెడిట్ రాజ్ కుమార్ కసిరెడ్డికే దక్కుతుంది. తన ప్రేమని మగసిరితో గెలిపించుకుంటానని గొప్పలకు పోయి తీరా అమ్మాయి నుంచి వచ్చిన అన్సర్ విని షాక్ అయిన విధానం, ఆ సన్నివేశాల్లో అతని నటన పగలబడి నవ్వేలా చేస్తుంది. డైరెక్టర్ కి ఆ సీన్ తో మంచి పట్టు దొరికిపోయింది. ఇంటర్వెల్ వరకూ నవ్వులతో పరిగెత్తించాడు. ఇంటర్వెల్ వచ్చే ట్విస్ట్ కి ఫ్రెండ్స్ షాక్ అయిన విధానం చూసి ఆడియన్స్ కు నవ్వాగదు.
ఇంటర్వెల్ తర్వాత కథ కాస్త వన్ సైడ్ లవ్ కోణంలో నడుస్తుంది. ఇది ప్రేమ కథ కాదు కదా ఎందుకు ఇన్ని సీన్లు ఆ ట్రాక్ కోసం వాడుతున్నారనే క్వశ్చన్ తొలుస్తుంటుంది. అయితే ప్రీక్లైమాక్స్ లో హీరోయిన్ కోణం నుంచి వచ్చే సన్నివేశాలు వాటిని బ్యాలెన్స్ చేయగలిగాయి. రెండో సగంలో కూడా వినోదానికి పెద్ద లోటు వుండదు. కార్తిక్ కి హెల్ప్ చేయాలనే తాపత్రయంతో సుబ్బు, హరి చేసే పనులు, మర్డర్ ప్లాన్స్, అంతకుమందు ఆడిన క్రికెట్ మ్యాచ్, పోలీస్ స్టేషన్ సీన్.. ఇవన్నీ కావాల్సిన నవ్వులు పంచుతాయి. కథకు దర్శకుడు ఇచ్చుకున్న ముగింపు బావుంది. వినోద్ కుమార్ పాత్రకు ఏదో బ్యాక్ స్టొరీ వుందని ముందు నుంచి అర్ధమౌతూనే వుంటుంది. అయితే ఆ బ్యాక్ స్టోరీని రివిల్ చేసిన తీరు ఫీల్ గుడ్ గా వుంటుంది.
నార్నె నితిన్ తొలి సినిమా కంటే మెరుగయ్యాడు. కొన్ని సీన్స్ ని నేచురల్ గా చేశాడు. అయితే ఈ రెండు సినిమాల్లో అతని నటన గమనిస్తే క్యారెక్టర్ సైకీ తను ఇంకాస్త డీప్ గా అర్ధం చేసుకోవాలన్న భావన కలుగుతోంది. క్యారెక్టర్ లో ఇంకా ఇన్వాల్వ్ అవ్వాలి. కొన్ని చోట్ల క్లూలెస్ ఫేస్ తో కనిపిస్తున్నాడు. దాన్ని సరిచేసుకోవాలి. నయన్ సారిక అందంగా వుంది. ప్రీక్లైమాక్స్ లో తన పెర్ఫార్మెన్స్ బావుంది. రాజ్ కుమార్ కసిరెడ్డి కి ఫుల్ మార్కులు పడిపోతాయి. తన టైమింగ్, డిక్షన్ తో సినిమాని నిలబెట్టేశాడు. అంకిత్ కొయ్య చాలాకీగా కనిపించాడు. అయితే తనది కాస్త అడల్ట్ టచ్ వున్న క్యారెక్టర్. అది అందరికీ నచ్చకపోవచ్చు. వినోద్ కుమార్, మైమ్ గోపీల పాత్రల చివర్లో భలే కుదిరాయి. ఓ తాత సెల్ ఫోన్ పట్టుకొని తిరుగుతుంటాడు. అది కూడా అడల్ట్ కామెడీ కోవలోకే వస్తుంది కానీ చాలా చోట్ల థియేటర్ ఘెల్లున నవ్వేలా చేసింది.
చిన్న సినిమా అయినప్పటికీ నిర్మాణంలో రాజీపడలేదు. మ్యూజిక్, కెమరాపనితనం ఆహ్లాదకరంగా వున్నాయి. మొత్తం అమలాపురమే కావడంతో ఎటుచూసినా గ్రీనరీ కనిపిస్తుంటుంది. సినిమా అంతా దాదాపు వర్షం పడుతూనే వుంటుంది. వర్షా కాలంలో జరిగే అనుకుంటే ఓకే. విజువల్ రిచ్ నెస్ కోసం అయితే అంత అవసరం లేదు. పోనీ మణిరత్నం సినిమాలా అదేమైనా సబ్ టెక్స్ట్ అని చెప్పడానికీ ఏమీ లేదు. చాలా సార్లు నాన్ సింక్ లో కూడా వర్షం పడుతూనే వుంటుంది.
రిలేట్ చేసుకునేలా మాటలు రాసుకున్నారు. నిజానికి కులాల కోణంలో ఒక ప్రేమకథ చెప్పినప్పుడు రైటర్ చాలా బ్యాలెన్స్ గా వుండాలి. ఆ బ్యాలెన్స్ ఇందులో కనిపించింది. కులాల పేర్లు చెప్పకపోయినా ఆ ఇంటి పేర్లు, ఇద్దరు అగ్రహీరోలని రిప్రజెంట్ చేసిన రెండు పాత్రలని చూస్తే ఆ కమ్యూనిటీలు ఏమిటనేది తెలిసిపోతుంది. బలమైన క్లైమాక్స్ అప్పటివరకూ వున్న చిన్న చిన్న లోపాలని కూడా సరి చేసేస్తుంది. ‘ఆయ్’ క్లైమాక్స్ అంత చక్కగా కుదిరింది. సరదాగా కాసేపు నవ్వుకుని వద్దామని థియేటర్ లో అడుగుపెట్టిన ప్రేక్షకుడికి ఈ ఫ్రెండ్స్ కొన్ని నవ్వులైతే పంచేస్తారు. అందులో డౌట్ లేదు..అయ్.
తెలుగు360 రేటింగ్: 2.75 /5